కలసి పని చేసుకుంటూ సర్దుకుపోదాం

 

 

మొన్న ఆదివారం మా ఫ్రెండ్స్ అందరం కుటుంబాలతో సహా ఓ చిన్న పార్టీలో కలిశాం. ఇక ఏముంది,ఎప్పటిలాగే మీరూ, మేమూ అంటూ శ్రీవార్లు అంతా ఓ పార్టీ, శ్రీమతులంతా ఓ పార్టీలాగా చీలిపోయి కాసేపు వాదించుకున్నాం. ఈసారి వాదనకి టాపిక్ "ఎవరు ఎవరి మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు?" అని. ఇలాంటి ఓ ప్రశ్న అడగాలే కానీ మగవాళ్ళని "పరాన్న జీవులు" అని నిరుపించేదాకా ఊరుకోము కదా మనం. అదే ప్రయత్నం చేసాం మేమూ కూడా. కాసేపు ఎంతో సరదాగా, ఆ తర్వాత మరికొంత సీరియస్ గా సాగిన మా వాద ప్రతివాదనల సారాంశం ఏంటో ఒకసారి చూద్దామా...!

మీరు మామీద ఆధారపడతారంటే మగవాళ్ళకి పౌరుషం వస్తుంది కానీ, అదెంత నిజమో వాళ్ళకి మాత్రం తెలియదా చెప్పండి ? ఆ నిజాన్ని ఒప్పుకోవటానికి కష్టమనిపించి మాతో వాదనకి దిగారు. మేము స్కూటర్ పై లిఫ్టు ఇస్తే ఆఫీసుకి టైంకి వెళతారు. మేమూ పిల్లలని చూసుకుంటే మీరు ఫ్రెండ్స్ తో పార్టీలకి వెళ్ళగలరు అంటూ ఇలా సాగిపోయింది మగవాళ్ళ వాదన. ఆ మాట అన్నారో లేదో మా సమత ఒక్క ఉదుటున వాళ్ళపై కయ్యిమని లేచింది ."ఏంటీ మేం అన్ని సిద్దం చేస్తే చక్కగా ఆఫీసుకి వెళుతూ, మమ్మల్ని దారిలో దింపటం మేం మీ మీద ఆధారపడ్డట్టా? పిల్లలని చూడటం మాకేదో సహాయపడ్డట్టు చెబుతున్నారేంటీ ? పిల్లలు మీ బాద్యత కాదా ? అన్న మా సమత ఎటాక్ కి కాసేపు కౌంటర్ లేకుండా పోయిందనుకోండి.

ఎవరు ఎవరిమీద ఎక్కువ ఆధారపడతారు ? అనగానే ఎవరికీ వారు మీరే మాపై ఆధారపడతారు. మేం లేనిదే మీకు పూట కూడా గడవదు అంటూ తెగ వాదించుకున్నాం. ఇంతలో మా సమత భర్త రమేష్ "ఓ విషయంలో మాత్రం మేం మీపై చాలా ఎక్కువ ఆధార పడతామని చెప్పాలి" అనగానే మేమంతా "హుర్రే "అంటూ అరిచాం. తీరా చూస్తే ఆయన ఏమన్నాడో తెలుసా! ఉదయాన్నే ప్రశాంతంగా పేపర్ చదువుతున్నా, టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా బోర్ గా వుంటుంది. ప్రక్కన మీ సణుగుడు ఉందనుకోండి భలే సరదాగా వుంటుంది అని అనేసాడు. అలా అనగానే రమేష్ గారి తలపై ఓ మొట్టికాయ పడిందనుకోండి.

చాలాసార్లు ఈ ఆధారపడడం అనేది భార్యాభర్తలని మానసికంగా బలహీనులని చేస్తుందట. అంటే తను ఉంది కదా అన్న భరోసా మగవారిని ఇంటి విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉండేలా చేస్తే, అన్నీ తను చూసుకుంటారులే అని భార్యలు ఎన్నో వ్యవహారాలతో భర్తపై ఆధారపడతారు. సహజంగా ఈ ఆధారపడడం అనేది ఓ అలవాటుగా మారి చివరికి నాకు చేతకాదులే అని ఎవరికివారు ప్రగాడంగా, సమ్మేతంగా మారుతుందట. అంటే ఆధారపడడం అన్నది మన "శక్తియుక్తులని" ఎదగనీయకుండా చేస్తుంది అన్నమాట. అన్ని సవ్యంగా జరిగినప్పుడు పర్వాలేదు కానీ, కదిలే కాలంలో మనం మన భాగస్వామి భాధ్యతలని మోయాల్సి వచ్చినప్పుడు తీవ్రమైన కృంగుబాటుతో నిస్సహాయంగా నిలబడతమాట.

ఈ మధ్య చేసిన ఓ అధ్యయనంలో భార్యాభర్తల మధ్య ఈ "ఆధారపడడం" అన్నది ఎంత తీవ్ర ప్రభావాలని చూపిస్తోందని పరిశీలించినప్పుడు... ఒక్కోసారి పక్కన తను లేనిదే జీవితమే లేదు అన్నంత నిస్సహాయ స్థితిలో జారిపోతున్నారట భార్యాభర్తలు. దీనికి పరిష్కారం అన్నింటిని సమర్ధించుకోగల సామర్ధ్యాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిగి ఉండగలగటం. ఆ తర్వాత ఆధారపడటం అన్నది వారి సామర్ధ్యాన్ని ఏమాత్రం దెబ్బతీయదు. అందుకే ఎవరి పనులు వారు కాక, ఎదుట వారి పనులలో కూడా కాస్త పట్టుని సాధించటానికి ప్రయత్నించాలట. ఇదండీ అసలు విషయం. మరి మీరేమంటారు ?