యోగమంత ఆహారం!

ప్రస్తుత కాలంలో పాశ్చాత్య దేశాలలో కూడా ఆదరణ పొందుతున్న గొప్ప ఆధ్యాత్మిక మార్గం యోగ. భారతీయ ప్రాచీన మహర్షుల చేత అందించబడిన గొప్ప మార్గమిది. యోగ అనేది శారీరక, మానసిక సమస్యలకు చక్కని మార్గం అయినందుకే అంత గొప్ప ఆదరణ పొందింది. అయితే యోగ కేవలం ఆసనాలతో మిళితమైనది మాత్రమే కాదు యోగాలో ఆహారం కూడా ఎంతో ముఖ్యమైనది. యోగ సాధన చేసేవారు ప్రత్యేక ఆహారం తీసుకోవాలని చెబుతూ ఉంటారు. ఒకప్పుడు మహర్షులు ఆధ్యాత్మిక సాధకులు అవలంభించిన ఆహార మార్గాలు వేరు. ప్రస్తుత కాలంలో అలాంటివి పాటించాలంటే కష్టమే. అయినప్పటికీ యోగ కు ముందు తీసుకోవలసిన సులువైన ఆహారం గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని పాటించాలి.

సాధారణంగా జిమ్ చేసేవారు డైట్ ని ఫాలో అవుతారు. వ్యాయామానికి ముందు ఇది, తరువాత ఇది, బ్రేక్స్ లో ఈ లిక్విడ్స్ లాంటి మెనూ ఒకటి తయారు చేసుకుంటారు. అయితే యోగా కు అంత పెద్ద మెనూ లేకపోయినా కొన్ని పదార్థాలు ఉన్నాయి.

యోగా సాధనకు  ముందు తినేవాటిలో పండ్లే అగ్రభాగంలో ఉంటాయి. వాటిలో మొదటగా అవకాడో ముఖ్యమైనది. ఈ అవకాడోలో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో కండరాలు, కణాల పనితీరుకు ఈ ఖనిజ లవణాలు ఎంతో అవసరం. అవకాడోలో ఉండే ఖనిజ లవణాలు కండరాలు, కణాల పనితీరును క్రమబద్ధంగా ఉండేలా చేస్తాయి. పైపెచ్చు ఇది జీర్ణమవడం కష్టతరమైన సమస్య ఏమి కాదు, చాలా సులువుగానే జీర్ణమైపోతుంది. అందువల్ల ఎలాంటి జీర్ణాశయ సమస్యలు దీనివల్ల రావు. ఇంకొక విషయం ఏమిటంటే అవకాడోలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చెడ్డ కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. దీని కారణంగా అవకాడో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. 

ఇన్ని ప్రయోజనాలు కలిగిన అవకాడో తీసుకోవడం వల్ల యోగ సాధన చేయడానికి తగినట్టుగా శరీరం దృఢంగా, అనుకూలంగా మారుతుంది.

సాధారణంగానే ప్రతి డైట్ మెనూ లో ఎలాంటి అబ్జక్షన్ లేకుండా అందరూ భాగం చేసేది అరటి పండు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో ఉండే అరటిపండులో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా ప్రతి డైట్ మెనూలో దీనికి ప్లేస్ తప్పనిసరిగా ఉంటోంది. అంతేకాదు అరటిపండు కడుపు ఉబ్బరంగా ఉన్నవారికి బెస్ట్ మెడిసిన్ గా పని చేస్తుంది. కండరాల నొప్పులతో బాధపడేవారు అరటిపండు తీసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. అరటి పండును నేరుగా తినాలనే రూల్ లేదు. దీన్ని స్మూతీగానూ, ఇతర కాంబినేషన్ ఫ్రూట్స్ తో కలిపి సలాడ్ గానూ తీసుకోవచ్చు.

రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే లేదు అంటారు. అయితే యోగాకు ముందు యాపిల్ తినడం వల్ల మంచి శక్తి లభిస్తుంది. యాపిల్ లో క్షార గుణం ఉంటుంది. జీర్ణాశయంలో ఏర్పడే ఆమ్లాలను శాంతపరచడంలో ఈ యాపిల్ బాగా పనిచేస్తుంది. పైపెచ్చు యాపిల్ లో నాచురల్ షుగర్స్ ఉంటాయి. ఇవి శరీరానికి తగు మోతాదులో శక్తిని అప్పటికప్పుడు అందిస్తాయి. ఫైబర్ కంటెంట్, నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి యోగ సాధన చేసే సమయంలో ఆకలి, అతి దాహం వేయకుండా చేస్తుంది. పైగా యాపిల్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం చురుగ్గా ఉండేలా చేస్తుంది.

ప్రతిరోజు రాత్రి బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే వాటిని తినడం చాలా మంచిదని అందరూ చెబుతారు. అయితే బాదం పప్పులను అలానే తీసుకోవాలని లేదు. యోగ సాధన చేయడానికి ముందు 4 నుండి 8 వరకు నానబెట్టి పొట్టు తీసిన బాదం పప్పులను తీసుకోవడం వల్ల మంచి ఎనర్జీ సొంతమవుతుంది. బాదం పప్పులలో విటమిన్ ఇ, మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని దృఢంగా మారుస్తాయి.

పైన చెప్పుకున్న ఆహారపదార్థాలు యోగ చేయడానికి ముందు తీసుకుంటే అవి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. అలాగని అవి బరువుగా ఉండవు ఎంతో తేలికగా ఉంటాయి కాబట్టి యోగ సాధన సజావుగా సాగిపోతుంది..

                                 ◆నిశ్శబ్ద.