వివక్షను ప్రశ్నించిన మహిళ – రోసా!

కొంతమంది అంతే! అందరూ మనకెందుకులే అని సర్దుకుపోయే చోట తల ఎగరేసి నిలబడతారు. ప్రమాదం అని తెలిసి తెలిసి ప్రశ్నలను ఎదుర్కొంటారు. ‘రోసా పార్క్స్‌’ అలాంటి అమ్మాయే! రోసా గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ అమెరికాలో ఉన్న నల్లజాతివారి హక్కుల కోసం పోరాడిన తొలి మహిళ ఎవరు అంటే ఖచ్చితంగా ఆమె పేరే జవాబుగా మిగుల్తుంది.

రోసా అమెరికాలోని అలబామా రాష్ట్రంలో 1913 ఫిబ్రవరి 4న పుట్టింది. రోసా పుట్టిన కొద్దిరోజులకే ఆమె తల్లిదండ్రులు విడిపోవడంతో తన అమ్మమ్మ ఊరైనా మోంట్‌గామరీకి చేరుకుంది. అప్పటికే అమెరికాలో నల్లజాతీయుల పట్ల విపరీతమైన వివక్ష ఉండేది. వాళ్లకి శ్వేతజాతీయులతో సమానమైన హక్కులు ఉండేవి కావు. వాళ్ల స్కూళ్లు వేరుగా ఉండేవి. వాళ్ల ఇళ్లు వెలివేసినట్లుగా ఉండేవి. ఇక నల్లజాతివాడు కనిపిస్తే చాలు, భౌతికంగా దాడి చేయడానికి కూడా వెనుకాడేవారు కాదు. అదను చూసి నల్లజాతివాళ్లని అంతం చేయాలనుకునే అతివాద సంస్థలూ లేకపోలేదు. ఒకసారైతే అలాంటి అతివాదుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, రోసా వాళ్ల తాతగారు తన ఇంటి ముందు తుపాకీ పట్టుకుని నిలబడాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితులలో పెరిగింది రోసా!

ఒకపక్క నల్లజాతివారంటే వివక్ష ఉన్నప్పటికీ, దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు కొన్ని సంస్థలు కూడా లేకపోలేదు. అలాంటి ఒక సంస్థలో (NAACP) రోసా సభ్యురాలిగా ఉండేది. కానీ ఇలాంటి చిన్నా చితకా సంస్థల వల్ల పెద్ద ఉపయోగం లేకపోయేది. ప్రభుత్వానికీ, శ్వేతజాతివారికీ వ్యతిరేకంగా పోరాడేంత ధైర్యం, అవకాశం ఈ సంస్థలకు ఉండేవి కాదు. అలాంటి సమయంలోనే ఒక అనుకోని సంఘటన జరిగింది. అప్పట్లో మోంట్‌గామరీలో తిరిగే బస్సుల్లో నల్లవారికీ, తెల్లవారికీ విడివిడిగా సీట్లు కేటాయించబడి ఉండేవి. ఒకవేళ బస్సులోకి తెల్లవారు ఎక్కువగా ఉంటే, వారి కోసం నల్లవారు లేచి తమ సీట్లను అప్పగించాల్సి ఉండేది. ఎన్నో ఏళ్లుగా నల్లవారందరూ కిక్కురుమనకుండా ఈ పద్ధతికి తలొగ్గారు. 1955, డిసెంబరు 1వ తారీఖను ఒక డిపార్టుమెంట్‌ స్టోరులో పనిచేసి ఇంటికి వెళ్లేందుకు ‘రోసా పార్క్స్’ ఎప్పటిలాగే బస్సు ఎక్కారు. ఆ పూట తెల్లవారు ఎక్కువమంది బస్సులో ఎక్కడంతా తన సీట్లో కూర్చుని ఉన్న రోసాను లేచి నిలబడమని ఆదేశించాడు బస్సు డ్రైవరు జేమ్స్‌. కానీ ఏళ్ల తరబడి ఇలాంటి ఆదేశాలు వింటూ వస్తున్న రోసా అలసిపోయింది. ‘ఇక చాలు’ అనుకుంది. అందుకనే ఆమె పక్కవారందరూ లేచి నిలబడినా కూడా ఆమె తన సీటుని వదులుకునేందుకు ఒప్పుకోలేదు.


‘సీట్లోంచి లేవకపోతే నిన్ను అరెస్టు చేయించాల్సి ఉంటుంది’ అంటూ హెచ్చరించాడు డ్రైవరు. రోసాకు ఆ క్షణం తెలుసు, తను కనుక డ్రైవరు మాట వినకపోతే… అందరూ కలిసి తనను వెంటాడి వేధిస్తారని, నిలువ నీడ లేకుండా చేస్తారని. అయినా ఉన్న చోట నుంచి అంగుళం కూడా కదిలేందుకు సిద్ధపడలేదు. నిమిషాల్లో పోలీసులు వచ్చి ఆమెను అరెస్టు చేసి తీసుకుపోయారు. డిసెంబరు 5వ తేదీన ఆమెను విచారించేందుకు తీర్మానించారు. కానీ ఈ సంఘటన నల్లజాతీయులలో ఒక కొత్త కసిని రేకెత్తించింది. తన పట్ల ఉన్న వివక్షను ఎదుర్కొనేందుకు రోసా అంత పట్టుదలగా ఉంటే, ఆమెకు ఎలాంటి మద్దత ఇవ్వలేమా అనుకున్నారు. అంతే! అందరూ సమావేశమై డిసెంబరు 5న మాంట్‌గామరీలో ఉన్న బస్సులన్నింటినీ బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.

డిసెంబరు 5- ఆ రోజు విపరీతమైన వర్షం కురుస్తోంది. అయినా సరే! నల్లజాతివారంతా మైళ్ల కొద్దీ దూరాలకు నడుచుకుంటూ వెళ్లారే కానీ ఒక్కరు కూడా బస్సు ఎక్కలేదు. అంతేకాదు! ఇక నుంచి తమకు సమాన హక్కులు లభించేంతవరకూ ప్రభుత్వ బస్సులను ఎక్కేది లేదన్న నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే నగరంలోకి అడుగుపెట్టిన ‘మార్టిన్‌ లూథర్‌ కింగ్ (జూనియర్‌)’ కూడా ఈ ఉద్యమంలోకి చేరడంతో ఉద్యమానికి కొత్త బలం చేకూరింది. రోసాను కొద్దపాటి జరిమానా వేసి విడిచిపెట్టేశారు. కానీ ఈసారి నల్లజాతి వారే ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను సవాలు చేస్తూ కోర్టులో కేసు దాఖలు చేశారు. వివక్షకు వ్యతిరేకంగా ఒక పక్క కోర్టుల్లో కేసులు నడుస్తూ ఉంటే, మరో పక్క బస్సులన్నీ ఖాళీగా తిరుగుతూ ఉండేవి. నల్లజాతివారి మీద కసితో అతివాదులు ఎక్కడపడితే అక్కడ దాడులకు తెగబడటం మొదలుపెట్టారు. వారాలు, నెలలు గడుస్తున్నా కూడా రోసా, ఆమె సహచరులు తమ పోరాటాన్ని ఆపలేదు. మరోపక్క రోసాను, ఆమె భర్తను ఉద్యోగం నుంచి తొలగించి వేశారు. ఎట్టకేళకు 381 రోజుల సుదీర్ఘ ఉద్యమం తరువాత 1956, డిసెంబరు 20న అమెరికా సుప్రీంకోర్టు ఉత్తర్వులు మాంట్‌గామరీకి చేరుకున్నాయి. స్థానిక ప్రభుత్వాలు రంగు ఆధారంగా ఎలాంటి వివక్షా చూపించరాదన్నదే ఈ తీర్పులోని సారాంశం. జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచంలోనే అతి సుదీర్ఘమైన బహిష్కరణ ఉద్యమం అలా విజయవంతంగా ముగిసింది.

‘మాంట్‌గామరీ బస్‌ బాయ్‌కాట్‌’గా ప్రసిద్ధి చెందిన ఈ సంఘటన ప్రపంచ చరిత్రలో ఒక అరుదైన మలుపుగా నిలిచిపోయింది. ఆ తరువాత రోజుల్లో కూడా రోసా ప్రజల్లో మానవహక్కుల పట్ల అవగాహన కోసం ఉద్యమిస్తూనే ఉంది. ‘Rosa Parks: My Story’  పేరుతో ఆమె రాసుకున్న ఆత్మకథ కూడా ఒక  సంచలనమే! 2005, అక్టోబరు 24న తుదిశ్వాసను విడిచిన రోసా తన జీవితకాలంలో లెక్కలేనన్ని పురస్కారాలనూ, అంతకుమించిన అభిమానాన్నీ పొందారు.

- నిర్జర.