ఈ అమ్మాయిలు హీరోలను మించిపోయారు

 

 

అనగనగా ఓ విలన్‌. అభం శుభం ఎరుగని అమ్మాయిలను విదేశాలకు ఎగుమతి చేయడమే అతని అకృత్యం. అతని వలలో పడినవారి జీవితాలు నిశ్శబ్దంగా నాశనం అయిపోతుంటాయి. ఇంతలో హీరో వస్తాడు. తన సాహసంతో విలన్ ఆటను కట్టించి, అతని చెరలోంచి అమ్మాయిలను విడిపిస్తాడు. కనీసం పదిశాతం కమర్షియల్‌ సినిమాల్లో కనిపించే కథే ఇది. కానీ ఇదే కథను ఇద్దరు అమ్మాయిలు నిజం చేశారు.


పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్‌కు చెందిన తేజశ్వీతా ప్రధాన్‌, శివానీ గోండ్ ఇద్దరూ స్నేహితురాళ్లు. Mankind in Action for Rural Growth (MARG) అనే స్వచ్ఛంద సంస్థలో కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. అమ్మాయిలను అక్రమరవాణా చేయడానికి వ్యతిరేకంగా MARGలో ఒక విభాగం ఉంది. దానిపేరు Students Against Trafficking Club (SATC). తేజశ్వీతా, శివానీ ఇద్దరూ ఈ క్లబ్ సభ్యులు.


పశ్చిమబెంగాల్లో మైనర్‌ బాలికలను మోసం చేసి వారిని వేశ్యావృత్తిలోకి దించే వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. ఈ అప్రతిష్టలో పశ్చిమబెంగాల్‌ది దేశంలోనే మూడో స్థానం. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గత కొద్ది సంవత్సరాలుగా పోలీస్, సీబీఐలు ఎంతగా ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది సరికదా... ఏడాది ఏడాదికీ ఇలాంటి కేసుల శాతం పెరిగిపోసాగింది. తేజశ్వీతా, శివానీలు ఈ పరిస్థితి మీద దృష్టి పెట్టారు. అలాంటి సమయంలో వారికి నేపాల్‌ నుంచి తప్పిపోయిన ఒక అమ్మాయితో ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేసే అవకాశం చిక్కింది. ఆ అమ్మాయితో నిదానంగా స్నేహం చేసుకున్నారు. ఆ అమ్మాయి వ్యభిచార వృత్తిలోకి దిగేందుకు ఇంటి నుంచి పారిపోయినట్లు మాటల్లో తేలింది. తాము కూడా ఇంటి నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నామనీ, తమకి కూడా ఓ ‘అవకాశాన్ని’ కల్పించమనీ ఆ అమ్మాయిని అడగడం మొదలుపెట్టారు తేజశ్వీతా, శివానీలు. వీరి ఉత్సాహం చూసి ఆ అమ్మాయి వెనుక ఉన్న సూత్రధారులు ముందుకు వచ్చారు.


అక్రమ రవాణా వెనుక ఉన్న సూత్రధారులతో రోజుల తరబడి మాట్లాడిన తరువాత వారిలో కొంత నమ్మకం కలిగింది. ఇందుకోసం తేజశ్వీతా, శివానీలు తమ ఫొటోలని కూడా పంపవలసి వచ్చింది. ఎట్టకేలకు వారిద్దరినీ తీసుకువెళ్లేందుకు సూత్రధారులు ఒప్పుకున్నారు. భారత్‌- నేపాల్‌ సరిహద్దులో ఉన్న ఫలానా చోటకి రమ్మంటూ ఇద్దరికీ కబురు పంపారు. అంతే! వారి ఆట కట్టించే సమయం వచ్చేసిందని స్నేహితురాళ్లకి అర్థమైపోయింది. సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు మారువేషాల్లో ఆ చుట్టపక్కల కాపు కాశారు.


సూత్రధారులు చెప్పిన చోటకి స్నేహితురాళ్లిద్దరూ చేరుకున్నారు. అరగంట, గంట, రెండు గంటలు... ఓ పక్క సమయం పరిగెడుతోంది. కానీ ఎక్కడా తమని తీసుకువెళ్లేందుకు ఎవరూ ముఠా సభ్యులు రాకపోవడం చూసి వారిద్దరికి ముచ్చెమటలు పట్టాయి. ఆ దుర్మార్గులు తమ పథకాన్ని ఏమాత్రం పసిగట్టినా కూడా ప్రాణానికే ప్రమాదం అని తెలుసు. చుట్టూ పోలీసులు ఉన్నా కూడా ఎందుకో వారి గుండెలు దడదడలాడిపోయాయి. ఎట్టకేలకు నాలుగు గంటల తరువాత ఆ ముఠా సభ్యులలో ఒకరు కనిపించారు. అంతే! చుట్టూ ఉన్న పోలీసులు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. పట్టుబడిన ముఠా సభ్యురాలు అందించిన సమాచారంతో ఇతర సూత్రధారులని కూడా అరెస్టు చేశారు పోలీసులు. వారి చెరలో ఉన్న అమ్మాయిలకు కూడా విముక్తిని కల్పించారు.


తేజశ్వీతా, శివానీల సాహసం భారత ప్రభుత్వం దృష్టికి రావడంతో వారిని ఈ ఏడాది సాహసబాలుర అవార్డుకి ఎంపికచేశారు. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని 25 మంది బాలబాలకలకు ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. ఆశ్చర్యకరంగా ఈసారి అవార్డుకి ఎంపికైనా 25 మందిలో బాలికలే (13) ఎక్కువగా ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే... ప్రతిసారీ తోటి పిల్లలను కాపాడటం, దొంగలను పట్టుకోవడం వంటి సంఘటనలే ఎక్కువగా కనిపించేది. ఏకంగా ఒక వ్యభిచార ముఠాను పట్టించడం అనేది ఇదే తొలిసారి. మరి ఇది మరీమరీ చెప్పుకోవాల్సిన వార్తే కదా!
 

 

- నిర్జర.