చర్మ సంరక్షణ అమ్మాయిల లైఫ్ స్టైల్ లో చాలా ముఖ్యమైపోయింది. ఆహారం దగ్గర అయినా రాజీ పడతారేమో కానీ.. చర్మ సంరక్షణ దగ్గర ఏమాత్రం తగ్గేది లేదంటారు ఈ కాలం అమ్మాయిలు. అయితే ముఖం ఎప్పుడూ మెరుస్తూ ఉండాలన్నా.. చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా,  వయసు పెరిగినా యవ్వనంగా ఉండాలన్నా చర్మానికి సీరమ్ చేసే మేలు అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా విటమిన్-సి సీరమ్ అయితే చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా,  చర్మం మెరుస్తూ ఉండాలన్నా విటమిన్-సి సీరమ్ ను ఎంచుకోవడం తెలివైన మార్గమని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు.  ఇంతకీ విటమిన్-సి సీరమ్ వాడటం వల్ల కలిగే మేలు ఏంటో తెలుసుకుంటే..


విటమిన్-సి సీరమ్  మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.  ఈ మెలనిన్ ఎక్కువ అయితే ముఖం మీద మచ్చలు,  పిగ్మెంటేషన్ వంటివి వస్తాయి. అదే మెలనిన్ ఉత్పత్తి తగ్గితే  చర్మం క్లియర్ గా ఉంటుంది. అంతే కాదు.. చర్మాన్ని బిగుతుగా యవ్వనంగా, దృఢంగా ఉంచడంలో కూడా విటమిన్-సి సీరమ్ సహాయపడుతుంది.

విటమిన్-సి గొప్ప యాంటీ ఆక్సిడెంట్.. ఇది చర్మాన్ని రక్షిస్తుంది.  ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మం  దెబ్బతినే సమస్యను తగ్గిస్తుంది.  విటమిన్-సి చర్మానికి సహజమైన కాంతిని ఇస్తుంది.

సన్ స్క్రీన్ తో పాటు విటమిన్-సి సీరమ్ వాడుతుంటే  హానికరమైన సూర్య కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవచ్చు.  

విటమిన్-సి యాంటీ ఏజింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది.  ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని సాగేలా చేస్తుంది.  చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది.  ముడతలు తగ్గించడంలో సహాయపడుతుంది.  

చర్మం మీద కొన్ని మచ్చలు వస్తాయి.  ఇవి మెలిస్మా,  పిగ్మెంటేషన్ వంటి చర్మ సమస్యల వల్ల వస్తాయి.   ఇవి తగ్గిపోవడంలోనూ, చర్మం తిరిగి సాధారణ రంగులోకి వచ్చి కాంతివంతంగా మారడంలోనూ విటమిన్-సి సహాయపడుతుంది.

ప్రతిరోజూ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత  టోనర్  ను అప్లై చేయాలి. ఇలా చేస్తే చర్మం PH స్థాయి బ్యాలెన్స్ గా ఉంటుంది. దీని తరువాత ముఖానికి విటమిన్-సి సీరమ్ ను కొన్ని చుక్కలు తీసుకుని అప్లై చేయాలి.  ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.  చర్మానికి సీరమ్ అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే చర్మం రోజంతా మృదువుగా, కాంతివంతంగా,  ఆరోగ్యంగా ఉంటుంది.

పగటి సమయంలో విటమిన్-సి సీరమ్ ను ముఖానికి అప్లై చేస్తే గనక దాని తరువాత ఎల్లప్పుడూ సన్ స్క్రీన్ ను అప్లే చేయాలి. 10-15%  విటమిన్-సి ఉన్న సీరమ్ ను ఉపయోగించాలి.  ఇది చర్మం చికాకును, వాపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


                                             *రూపశ్రీ.