ఆశల్ని అలాగే మిగలనివ్వకండి...

 



మనసుకు నచ్చిన పని చేసినప్పుడు లభించే తృప్తి అంతా ఇంతా కాదు. ఆ తృప్తి, ఆ ఆనందం ముందు ఏవీ సరిరావు. కానీ ఎక్కువసార్లు మన మనసుకి నచ్చిన పని చేయటానికి మనకు అవకాశం దొరకదు. మనుషులో, పరిస్థితులో, కాలమో ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంటాయి. ఒకటి రెండుసార్లు పట్టుదలగా ప్రయత్నిస్తాం. కుదరటం లేదంటూ ముడోసారికి ఆ ప్రయత్నం విరమించుకుంటాం. అందులోనూ ఆడవారి విషయంలో ఆ ఆటంకాలకి కొదవే వుండదు, పెళ్ళి, పిల్లల నుంచి మరెన్నో బాధ్యతలు కాళ్ళకి బంధం వేసి ముందుకు అడుగు వేయనివ్వవు. దాంతో ఏదో చేయాలన్న తపన కాస్తా మరుగున పడిపోతుంది. అసంతృప్తి తోడుగా మనతో ముందుకు అడుగేస్తుంది. అలా కాదు నేను నా మనసుకు నచ్చిన పని చేసి తీరాలంటూ వయసుతో సంబంధం లేకుండా కాలేజీకి వెళ్ళిన ఒకామె గురించి ఈ మధ్య చదివాను.

ఇల్లు, పిల్లలు, బాధ్యతలు అంటూ కొన్ని సంవత్సరాల పాటు తమని తాము మర్చిపోతారు ఆడవారు. బాధ్యతలు అన్నీ తీరి కాస్త సమయం దొరికింది అన్నప్పుడు క్షణాలు గంటల్లా మారిపోతాయి. కాలం కదలదు. ఏమీ చేయటానికి ఉండదు. ఇక నిరుత్సాహం, నిర్లిప్తత మేమున్నామంటూ హాయ్ చెబుతాయి. అలా తన బాధ్యతలన్నీ తీరిపోయక... హమ్మయ్య కావల్సినంత సమయం దొరికిందంటూ సంతోషించింది. అంతేనా... ఎప్పట్నుంచో తన మనసులో వున్న కోరిక తీర్చుకునే దిశగా అడుగులు వేసింది ఆమె. బాగా చదువుకోవాలన్నది ఆమె కోరికట. కానీ చదువు మధ్యలోనే పెళ్ళయిపోవటం ఆ తర్వాత బాధ్యతల మధ్య చదువు ముందుకు సాగలేదు. 60 సంవత్సరాల దగ్గరగా వచ్చేసింది వయసు. పిల్లలందరూ దూరంగా వున్నారు. కావలసినంత సమయం. అంతే చక్కగా కాలేజీలో చేరిపోయింది. డిగ్రీ మొదటి సంవత్సరం క్లాసులోకి ఈమె అడుగు పెడుతుంటే లెక్చరరు అనుకుని స్టూడెంట్స్ అంతా విష్ చేశారుట మొదటి రోజు. ఆ తర్వాత ఈమె కూడా చదువుకోవటానికి వచ్చిందని తెలుసుకుని నవ్వుకున్నారట.

కాలేజీ జీవితంమంటే సరదా, సంతోషాల కలయిక. వయసు, ఉత్సాహం ఉరకలు వేస్తుంటాయి. అలా ఉరకలు వేసే కాలేజీ స్టూడెంట్స్ కి క్లాసులో ఈ పెద్దావిడని చూస్తే మొదట్లో చిరాకుగా అనిపించేదిట. ఆవిడ అందరితో సరదాగా మాట్లాడుతూ, వాళ్ళతో పాటు క్యాంటిన్‌కి, సినిమాకి వెంట వస్తుంటే విసుగ్గా ఉండేదిట. కానీ బయటికి ఏమీ అనలేక ఆమెని తప్పించుకు తిరిగేవారు స్టూడెంట్స్. ఇలా కొంత కాలం గడిచింది. ఈ మధ్య కాలంలో తెలియకుండానే ఆమెతో మంచి అనుబంధం ఏర్పడిపోయింది. ఒక్కరోజు ఆమె రాకపోయినా తోచేదికాదు స్టూడెంట్స్‌కి.

కేవలం ఆటపాటలు, సరదా, సంతోషాలలోనే కాదు చదువులోనూ టీనేజర్స్‌తో నేను పోటీపడగలనంటూ ముందుండేవారుట ఆమె. దాంతో కాలేజీలో ఆమె అందరికీ ఎంతో ఇష్టమైన వ్యక్తిగా మారిపోయింరు.  సంవత్సరం ఆఖరి పరీక్షలలో మంచి మార్కులతో పాసయిన ఆమెని చూచి అందరూ ఆనందపడతారు. అలా మూడు సంవత్సరాలు గడచిపోతాయి. మూడేళ్ళు మూడు క్షణాలుగా గడచిపోతాయి ఆమెకి. కావల్సినన్ని జ్ఞాపకాలు స్వంతమయ్యాయి. ఫేర్‌వెల్ రోజున ఆడిపాడి ఆఖరుగా తమ తమ మనసులో మాటలు చెబుతారు ఒకొక్కరు. ఆమె వంతు వస్తుంది. అప్పుడు తనసలు కాలేజీలో ఎందుకు చేరిందో, చదువంటే తనకెంత ఇష్టమో, ఇన్ని సంవత్సరాల జీవితం తనకెన్ని ఆటుపోట్లని ఇచ్చిందో అన్ని వివరిస్తుంది. ఆఖరుగా ఈ మూడేళ్ళు నా ఇన్నేళ్ళ జీవితంలో ప్రతేకమైనవి అని చెబుతూ అందుకు అందరికీ థాంక్స్ కూడా చెబుతుంది. అందరూ భారమైన మనసులతో విడిపోతారు.

రిజల్ట్స్ వస్తాయి ఆమె యూనివర్సిటీ ఫస్ట్ వస్తుంది. అందరూ ఎంతో సంతోషిస్తారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుని సర్ ప్రైజ్‌గా ఆమె ఇంటికి వెళతారు. స్టూడెంట్స్, లెక్చరర్లు ఒకసారిగా ఆమె ఇంటికి వస్తారు. లోపలికి వెళ్ళి పూలమాలతో అభినందించాలనుకున్న వాళ్ళకి మంచంపై రిజల్టుపేపరుని గుండెలపై పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె కనిపిస్తుంది. కదిపి చూస్తే చలనం ఉండదు. అందరూ నిర్ఘాంతపోతారు. ఆమె కేన్సర్ ఆఖరి రోజులని తెలిసీ తన చిరకాల కోరిక తీర్చుకునేందుకు కాలేజీకి వచ్చింది. చదువుకుంది. ఆ తృప్తితో ప్రాణాలు విడిచింది. ఈ నిజం తెలుసుకున్న అక్కడి వారంతా బాధతో ఆమెకి వీడ్కోలు చెబుతారు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది. తీరని ఆశ మనిషిని, మనసుని బాధిస్తుంది. ఆలోచించండి.

- రమ ఇరగవరపు