స్వెట్టర్లు, ఉన్ని దుస్తులు ఉతికేటప్పుడు ఈ తప్పులు చేయకండి!


చలికాలం రాగానే ప్రతి ఇంట్లో ఏ అల్మరాలోనో, బీరువాల్లోనో భద్రం చేసిన ఉన్ని దుస్తులు అన్ని బయటకు తీస్తారు. వీటిలో చేతి తొడుగులు, మంకీ క్యాప్ లు, స్వెట్టర్లు, ఉన్ని దుప్పట్లు, చెవులకు రక్షణ ఇచ్చే వివిధ రకాల దుస్తులు ఉంటాయి. అయితే అన్ని రోజులు బీరువాల్లోమూలిగి ఉన్నవాటిని బయటకు తీయగానే వాటిని ఉతికి వాడటం చాలా మంది చేసే పని. కానీ ఉన్ని దుస్తులను ఉతకడంలో చాలామంది తప్పులు చేస్తారు. ఈ కారణంగా అవి తొందరగా పాడవుతాయి. ఉన్ని దారాలు పైకి పొలుసుల్లా లేచి దుస్తులను తొందరగా పాడైపోయేల చేస్తాయి. ఉన్ని దుస్తులు ఉతికేటప్పుడు అస్సలు చేయకూడని మిస్టేక్స్ తెలుసుకుంటే..

 ఉన్నితో చేసిన బట్టలు చాలా సున్నితమైనవి. వాటిని మెయింటైన్ చేయడం,  శుభ్రపరచడం చాలా జాగ్రత్తగా చేయాలి, లేకుంటే వాటి  మెరుపు,  వెచ్చదనం ఇచ్చే లక్షణాలను కోల్పోతుంది. చాలా మంది తప్పులు చేసేది ఇక్కడే.  స్వెట్టర్లను ఉతకడంలో తప్పులు చేస్తే  అవి కొన్ని రోజుల్లో పనికిరాకుండా పోయే అవకాశం ఉంటుంది.  

వాషింగ్ మెషిన్ లో వేయొద్దు..

ఉన్ని బట్టలు చాలా సున్నితంగా ఉంటాయి. వాషింగ్ మెషిన్ లో బట్టల గమనం చాలా వేగంగా ఉంటుంది. పైపెచ్చు వాషింగ్ మెషిన్ లో బట్టల మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది.  దీనివల్ల బట్టలు తీవ్రంగా దెబ్బతింటాయి. అందుకే స్వెటర్లను ఎల్లప్పుడూ చేతులతో సున్నితంగా రుద్దుతూ శుభ్రం చెయ్యాలి. . అలాగే బ్రష్‌తో కూడా రుద్దకూడదు. ఇలా ఉతికితే ఉన్ని దుస్తులు మీద పొరలు లేస్తాయి.  

నీటిలో నానబెట్టకూడదు..

స్వెటర్లు లేదా ఏదైనా ఉన్ని బట్టలు డిటర్జెంట్ నీటిలో కానీ సాధారణ నీటిలో కానీ ఎక్కువ సేపు  నానబెట్టకూడదు. దీంతో అవి త్వరగా పాడైపోతాయి. అంతేకాకుండా, దాని రంగు కూడా పోతుంది. 

డిటర్జెంట్ పౌడర్ వొద్దు..

ఏళ్ల తరబడి డిటర్జెంట్ పౌడర్ వాడే అలవాటు ఉండటంతో అందులో బట్టలు ఉతకడం మామూలే. కానీ బట్టల నుండి పౌడర్ సరిగ్గా వదలదు.   దీని కారణంగా బట్టలు పాడవుతాయి. అందువల్ల, స్వెటర్లను కడగడానికి డిటర్జెంట్ ద్రవాన్ని ఉపయోగించడం మంచిది. లిక్విడ్ డిటర్జెంట్ అయితే దుస్తులు శుభ్రం చేయడం సులువే కాదు సువాసన కూడా బాగుంటాయి.


                             *నిశ్శబ్ద.