మలాసనంతో  మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు సొంతం!

భారతీయ మహర్షులు ముందుతరాలకు అందించిన గొప్ప  సంపద యోగ అని చెప్పవచ్చు. ఈ యోగాలో బోలెడు ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలలో ఒక్కోదానికి ఒక్కో విధమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇప్పుడంటే ఎక్కడ చూసినా వెస్ట్రన్ టాయ్లెట్ లు వచ్చాయి. కానీ అంతకుముందు ప్రతి ఇంట్లో మలవిసర్జన మోకాళ్ల మీద కూర్చున్న భంగిమలోనే ఉండేది. ఇలా మోకాళ్లు మడిచి మలవిసర్జనకు వెళ్లడం వల్ల కడుపు కండరాల మీద ఒత్తిడి పడి మల విసర్జన సాఫీగా జరుగుతుందని ఆయుర్వేదం కూడా చెబుతుంది. అయితే ఈ ఇలా మల విసర్జనకు వెళ్లే భంగిమలో కూర్చోవడాన్ని మలాసనం అని పేర్కొంటున్నారు. మలాసనం వేయడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

ముఖ్యంగా మలాసనాన్ని గర్భవతులు కూడా వేయడం వల్ల గొప్ప ప్రయోజనాలు ఉంటాయి. గర్భిణులు, జీర్ణ సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు, కడుపునొప్పితో ఇబ్బంది పడేవారు కూడా మలాసనం వేయడం వల్ల ఆశించిన ఫలితాలు పొందుతారు.

మలాసనం వేస్తే జీర్ణసంబంధ సమస్యలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థ పూర్తీగా ఆరోగ్యంగా మారుతుంది. ఈ  ఆసనంలో కూర్చున్నప్పుడు పేగుల మీద ఒత్తిడి కలిగి పేగుల కదలిక ఆరోగ్యంగా మారుతుంది. పేగు కదలికలు బాగుంటే ఆహారం కూడా సులభంగా జీర్ణం అవుతుంది.

మలాసనం వేయడం వల్ల నడుము దృఢంగా మారుతుంది. దీన్ని క్రమం తప్పకుండా సాధన చెయ్యాలి. నడుము కండరాలు బాగా గట్టిపడతాయి. నడుము నొప్పి ఉంటే క్రమంగా తగ్గుతుంది.

ఇప్పట్లో చాలామంది మహిళలు పీసీఓయస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అయితే మలాసనం వేయడం వల్ల ఈ పీసీఓయస్ సమస్య తగ్గుతుంది. పీసీఓయస్ కారణంగా మహిళలలో సంతానోత్పత్తి కూడా తగ్గుతుంది. కాబట్టి మహిళలు మలాసనం వేస్తుంటే ఈ సమస్యలు ఉండవు.

మహిళలలో నడుము, నడుము కింద భాగాలు బలహీనంగా ఉంటాయి. ఇవి నెలసరి వల్ల కావచ్చు, ప్రసవాలు, ఆపరేషన్లు, అబార్షన్లు ఇలా చాలా కారణాలు కావచ్చు. కానీ వీటన్నింటికి మలాసనం చెక్ పెడుతుంది. నడుమును, నడుము కింది భాగాలను బలంగా మారుస్తుంది.

మహిళలలో యోని ప్రాంతం ఆరోగ్యంగా ఉండటానికి మలాసనం సహాయపడుతుంది. యోని కండరాలు దృఢంగా మారతాయి. నెలసరిలో ఇబ్బందులు, లైంగిక సమస్యలు తగ్గుతాయి.

మానసిక సమస్యలున్నవారికి కూడా మలాసనం గొప్ప ఊరట. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

                                        *నిశ్శబ్ద.