Sogasula Kurthalu

సొగసుల కుర్తాలు

* అందంగా కనబడే సౌకర్యవంతమైన డ్రెస్‌లోనే అసలైన ఫ్యాషన్ ఉందంటారు డిజైనర్లు. అలాంటి దుస్తుల్లో కుర్తా ఒకటి. ఎన్ని రకాల ఫ్యాషన్లు మార్కెట్లోకి వచ్చినా- కుర్తాకు ఉన్న ఆదరణ మాత్రం తగ్గటం లేదు. ఏ సందర్భంలో వేసుకున్నా అందంగా కనిపించటం కుర్తాలకున్న ప్రత్యేకత. కాటన్, లినెన్, రెయన్ బ్లెండ్స్ ఇలా వివిధ రకాల మెటీరియల్‌తో కుర్తాలను కుట్టించుకోవచ్చు. ఈ వారం ఎవరికి ఎలాంటి కుర్తాలు నప్పుతాయో చూద్దాం..

* ఎలాంటి ఫిట్? 'కుర్తా' అంటే వదులుగా ఉండేదని అర్థం. సాధారణంగా కుర్తాలు ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా నప్పుతాయి. శరీరాకృతికి తగినట్లుగా కుర్తాను కుట్టించుకోవటం వల్ల అందం రెట్టింపు అవుతుంది. సన్నని నడుము ఉన్నవాళ్లు కుర్తా నడుము భాగం వద్ద బిగుతుగా ఉండేలా కుట్టించుకోవాలి.నడుము దగ్గర లావుగా, పిరుదులు పెద్దవిగా ఉన్నవారు- పై నుంచి కిందకి ఒకే విధంగా ఉండేలా కుట్టించుకోవాలి. లావుగా, పొట్టిగా ఉండేవాళ్లు- మందంగా ఉన్న గుడ్డతో కుర్తాను కుట్టించుకోవాలి. సన్నగా ఉన్నవారు మీడియం రకం గుడ్డతో కుట్టించుకోవాలి.

* ఎంత పొడవు? పొట్టిగా ఉండేవాళ్లు- మోకాళ్ల వరకూ కుర్తా ఉండేలా కుట్టించుకోవాలి. నిలువు గీతలున్న కుర్తాలు ధరించటం వల్ల పొడవుగా కనిపిస్తారనేది మీకు తెలిసే ఉంటుంది. పొడవుగా ఉన్నవాళ్లు- నడుము కిందదాకా ఉన్న కుర్తీలను ఉపయోగిస్తే అందంగా ఉంటుంది. బాగా పొడవు ఉన్నవారు అడ్డగీతలు ఉన్న కుర్తాలను వేసుకోవాలి. ముదురు రంగు కుర్తాలను వేసుకున్నప్పుడు..బాటమ్ లేత రంగులో ఉండేలా చూసుకోవాలి.

* ఎలాంటి స్లీవ్స్? కుర్తాల స్లీవ్స్ ఫ్యాషన్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతం 1960,70ల నాటి రెట్రో ఫ్యాషన్ నడుస్తోంది. లావుగా ఉన్నవారు స్లీవ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోచేతి వరకు లేదా 3/4 లెంగ్త్ లేదా ఫుల్ సీవ్స్ కుర్తాలను కూడా వేసుకోవచ్చు. కాని అవి బిగుతుగా ఉండాలి. అప్పుడు సన్నగా కనిపిస్తారు. సన్నగా ఉండే అమ్మాయిలు బెల్, బట్టర్‌ఫ్లై, కప్స్, పఫ్స్ వంటి స్టయిల్ స్లీవ్స్‌ను ధరించవచ్చు. పొట్టిగా ఉన్నవారు 3/4 స్లీవ్స్‌ని వేసుకోవటం వల్ల కొంత డిఫరెంట్‌గా కనిపించవచ్చు. కుర్తా చేతులకు ఇటీవల కాలంలో వర్క్ చేయిస్తున్నారు. ఇవి పార్టీ వేర్‌గా బావుంటాయి.

* ఎవరికి ఏలాంటి నెక్‌లైన్? నెక్‌లైన్‌ను- మెడ, భుజాలు, ఛాతి, ముఖంల ఆధారంగా నెక్‌లైన్‌ను ఎంచుకోవాలి. డీప్ నెక్‌లైన్‌కు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంటుంది. భుజాలు చిన్నగా (నారో షోల్డర్స్) ఉన్నవారు సాధారణ నెక్‌లైన్స్‌కు భిన్నంగా ఉన్నవి వేసుకుంటే బావుంటుంది. పొడవు మెడ, కోల మొహం ఉన్నవారు క్రూ నెక్‌లైన్‌ని ఎంచుకోవటం వల్ల శరీరాకృతిని బ్యాలెన్స్ చేయవచ్చు. ముఖం గుండ్రంగా ఉన్నవారికి క్రూ నెక్ బావుండదు. భుజాలు చిన్నగా ఉన్నవారు వెడల్పు వీ నెక్, భుజాలు పెద్దగా ఉండేవారు డీప్ వీ నెక్ కుర్తాలను ధరించొచ్చు.

* వర్క్ ఎంబ్రాయిడరీ, జరీ, జర్దోసీ, గోటా, బ్రొకేడ్, పల్లు, నిట్టెడ్, నక్షి ఇలా ఎన్నో వర్క్ చేసిన కుర్తాలు మార్కెట్‌లో దొరుకుతున్నాయి. సంప్రదాయంగా కనిపించాలంటే జరీ, జర్దోసీ, గోటా, బ్రొకేడ్ వర్క్స్ ఉన్న కుర్తాలను ధరించొచ్చు. కాస్త స్టయిల్ లుక్ రావాలంటే జర్దోసీ, పల్లు, నిట్టెడ్, నక్షి వర్క్ కుర్తాలను వేసుకోవాలి. మంచి శరీరాకృతి ఉన్నవాళ్లు హెవీ, లైట్ ఎలాంటి వర్క్ ఉన్న కుర్తాలనయినా ధరించొచ్చు. పొడవుగా ఉన్నవాళ్లు పెద్ద పెద్ద ప్రింట్లు, ఓవరాల్ ప్రింటెడ్ వర్క్ ఉన్న వాటిని కూడా ధరించొచ్చు. లావుగా ఉన్న వారికి సింపుల్ వర్క్ ఉన్న కుర్తాలే బావుంటాయి.

* కలర్స్ ప్రస్తుతం- ఆరెంజ్, డీప్ పర్పుల్, మెరూన్, గోల్డ్, తెలుపు, గులాబి, ఎరుపు, పసుపు రంగులను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. లావుగా ఉన్నవారు సింగిల్‌కలర్ టోన్ ఉన్న కుర్తాలను వేసుకుంటే సన్నంగా కనిపిస్తారు. అర్పిత ఫ్యాషన్ డిజైనర్