చలికాలంలో పాదాలు చల్లగా ఉంటున్నాయా? ఇలా వెచ్చగా ఉంచుకోండి..!
చలికాలం చర్మానికి పరీక్ష కాలం. ఉదయం నుండి రాత్రి వరకు బయటకు వెళ్ళాలన్నా, తిరగాలన్నా పాదాలే ఆధారం. ముఖ్యంగా వాష్ రూమ్ వెళ్లాలంటే చాలా మంది భయపడతారు. దీనికి కారణం పాదాల చల్లదనం. కాళ్లకు ఏ మాత్రం నీరు తగిలినా చాలు.. మంచులో ముంచి తీసినట్టు పాదాలు చాలా చల్లగా అవుతుంటాయి. శరీరాన్ని కవర్ చేయడానికి వెచ్చగా ఉన్న దుస్తులు వేసుకుంటారు. స్వెట్టర్లు గట్రా వేసుకుని వెచ్చదనాన్ని అనుభూతి చెందుతారు. కానీ పాదాలు, చేతులు మాత్రం చలికి బుక్ అయిపోతాయి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తగిలే శరీర భాగాలలో కాళ్లు, చేతులే ఎక్కువ ఉంటాయి. భారతీయులు అయితే బాత్రూమ్ కు వెళితే కాళ్లు, చేతులు కడగనిది బయటకు రారు. దీనివల్ల మరీ ఇబ్బంది ఏర్పడుతుంది. అలా కాకుండా ఈ చలికాలంలో పాదాలు వెచ్చగా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
శరీరం వెచ్చగా ఉంటే పాదాలు, చేతులు చాలా వరకు వెచ్చదనంగా ఉంటాయి. సీజన్ కు తగ్గట్టు ఈ చలికాలంలో మందంగా ఉన్న దుస్తులు, ఉన్ని, బొచ్చుతో కూడిన దుస్తులు, ఊలు దుస్తులు ధరించాలి. ఇవన్నీ ఇప్పట్లో ఫ్యాషన్ తో కూడుకుని మరీ డిజైన్ చేస్తున్నారు, కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా వీటిని ధరించవచ్చు. అలాగే రాత్రి నిద్రపోయే సమయంలో లేదా ఒకే చోటు కూర్చుని వర్క్ చేసుకునే సమయంలో కాళ్లకు మందం పాటి సాక్స్ ధరించాలి. ఇంట్లో కూడా అటు ఇటు తిరిగేటప్పుడు సాక్స్ ధరించవచ్చు.
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీరు తీసుకుని అందులో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి పాదాలను ఆ నీటిలో నానబెట్టాలి. సుమారు 20 నిమిషాలు ఇలా నానబెట్టిన తరువాత పాదాలను శుభ్రమైన పొడి గుడ్డతో తుడిచి పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్ వేసుకుని పడుకోవాలి. ఇలా చేస్తే పాదాలు వెచ్చగా ఉంటాయి. చలి కారణంగా పాదాలు పగుళ్లు రావడం, దెబ్బతినడం జరగదు.
ఒక వేళ పాదాలను నీటిలో నానబెట్టడం కుదరకపోతే పాదాలను నూనెతో మసాజ్ చేయాలి. ఇందుకోసం ఆవాల నూనె లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు వెచ్చగా ఉంటాయి. ముఖ్యంగా ఆవాల నూనెతో పాదాలకు మసాజ్ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆవాల నూనె వేడి గుణం కలిగి ఉంటుంది. దీంతో పాదాలకు మర్దనా చేస్తే పాదాలలో రక్తప్రసరణ పెరిగి పాదాలు వెచ్చగా ఉంటాయి.
అల్లం, వెల్లుల్లి, నల్ల మిరియాలు వంటి పదార్థాలలో వేడి గుణం ఉంటుంది. అల్లం పాలు, మిరియాల పాలు, పసుపు పాలు వంటివి తాగాలి. ఇవి తాగితే శరీరం, పాదాలు వెచ్చగా ఉంటాయి.
వ్యాయామం శరీరానికి గొప్ప ఔషధం లాంటిది. శరీరంలో కొన్ని జబ్బులు వ్యాయామం వల్ల తగ్గుతాయి. వ్యాయామం చేస్తే శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది.
చలికి పాదాలు చాలా ఇబ్బందిని అనుభవిస్తుంటే హాట్ ప్యాక్ బ్యాగ్ తీసుకుని పాదాల మీద ఉంచుకోవచ్చు. వెచ్చని దుప్పటిని పాదాలకు కవర్ చేయవచ్చు. పాదాలు చలికి గురి కాకూడదు అంటే పదే పదే నీటిలో తడవకూడదు. వంటింట్లో పనులు ఏవైనా ఉంటే అవన్నీ చలి లేని సమయంలో మధ్యాహ్నం వంట చేసిన సమయంలో కడుక్కోవాలి. దీని వల్ల వంట చేసిన వేడి గదిలోనే ఉండి పెద్దగా ఎఫేక్ట్ పడదు.
*రూపశ్రీ.