వ్యాయామాలు అనగానే జిమ్ముల్లో చేసే ఖరీదైన విన్యాసాలు, ప్రక్రియలని భయపడవలసిన పనిలేదు. వాకింగ్, జాగింగ్, ఈత, క్రీడలు, సైకిలింగ్, యోగ, సాధారణ వ్యాయామాలు లాంటి అనువైన వాటిని ఎంచుకోవచ్చు. అయితే ప్రతి రోజు కనీసం అర గంట అయినా శరీరానికి అలసట కలిగేలా చేయాలి. వారానికి కనీసం నాలుగు రోజులైనా వ్యాయామం చేసినపుడే సత్ఫలితాలుంటాయి. ఏ వ్యాయామమైనా కనీసం నెల రోజుల పాటు చేయనిదే దాని ప్రయోజనం కనిపించదు.

 

ప్రతినిత్యం క్రమం తప్పకుండా శారీరక వ్యాయామాలు చేసేవారు మానసిక ఒత్తిళ్ళు, రుగ్మతలకు దూరంగా ఉంటారు. సహజంగానే మానసిక ఒత్తిళ్ళు వ్యాయామం ద్వారా తగ్గుతాయి. శారీరక వ్యాయామాలవల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. శరీరంలోని కండరాలు, నాడీ వ్యవస్థ, మెదడులోని న్యూరాన్లు చైతన్యవంతమై చురుగ్గా పనిచేస్తాయి. వ్యాయామం చేసే సమయంలో శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. శారీరక శక్తి పెరగడంతో ఆత్మవిశ్వాసం, స్వీయ గౌరవం వృద్ధి పొందుతుంది. దీనివల్ల మానసిక రుగ్మతల్ని అదుపు చేయడం, నివారించడం సాధ్యమవుతుంది.