వర్షంలో జుట్టు తడిస్తే ఈ జాగ్రత్తలు పాటించండి..!
.webp)
వర్షాకాలం మొదలైంది. ఒకవైపు ఎండలు ఉన్నా సరే.. చాలా ప్రాంతాలలో వర్షాలు తరచుగా పడుతూనే ఉంటున్నాయి. వర్షాలను చూసి పనులను ఎవరూ ఆపుకోరు. అయితే వర్షంలో తడవకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు తడవడం జరుగుతూ ఉంటుంది. వర్షంలో జుట్టు తడిస్తే వెంటనే శుభ్రపరచకపోతే జుట్టు సమస్యలు వస్తాయి. జుట్టు రాలిపోవడం, తేలికగా చిక్కుబడటం, డాండ్రఫ్, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ వంటివి వస్తాయి. కాబట్టి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
వర్షంలో జుట్టు తడిస్తే తీసుకోవలసిన జాగ్రత్తలు..
తడిచిన వెంటనే శుభ్రపరచాలి..
వర్షపు నీటిలో కలిసే ధూళి, మలినాలు జుట్టుకి హానికరం. అందుకే ఇంటికి వచ్చిన వెంటనే స్కాల్ప్ క్లెన్సింగ్ కోసం మైల్డ్ షాంపూ తో తల కడగాలి.
కండిషనర్ తప్పనిసరి..
వర్షంలో తడిచిన జుట్టు అలాగే వదిలేస్తే జుట్టు రఫ్ అయ్యే అవకాశం ఎక్కువ. తల కడిగిన తర్వాత సల్ఫేట్ ఫ్రీ కండిషనర్ వాడితే మెత్తగా ఉంటుంది.
జుట్టు పూర్తిగా ఆరనివ్వాలి..
తడి జుట్టు నెమ్మదిగా ఆరబెట్టుకోవాలి. జుట్టును స్వతహాగా ఆరనివ్వడం మంచిది. ఒకవేళ హెయిర్ డ్రయర్ వాడుతుంటే తక్కువ హీట్ వెలువరించేవి ఉపయోగించి జుట్టు ఆరబెట్టాలి.
వెంటనే ముడివేయకూడదు..
తడి జుట్టును జడ వేయడం లేదా జుట్టు ముడివేయడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే ఫంగస్ లేదా బ్యాక్టీరియా వృద్ధి చెందవచ్చు. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే జడ లేదా హెయిర్ స్టైల్ చేసుకోవాలి.
నెమ్మదిగా దువ్వాలి..
తడి జుట్టు బలహీనంగా ఉంటుంది. అందుకే వెడల్పాటి పళ్లు కలిగిన దువ్వెన వాడాలి. ఇది జుట్టును సాఫీగా దువ్వడంలో సహాయపడుతుంది. చిక్కులు సులువుగా విడిపోతాయి.
హెయిర్ ఆయిల్..
తల కడకముందు కొద్దిగా కోకనట్ ఆయిల్ లేదా ఆర్గాన్ ఆయిల్ ఉపయోగిస్తే జుట్టు రక్షితంగా ఉంటుంది.
హెయిర్ మాస్క్ వాడవచ్చు..
వారం లో ఒకసారి హెయిర్ మాస్క్ వాడితే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందుకోసం పెరుగు, మెంతులు, కొబ్బరి నూనె వంటి సహజ పదార్థాలు వాడటం మంచిది.
వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి..
బయటకు వెళ్లే ముందు స్కార్ఫ్, వాటర్ ప్రూఫ్ హెడ్ కవర్ లేదా హుడ్ ఉన్న జాకెట్ వాడాలి. ఇది జుట్టు తడవకుండా కాపాడుతుంది.
ఈ జాగ్రత్తలు మరవకండి..
తడిచిన జుట్టుతో నిద్ర పోకూడదు.
ఎక్కువగా హీట్ స్టైలింగ్ చేయకూడదు.
జుట్టుకు పోషకాహారం అవసరం. అందుకే ఆహారంలో ప్రొటీన్లు, ఐరన్, జింక్ ఉండాలి.
వాటర్ ఫ్రూప్ హెయిర్ సిరమ్ వాడడం ద్వారా జుట్టు మృదువుగా ఉంటుంది.
*రూపశ్రీ.



