మహిళల్లో అకాల వృద్దాప్యమా.. ఈ మూడు విషయాలు తప్పక తెలుసుకోవాలి!

ఇనుము చాలా బలమైనది మరియు శక్తివంతమైనది. సుత్తితో కొట్టినా కూడా అది విరిగిపోదు, కానీ  తుప్పు మాత్రం ఇనుమును కబళిస్తుంది.  అదే విషయం శరీరానికి కూడా వర్తిస్తుంది.  కొన్ని అలవాట్లు శరీరాన్ని దెబ్బ తీస్తాయి. దానివల్ల  వయసు పైబడిన   తరువాత రావలసిన వృద్ధాప్యం ముందే  వస్తుంది. దీన్నే అకాల వృద్ధాప్యం అంటారు. ముఖ్యంగా ఇది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కారణం మహిళల శరీరం హార్మోన్స్ పరంగానూ, ఒత్తిడి కారణంగానూ వివిధ మార్పులకు లోను కావడం.

అకాల వృద్ధాప్యం  లక్షణాలు: 

 యవ్వనంలో  జుట్టు నెరిసిపోయి, బలహీనత-అలసట, శరీరంలో ఎముకల శబ్ధం, ముడతలు,  మధుమేహం రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే,  అకాల వృద్ధాప్యంతో బాధపడుతున్నారని అర్థం. దీన్ని నివారించడానికి  3 విషయాలను తప్పక తెలుసుకోవాలి. 

మూడు  అలవాట్లు తొందరగా వృద్ధాప్యం రావడానికి కారణం అవుతుంది. ఈ అలవాట్లు వృద్ధాప్యాన్ని తొందరగా తీసుకువస్తాయి. అవేంటో తెలుసుకుంటే..

మెలటోనిన్..

మెలటోనిన్ ఒక యాంటీఆక్సిడెంట్, దీనిని స్లీపింగ్ హార్మోన్ అని కూడా అంటారు. ఇది చీకటిలో లేదా రాత్రి సమయంలో మాత్రమే శరీరంలో ఉత్పత్తి అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది  పగటి వెలుగులో  ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు కూడా విడుదల అవుతుంది. నేటి కృత్రిమ జీవితాల్లో ప్రకృతికి దగ్గరగా ఉండటం తక్కువ. అందుకే రోజులో కొంతభాగం ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ఈ పని చేయడం వల్ల ఇది వృద్ధాప్యాన్ని పెంచే హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను తగ్గిస్తుంది .

వ్యాయామం..

కొంతమంది తమకు ఇష్టం వచ్చినప్పుడు శారీరక శ్రమ చేస్తుంటారు. అదే సమయంలో, కొందరు  ప్రతిరోజూ వ్యాయామం, జిమ్ లేదా నడక వంటి తేలికపాటి వ్యాయామం చేస్తారు. ఈ రెండు వర్గాల వారిని గమనిస్తే క్రమం తప్పకుండా ఒక ప్రణాళికతో వ్యాయామం చేసేవారికి వృద్ధాప్య ఛాయలు ఆమడ దూరంలో ఉంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరం సహజంగా యాంటీఆక్సిడెంట్లను విడుదల చేస్తుంది. కాబట్టి వ్యాయామం దగ్గర బోల్తా పడకండి. 

ఎక్కువగా తినడం..

ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో వేసుకుని నములుతూనే ఉంటారు చాలామంది. ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండేవారిలో  యాంటీఆక్సిడెంట్ లోపం  ఏర్పడుతుంది. దీన్ని సరిచేయడానికి, శరీరం విశ్రాంతి తీసుకోవాలి. జీర్ణవ్యవస్థ, ఇతర అవయవాలు కాస్త సేదతీరాలి.  అందుకే రోజులో  భోజనాన్ని  2 నుండి 3 సార్లు మాత్రమే తీసుకోవాలి.

ఇవే మాత్రమే కాకుండా....

రోజూ తగినంత నీరు త్రాగాలి. శరీరంలో తేమ శాతం తగ్గితే చర్మం వాడిపోతుంది. జ్యుసి పండ్లు తినాలి. ఇందులో ముఖ్యంగా నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు ఉండాలి. రోజుకు రెండు పూటలా భోజనం చేయాలి. అది కూడా సమయానికి తినడం అలవాటు చేసుకోవాలి. నానబెట్టిన డ్రై ఫ్రూట్ తినాలి. ఇవి వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. మహిళలు పై విషయాలు తెలుసుకుని ఫాలో అయితే వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచొచ్చు.

                                 *నిశ్శబ్ద.