సింపుల్ గా బరువు తగ్గడానికి భలే ఆసనం ఇది..!

బరువు తగ్గడానికి చాలామంది అష్టకష్టాలు పడుతుంటారు. వెయిల్ లాస్ అవుతున్నవారిని చూసి బాబోయ్.. వీళ్లు ఇంతలా బరువు ఎలా తగ్గుతున్నారు అని ఆశ్చర్యపోతుంటారు. అయితే బరువు తగ్గడం అనేది కేవలం రోజులు, వారాలలో జరిగేది కాదు. దీనికి ఆహారం నుండి శారీరక శ్రమ వరకు ప్రతీది ముఖ్యమే. ఇకపోతే జిమ్ లో కసరత్తులు చేయడం కన్నా.. మన భారతీయ ఆయుర్వేద ఋషులు ప్రసాదించిన యోగా బరువు తగ్గడానికి ఎంతో మిన్న. యోగాలో ఉన్న ఎన్నో ఆసనాలు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. క్రమం తప్పకుండా ఈ ఆసనాలు వేయడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.  అలాంటి ఆసనాలలో తాడాసనం కూడా ఒకటి. తాడాసనం ప్రతిరోజూ వేస్తే సింపుల్ గా బరువు తగ్గేయచ్చట. ఈ ఆసనం ఎలా వెయ్యాలో తెలుసుకుంటే..

తాడాసనం అనేది ముఖ్యంగా సంస్కృత పదం. సంస్కృతంలో తడ అంటే పర్వతం. ఆసనం అంటే భంగిమ లోదా పోజ్. దృఢమైన పర్వతంలా ఈ ఆసనం భంగిమ ఉండటంతో దీన్ని తాడాసనం అని అంటున్నారు.

తాడాసనం ఎలా వేయాలంటే..

తాడాసనం వేయడం చాలా సింపుల్. మొదట రెండు పాదాలను దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి.  

ఇప్పడు రెండుచేతులను తలకంటే పైకి తీసుకెళ్లాలి. తరువాత రెండు చేతివైళ్లను ఒకదాని మధ్యన ఒకటి ఉంచి చేతులను కలిపి ఉంచాలి. ఇలా కలిపిన రెండు చేతులను ముందుకు తిప్పి చేతులను పైకి ఆకాశం వైపు చూపించాలి.

ఇలా చేసినప్పుడు చేతులను వీలైనంత పైకి సాగదీయాలి. ఈ సమయంలో దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి.  ఇదే సమయంలో  నిలబడుకున్నవారు కాస్తా పాదాల మునివేళ్ల మీద నిలబడాలి. ఈ భంగిమలో 20 నుండి 30 సెకెన్లు లేదా వీలైనంత సమయం ఈ భంగిమలో ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా శ్వాస వదులుతూ సాధారణ స్థితికి రావాలి.

తాడాసనాన్ని కనీసం 10సార్లు అయినా వెయ్యాలి. ఇలా వేయడం వల్ల శరీరాకృతి మంచిగా తయారవుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

ఇంతేకాదు.. తాడాసనం వేయడం వల్ల ఇంకా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి..

శరీరాకృతి..

తాడాసనం వేయడం వల్ల శరీరాకృతి మెరుగవుతుంది. చాలామందికి కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు భుజాలు కిందికి వాలిపోయినట్టు అవుతుంటాయి. దీన్ని పెద్దలు గూని అని అంటూంటారు. ఈ గూని సమస్యను తాడాసనం వేయడం ద్వారా పరిష్కరించుకోవచ్చు. అదే విధంగా వెన్ను నొప్పి సమస్య కూడా తగ్గుతుంది.

పిల్లలు ఎత్తు పెరుగుతారు..

చిన్న పిల్లలతో తాడాసనం వేయించడం వల్ల ఎత్తు బాగా పెరుగుతారు. శరీరం సాగదీయడం వల్ల ఎత్తు పెరగడానికి సహాయపడే గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి బాగుంటుంది. ఎదిగే వయసులో పిల్లలు ఈ ఆసనం వేసేలా చూడాలి.

మానసిక ఆరోగ్యం..

మహిళలలో మానసిక సమస్యలు సాధారణంగానే ఎక్కువ. దీనికి కారణం హార్మోన్ అసమతుల్యత, నెలసరి సమస్యలు, గర్భధారణం, ప్రసవం, మెనోపాజ్ వంటివి. వీటి వల్ల ఎదురయ్యే మానసిక సమస్యలు తాడాసనం వేయడం వల్ల కంట్రోల్ లో ఉంటాయి. దీన్ని రోజూ ఆచరిస్తుంటే నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది.

శ్వాసక్రియ..

తాడాసనం వేయడం వల్ల శ్వాస క్రియ బాగుంటుంది. శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఊపిరితిత్తులు బలంగా అవుతాయి. దీర్ఘంగా ఊపిరితీసుకోవడానికి ఈ ఆసనం సహాయపడుతుంది.

బరువు..

అన్నింటికంటే ముఖ్యంగా బరువు తగ్గడంలో తాడాసనం బాగా సహాయపడుతుంది.  రోజూ తాడాసనాన్ని కనీసం 10సార్లు అయినా ప్రాక్టీస్ చేస్తుంటే శరీరంలో కేలరీలు సులువుగా బర్న్ అవుతాయి. ఇది శరీరం మొత్తాన్ని దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది.

                                                    *నిశ్శబ్ద.