పిల్లలు నోట్లో వేళ్లు పెట్టుకుంటే కోప్పడుతున్నారా..ఈ నిజాలు తెలుసా!

పిల్లలు నోటిలో వేళ్లు పెట్టుకోవడం చాలా సహజం. చాలామంది తల్లిదండ్రులు దీన్ని చెడ్డ అలవాటుగా పరిగణిస్తారు.  పిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం చూడగానే తల్లిదండ్రులకు ఎక్కడలేని కోపం వస్తుంది.  తల్లిదండ్రులు వెంటనే వేళ్లను నోట్లో నుండి  బయటకు తీస్తారు. ఇది సరైనదేనా? నోటిలో వేళ్లు పెట్టడం పిల్లల పరిశుభ్రతకు మంచిది కాదని చాలామంది అబిప్రాయం. అంతేకాకుండా ఇది హాని కలిగించే అవకాశం ఉంది. అందువల్ల పిల్లల ఈ అలవాటును మాన్పించే క్రమంలో కొన్నిసార్లు పిల్లలను  కొట్టడానికి కూడా వెనుకాడరు. కానీ పిల్లల నోటిలో వేళ్లు పెట్టడం, బొటనవేలు చప్పరించడం వల్ల  ముఖ్యంగా 0 నుండి 2 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుందట.  దీని గురించి తెలుసుకుంటే..

ఉల్లాసం..

పిల్లలు తమ వేళ్లను నోటిలో పెట్టుకున్నప్పుడు అది వారిని రిలాక్స్ చేస్తుందట. నిజానికి పిల్లలు అసౌకర్యంగా ఉన్నప్పుడు లేదా ఏడుస్తున్నప్పుడు, వారి వేళ్లను చప్పరించడం ప్రశాంతతను కలిగిస్తుందట. ఇది పిల్లలు తమకు తాము ఏదైనా ఒక ఎమోషన్ నుండి బయటకు రావడంలో సహాయపడుతుందని అంటున్నారు.

దంతాలు వచ్చేటప్పుడు..

శిశువు దంతాలు బయటకు వస్తున్నప్పుడు వారి చిగుళ్ళు దురదగా, బాధాకరంగా మారుతాయి. ఈ అసౌకర్యాన్ని తగ్గించడానికి వారు తమ వేళ్లను నోటిలో పెట్టుకుంటారు. ఇది వారికి  ఓదార్పునిస్తుందట.

రోగనిరోధక శక్తి..

కొన్ని పరిశోధనల ప్రకారం పిల్లల నోటిలో వేళ్లు పెట్టడం వల్ల వారి రోగనిరోధక వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుందట.  ఎందుకంటే ఇది శరీరం తేలికపాటి బ్యాక్టీరియాను ఎదుర్కోవడం నేర్చుకోవడానికి సహాయపడుతుంది.

నోరు,  చేతిని  ఉపయోగించే  నైపుణ్యాలు..

ఈ అలవాటు నవజాత శిశువుల శరీర నియంత్రణ,  కదలిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి కూడా సహాయపడుతుందట. ఇది నోటి-చేతిని ఉపయోగించే నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. కాబట్టి పిల్లలు వేళ్లు చప్పరిస్తుంటే వారిని తిట్టి అడ్డుకోకూడదు అంటున్నారు పిల్లల వైద్యులు.

నోట్లో వేళ్లు పెట్టుకోవడం ఎప్పుడు ఆపాలి?

 పిల్లలు 3 నుండి 4 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి, నిరంతరం వేలు పీలుస్తుంటే అది వారి దంతాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. అలాంటి సందర్భంలో వెంటనే ఈ అలవాటును మాన్పించడం మంచిదని అంటున్నారు.

అతిగా వేలు చప్పరించడం వల్ల నోటిలో చర్మ వ్యాధులు లేదా బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఈ అలవాటును మానుకోవడం చాలా అవసరం.
బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత పరంగా ఈ అలవాటు మంచిది కాదు.

                         *రూపశ్రీ.