జుట్టు సిల్కీ గా మారాలంటే ఇలా ట్రై చేయండి..!
జుట్టు ఎప్పుడూ మెరుస్తూ ఉండాలని, చివర్లు చిట్లిపోకుండా ఉండాలని, సన్నగా మారకుండా, జుట్టు రాలకుండా పెరుగుతూనే ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీని కోసం పెద్ద బ్రాండ్ల నుండి షాంపూలు, నూనెలు, కండిషనర్లతో పాటు అనేక ఇతర వస్తువులను కూడా ఉపయోగిస్తారు. కానీ ఇంత చేసినా సరే.. సహజంగా మెరిసే జుట్టును పొందలేకపోతున్నారు చాలామంది. అయితే జుట్టు సిల్కీగా అందంగా ఉండటం పెద్ద కల ఏమీ కాదు. ఇంట్లోనే మూడు వస్తువులు ఉపయోగించి జుట్టును సిల్కీగా మార్చుకోవచ్చు. ఇంట్లోనే జుట్టును సిల్కీగా ఎలా మార్చుకోవచ్చు? దీని కోసం కావలసిన పదార్థాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..
మునగ పొడి..
మునగచెట్లు చాలా చోట్ల విరివిగా పెరుగుతూ ఉంటాయి. అందరూ మునగకాయలు తింటారు కానీ మునగాకు గురించి పట్టించుకోరు. మునగాకును ఎండబెట్టి పొడి చేసుకుని ఆ పొడిని జుట్టుకు వాడాలి. మునగ పొడిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా, మెరిచేలా చేస్తాయి. మునగ పొడిలో పెరుగు వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు ప్యాక్ వేసుకోవాలి. గంటసేపు తరువాత గాఢత లేని షాంపూతో తల శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మెరిసే జుట్టు సొంతమవుతుంది.
ఉల్లిపాయ రసం..
ఉల్లిపాయ రసంలో సల్ఫర్ ఉంటుందని, ఇది జుట్టు ఆరోగ్యం, పెరుగుదలను మెరుగుపరుస్తుందని చెబుతారు. వారానికి రెండు నుండి మూడు సార్లు ఉల్లిపాయ రసంతో తలకు మసాజ్ చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు సన్నగా ఉంటే లేదా సులభంగా విరిగిపోతుంటే కూడా ఇది ప్రభావవంతంగా ఉంటుంది. జుట్టుకు ఉల్లిపాయ రసాన్ని రాసుకునే పద్ధతి చాలా సులభం. ఉల్లిపాయను పేస్ట్ చేసి అందులో నుండి రసాన్ని వడగట్టాలి. దీన్ని తలకు అప్లై చేసి కనీసం ఒక అరగంట సేపు ఉండి తలస్నానం చేయాలి.
మందారపూల పొడి..
మందార అనేది జుట్టు, చర్మం రెండింటికీ ఉపయోగించే ఒక పువ్వు. ఇది జుట్టుకు చేసే మేలు గురించి మాట్లాడుకుంటే .. ఇది మన జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది, జుట్టు మూలాలను బలపరుస్తుంది, జుట్టును మందంగా చేస్తుంది, తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, జుట్టు రాలడాన్ని నివారించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది . మందార పువ్వులను సేకరించి ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవచ్చు. మందార పువ్వుల పొడిలో కాస్త పెరుగు వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి గంట సేపటి తరువాత తలస్నానం చేయాలి. ఇలా చే్స్తే జుట్టు మెరుస్తుంది.
*రూపశ్రీ.
