ఆడు మగాడ్రా బుజ్జీ!

 


మనం ఏ శతాబ్దంలో అయినా ఉండవచ్చుగాక. ఆడవాళ్లు ఎంతైనా సాధించవచ్చుగాక. కానీ ఆడపిల్లలు బలహీనురు, తెలివితక్కువవారు అన్న నమ్మకం మాత్రం మన మెదళ్లలో ఉండిపోయింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ విషయాన్ని సమాజం నిరంతరం తరతరానికీ అందచేస్తూనే వస్తోంది. అనుమానంగా ఉంటే ఈ పరిశోధన గురించి చదవండి..


హీరో అంటే మగవాడే
చిన్నపిల్లల మనసులో ఆడ, మగ తేడాలకు సంబంధించి ఎలాంటి అభిప్రాయాలు స్థిరపడిపోతాయో తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేపట్టారు. ఇందుకోసం వారు 5 నుంచి 7 సంవత్సరాల వయసు మధ్య ఉన్న కొందరు పిల్లలను ఎన్నుకొన్నారు. వీరందరికీ ఓ కథని వినిపించారు. ఆ కథలోని ముఖ్యపాత్ర ఎవరన్నది చెప్పకుండానే, ఆ పాత్ర చాలా చాలా తెలివైనదని చెప్పుకొచ్చారు. కథంతా చెప్పేసిన తరువాత ఆ తెలివైన పాత్ర ఆడవారై ఉంటారా మగవారై ఉంటారా అని అడిగితే... 5 ఏళ్ల ఆడపిల్లలు ఆడవారనీ, మగపిల్లలు మగవారనీ ఊహించారు. కానీ 6,7 వయసు ఆడపిల్లలు, మగపిల్లలు మాత్రం ఆ తెలివైన ముఖ్యపాత్ర మగవాడే అయి ఉంటాడని తేల్చేశారు. ఏ జాతి పిల్లలైనా, వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా కూడా చిన్నపిల్లల్లో ఈ వివక్ష కనిపించడం గమనార్హం.


అంతటితో ఆగలేదు
కేవలం కథ చెప్పడంతోనే పరిశోధకులు ఆగలేదు. తమ ప్రయోగంలోని రెండో దశలో భాగంగా వారికి ఓ రెండు ఆటలని పరిచయం చేశారు. నిజానికి ఆ రెండు ఆటలు ఒకే తీరున ఉన్నాయి. వాటిని ఆడే పద్ధతి, విధివిధానాలలో పెద్దగా తేడాలు లేవు. కానీ వాటి గురించి చెప్పేటప్పుడు మాత్రం ఓ ఆట ‘చాలా చాలా తెలివైనవారి కోసం’ అనీ, రెండో ఆట ‘బాగా కష్టపడేవారి కోసం’ అనీ చెప్పుకొచ్చారు. మగపిల్లలు ఈ రెండు రకాల ఆటలనీ ఆడేందుకు సిద్ధపడిపోయారు. ఆశ్చర్యంగా 6,7 వయసు ఉన్న ఆడపిల్లలు మాత్రం ‘తెలివైనవారి కోసం’ ఆడే ఆట జోలికి పోనేలేదు. అయితే 5 ఏళ్ల వయసులో మాత్రం ఆడ, మగ మధ్య ఇలాంటి తేడాలు ఏమీ కనిపించలేదు.


అదీ సంగతి!
ఆడవారు మగవారు సమానమే అంటూ పైకి ఎన్ని కబుర్లు చెబుతున్నా, సమాజంలో ఆ వివక్ష ఇంకా కనిపించకుండా కొనసాగుతూనే ఉంది. మనం చూసే సినిమాలు, టీవీ సీరియల్స్, చదివే పుస్తకాలు... ఆఖరికి జానపద కథలు సైతం స్త్రీలకంటే పురుషులు బలవంతులు, సమయస్ఫూర్తి కలిగినవారు అన్న అభిప్రాయాన్ని కలగచేస్తాయి. ఇక ‘నువ్వు ఆడపిల్లవి’ అంటూ పరోక్షంగా వినిపించే హెచ్చరికలు, పరిమితులు సరేసరి. ఇవన్నీ కూడా ఆడపిల్లల మనసు మీద చిన్నవయసులోనే ముద్ర వేసేస్తాయి. భవిష్యత్తులో వారి వ్యక్తిత్వాన్నీ, ఎంచుకునే చదువునీ, చేసే వృత్తినీ ప్రభావితం చేసేస్తాయి.

 

 

- నిర్జర.