ఐర్లండ్‌ దేశాన్ని కుదిపేస్తున్న భారతీయురాలి చావు...

 

ఇంగ్లండ్ దేశానికి పక్కనే ఉండే ఐర్లండ్‌ దేశం గురించి తెలియనివారుండరు. నిన్న ఆ దేశంలో ఓ ముఖ్యమైన విషయం మీద రిఫరెండంను నిర్వహించారు. ఇవాళ ఆ రిఫరెండం ఫలితాలు వెలువడనున్నాయి. ఇంతకీ ఏమిటా రిఫరెండం? దానికీ ఓ భారతీయురాలికీ సంబంధం ఏమిటి?

 

ఐర్లండ్‌లో ఎక్కువ మంది క్రైస్తవ మతాన్నే అనుసరిస్తుంటారు. అందుకే ఆ దేశంలో కొన్ని చట్టాలు క్రైస్తవ సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటాయి. వాటిలో ఒకటి- అబార్షన్లకు సంబంధించిన నిబంధన! క్రైస్తవ మతం ప్రకారం అబార్షన్ చేయడం అంటే హత్య చయడమే! అందుకే అక్కడ అబార్షన్లను నిషేదించారు. ఒకవేళ ఎవరన్నా కన్నుగప్పి అబార్షన్‌ చేయించుకుంటే వారికి భారీ జరిమానాతో పాటు 14 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ఈ చట్టమే ఓ భారతీయురాలి పాట యమపాశంగా మారింది.

 

ఐర్లండులో దంతవైద్యురాలుగా స్థిరపడిన సవిత హలప్పనావర్‌ అనే మహిళ 2012లో తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. అప్పటికామె మూడు నెలల గర్భిణి. సవిత కడుపులోని బిడ్డ చాలా విషమంగా ఉందని వైద్యులు తేల్చారు. దానివల్ల సవిత కూడా చనిపోతుందని హెచ్చరించారు. కానీ చట్టానికి భయపడి వైద్యులు అబార్షన్ చేయలేదు. ఫలితం! సవిత రక్తంలో ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఆమె చనిపోయింది.

 

సవిత మరణంతో ఐర్లండ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిజానికి ఇలాంటి వార్తలు వాళ్లకి కొత్తకాదు. ఐర్లండ్‌లో అత్యాచారానికి గురైన స్త్రీలు కూడా గర్భం తీయించుకోవడానికి వీల్లేదు. అందుకనే వాళ్లు రహస్యంగా ప్రమాదకరమైన మందులు వాడటమో, పక్క దేశాలకి వెళ్లి అబార్షన్‌ చేయించుకోవడమో చేస్తుంటారు. కానీ సవిత కేసు తర్వాత చట్టాలు మార్చాలన్న ఒత్తిడి మొదలైంది.

 

ఐర్లండులో ప్రస్తుతం ఉన్న అబార్షన్‌ చట్టాన్ని మార్చాలా వద్దా అని నిర్ణయించేందుకే నిన్న రిఫరెండంని చేపట్టారు. అక్కడి ప్రస్తుత ప్రధానమంత్రి లియో వరాద్కర్‌ కూడా భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి కావడం వల్ల, ఈ రిఫరెండంకు మరింత బలం చేకూరింది. ఇందుకోసం ఏకంగా 35 లక్షల మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని తెలియచేయనున్నారు. ఇప్పటికే ఐర్లండ్‌లో క్రైస్తవ నిబంధనల ప్రాధాన్యత తగ్గుతోంది. కాబట్టి ఈ రిఫరెండంను ఎలాగైనా అడ్డుకోవాలన్న ఆలోచన కూడా చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఇవాళ సాయంత్రం ఫలితం వచ్చే వరకు సవిత ఆత్మకు శాంతి చేకూరుతుందో లేదో చెప్పలేం!

-Nirjara