వ్యాయామంతో మెనోపాజ్ సమస్యలు దూరం

 


రుతుక్రమం నిలిచిపోయిన మహిళలు ఎదుర్కొనే సమస్యల అన్నీఇన్నీ కావు. మానసికంగానూ, శారీరికంగానూ వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో ఒక్కసారిగా తల వేడెక్కిపోవడం (how flashes), విపరీతంగా చెమటలు పోయడం వంటి సమస్యలతో కంటి మీద కనుకే పట్టకుండా పోతుంది. వీటికి ఒకోసారి హార్మోను థెరపీని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కాస్తంత వ్యాయామం చేస్తే చాలు ఈ సమస్యలు ఇట్టే మాయమైపోతాయని అంటున్నారు నిపుణులు.

 

రుతుక్రమం (post menopause) ఆగిన స్త్రీలలో వ్యాయామం ఎంతవరకూ ప్రభావమో తేల్చుకునేందుకు స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు నడుం బిగించారు. ఇందుకోసం వారు 234 మంది స్త్రీలను గమనించారు. వీరిలో కొందరికి నిత్యం వ్యాయామం చేసే అలవాటు ఉంది. ఓ 166 మంది మాత్రం ఏ వ్యాయామమూ లేకుండా ఇంటిపట్టునే ఉండే అలవాటు కలిగి ఉన్నారు. ఈ 166 మందిలో ఓ సగం మందిని వారానికి మూడు గంటలపాటైనా వ్యాయామం చేసేలా ప్రోత్సహించారు.

 

ఇలా ఓ ఇరవై వారాలు గడిచిన తరువాత వారిలో hot flashes, అకారణంగా చెమటలు పట్టడం తగ్గినట్లు తేలింది. అంతేకాదు! రక్తపోటు, అధికబరువు వంటి సమస్యలు కూడా అదుపులోకి వచ్చాయట. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే ఈ అలవాటుని మరో ఏడాదిపాటు కనుక కొనసాగిస్తే వారిలో గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. అంతేకాదు! చాలా ఏళ్లుగా వ్యాయామం చేసే అలవాటు ఉన్న మహిళలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో... ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినవారు ఇంచుమించు అంతే ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది.

 

ఇంతకీ వ్యాయామం చేయడానికీ పోస్ట్‌ మెనోపాజ్ సమస్యలు తగ్గడానికీ మధ్య సంబంధం ఏమిటి? అంటే రెండు కారణాలు చెబుతున్నారు. వ్యాయామం చేయడం వల్ల మెదడులోని డోపమైన్‌, సెరటోనిన్‌ వంటి రసాయనాల మోతాదు పెరుగుతుందట. వీటి వల్ల ఒత్తిడి తగ్గడం, మనసు ప్రశాంతంగా ఉండటం, నిద్ర బాగా పట్టడం వంటి లాభాలు కలుగుతాయి. ఇక తరచూ వ్యాయామం చేయడం వల్ల స్త్రీలు తమ శరీరంలోని ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుకోగలుగుతారని ఇంతకుముందే తేలింది.

 

పోస్ట్‌ మెనోపాజ్‌లో వ్యాయామం వల్ల లాభం గురించి చెప్పారు సరే! ఇంతకీ ఎలాంటి వ్యాయామం చేయాలన్న దానిమీద కూడా స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. నడవడం, జాగింగ్, ఈత, సైక్లింగ్‌... ఇలా అరగంట పాటు ఒంటికి అలసట కలిగించేలా ఏ వ్యాయామాన్నయినా ఎంచుకోమని చెబుతున్నారు. వారానికి కనీసం ఓ మూడుసార్లన్నా ఈ వ్యాయామాలను చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చునట.
 

- నిర్జర.