తల్లితండ్రులు తమ పిల్లలకు ఈ ప్రపంచంలో జీవించేందుకు ఎన్నో జీవిత పాఠాలు బోధిస్తారు. ఈ పాఠాలు వారు తమ వ్యక్తిగత అనుభవాలతో పొందుతారు. మీరు కనుక మీ పిల్లలకు కొన్ని అటువంటి జీవిత పాఠాలు బోధించాలని తలిస్తే అది మీ పిల్లల చిన్నతనంలోనే చెప్పండి. పిల్లలు చాలా విషయాల్ని పెద్దల్ని అనుకరిస్తూ తెలుసుకొంటారు. అందుచేత తల్లితండ్రులు వాళ్లకి ఆదర్శప్రాయంగా ఉండి వారికి కొన్ని అలవాట్లు నేర్పించాలి. అవేమిటో చూద్దాం...
1. ప్రతీరోజూ నిద్రలేచిన తరువాత, రాత్రి పడుకోబోయే ముందు పళ్లను శుభ్రంగా తోముకోవడం నేర్పించాలి. పిల్లలకు ఊహ తెలిసినప్పటి నుండి వారికి ఆహారపు అలవాట్లను క్రమేపీ అభివృద్ధి చేయాలి.
2. పాలు తాగేటప్పుడూ, ఏదైనా తినేటప్పుడూ ఏవో ఆంక్షలు పెట్టి వారిని నివారించకూడదు.
3. అతిధుల ముందు ఎట్లా ప్రవర్తించాలో పిల్లలకు నేర్పాలి.
4. భోజనం చేసేటప్పుడు నేలమీద కాని, టేబుల్‌పైనగాని ఎట్లా జాగ్రత్తగా కూర్చోవాలో పిల్లలకు నేర్పాలి.
5. స్వీట్స్, ఐస్‌క్రీములూ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కాని అవి వారి ఆరోగ్యానికి మంచివి కావు. పిల్లలు తీపిపదార్థాల్ని ఎంత తక్కువ తింటే అంతమంచిది. తల్లులే ఇంట్లో జంతికలు లాంటివి తయారుచేస్తే వాళ్లకు ఇష్టంగానూ ఉంటుంది. ఆరోగ్యంగానూ ఉంటుంది. వారు పప్పును, ఆకుకూరలను ఎక్కువగా తినేటట్లు చేయాలి.
6 పిల్లలకు చిరుతిళ్లు ఎక్కువ ఇష్టం అని మీరు కొని తేవద్దు. వాళ్లు కూడా కొనుక్కోకుండా చూడాలి. తింటే వ్యాధులొస్తాయని, అవి తినడం వల్ల ఎదుర్కొనే ప్రమాదాలేమిటో నచ్చచెప్పాలి.
7. ఏ సీజన్‌లో దొరికే పళ్లు ఆ సీజన్‌లో తినడం ఆరోగ్యదాయకం. పండ్లు ఎక్కువగా తినే అలవాటు చేయండి.
8 . పిల్లలు ఆహారాన్ని మెత్తగా నమిలితినాలి. పాలను కూడా నెమ్మదిగానే తాగాలి.
9. పిల్లలు ఒక్కొక్కసారి చాలా అల్లరి చేస్తారు. పెద్దలకు చిరాకు కలిగినా, వారిని తిట్టి కొట్టకూడదు. కారణమేదో తెలిసికొని వారిని మెల్లగానే మందలించాలి.
10. పిల్లల్ని క్రమశిక్షణలో పెడ్తున్నామనుకొని కొందరు తరచు పిల్లలపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.తల్లిదండ్రులు పిల్లల్ని ప్రతీ చిన్న విషయానికీ దండించకూడదు. అలాంటి పిల్లలు అమాయకులుగా తయారౌతారు.
11. ఒకే ఇంటిలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలున్నప్పుడు వారి మధ్య తగాదాలు రావడం సహజం. తల్లిదండ్రులు వాళ్లని బుజ్జగిస్తూ, వారితో విడివిడిగా కొంచెంసేపు గడుపుతూ ఉండాలి. వారి మధ్య స్నేహభావం పెరిగేలా చూడాలి.
12. పిల్లలు పెంపుడు జంతువులను తాకకుండా ఉండేటట్లు దూరంగా ఉంచండి.
13. ఆ స్విచ్ వేయి, ఈ స్విచ్‌ని కట్టేయి అని మీ పిల్లలకు పనులను పురమాయించకండి. కరెంట్ వస్తువుల దగ్గరకు వాళ్లను అసలు పోనీయకండి.
14. నాణాలను, చిన్నచిన్న వస్తువుల్నీ చిన్నపిల్లలకు అందుబాటులో ఉంచకండి. వాళ్లు వాటిని మింగే ప్రమాదముంది.
15. పిల్లల్ని సరైన సమయానికి స్కూలుకు పంపి, స్కూలు అయిన వెంటనే ఇంటికి తిరిగి వచ్చేటట్లు చూడాలి. రోడ్‌పై నడిచేటప్పుడు ఫుట్‌పాత్‌పైనే నడవాలనీ, అక్కడ పరుగులు పెట్టకూడదని పిల్లలకు చెప్పాలి.
16. యూనిఫామ్‌ను, బూట్లు, టై ధరించడాన్ని పిల్లలు ఎవరికివారే చేసుకొనేటట్లు చూడాలి. అందువల్ల తల్లిదండ్రులకి కొంత శ్రమ తగ్గుతుంది. వారికి కూడా తమ పనులు తాము చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసం వస్తుంది.