యోగాసనాలు - 4
Yogasana - 4
యోగాసనాల్లో నియమాలు
ఆరోగ్యంతో పాటు , జ్ఞాపక శక్తిని పెంపొందించే యోగను వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ అభ్యసించవచ్చు . ఎనిమిదేళ్ళ పిల్లల నుంచి ఎనభై ఏళ్ళ వృద్ధులు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు . ప్రారంభంలో తేలిక ఆసనాలు వేస్తూ , తరవాత కష్టతరమైన ఆసనాలను ప్రాక్టీస్ చేయడం మంచిది. ఆసనాలను ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు . ఎలా పడితే అలా వేయకూడదు . వాటికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది .
1. ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని ఆసనాలు వేయడం మంచిది . ఒకవేళ ఉదయం సమయం అనుకూలం కాకపోతే సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో అయితే మంచిది . భోజనం తరవాత కనీసం నాలుగు గంటల వ్యవధి ఉండాలి.
2. యోగాసనాలు వేయడానికి ముందు టీ, కాఫీ , పళ్ళరసం , నీళ్ళు మొదలైనవి తీసుకుంటే, కనీసం అరగంట వ్యవధి ఉండాలి .
3. రోజూ ఒకే సమయానికి యోగాసనాలు వేయాలి, రోజులో ఒక్కసారే ప్రాక్టీస్ చేయాలి .
4. పరుపుల మీద, బెడ్ మీద యోగాసనాలు వేయకూడదు.
5. నేలమీద ఒక దుప్పటి గాని , మందపాటి తివాచీ గాని, చాప గాని వేసి యోగాసనాలు వేయాలి.
ఈ ప్రదేశం దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉండాలి. కిటికీల తలుపులు పూర్తిగా తీసి ఉంచాలి.
6. యోగాసనాలు వేసేటప్పుడు మాట్లాడకూడదు . నిశ్శబ్దంగా ఉండాలి.
7. బిగుతుగా ఉన్న వస్త్రాలను ధరించకూడదు. తేలిక రంగులని , వదులుగా ఉండే వస్త్రాలయితే మంచిది .
8. గడియారం , కడియం, ఉంగరాల వంటివి ధరించకూడదు .
9. ఎటువంటి ఉద్రేకం, ఉద్వేగ భావాలు లేకుండా, ప్రశాంత మనస్సుతో యోగాసనాలను అభ్యసించాలి.
10. ఆసనాల తరవాత వేడినీటి స్నానం చేయదలుచుకుంటే పదిహేను నిమిషాలు ఆగాలి.
11. శీతాకాలంలో అయితే రోజుకి నలభై నిమిషాలకు మించి యోగాసనాలు చేయకూడదు . వేసవిలో అయితే అరగంట చాలు.
12. యోగాసనాలు వేయడంతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేయాలి. ఆకలనిపిస్తే తినాలి. అప్పుడు కూడా కడుపు నిండా తినకూడదు. కడుపులో సగభాగాన్నే ఆహారంతో నింపాలి. మిగతా ఇక భాగం నీటితో నింపి, మరో భాగాన్ని గాలికి వదిలేయాలి.
13. కాఫీ గాని, టీ గాని తీసుకోదలిస్తే, రోజుకి రెండు కప్పులకన్నా ఎక్కువ తీసుకోవద్దు . యోగాసనాలని ప్రారంభించిన కొత్తలో ఒళ్ళు నొప్పులు రావచ్చు, అయినా మానకూడదు . అలవాటు ప్రకారం ప్రతి రోజు వేస్తుంటే ఆ నొప్పులు వాటంతట అవే తాగిపోతాయి .
14. యోగాసనానికి, యోగాసనానికి మధ్య కొద్దిగా విశ్రాంతి ఉండాలి.
ఇక్కడ కొన్ని యోగాసన భంగిమలను పొందుపరుస్తున్నాం గమనించగలరు .
