ఇంటి పని.. ఉద్యోగం.. లక్ష్మీబాయమ్మ గురించి తెలుసుకోవాలి!


1970 వ సంవత్సరం ఆగస్టు నెల నాలుగోవారంలో శ్రీమతి ద్రోణంరాజు లక్ష్మీ బాయమ్మగారు అనారోగ్యంగ పడుకొని ఉన్నారు. అలవాటు ప్రకారం మహిళా సమాజ కార్యకర్తలు, మిత్రులు, సమావేశమై వున్నారు. సమాజం సంగతులు చర్చించుకుంటు వున్నారు. అప్పుడు ఆమె "ఏదో భగీరథ  ప్రయత్నం చేసి, భీమవరం వాళ్ళనడుమ చక్కని స్థలం సమకూర్చగలిగాము, కాని ఆ మున్సిపల్ వారి ఆమోదముద్ర మన ప్లానుల మీద యెప్పటికి పడుతుందో, ఈ లోపల నిరుత్సాహపడి, మాట యిచ్చిన వాళ్ళు విరాళాలు పంపడం అశ్రద్ధ చేస్తారేమో. మరికొంతమంది కొత్త వాళ్ళను కూడ కలుసుకొని యింకా కొంతడబ్బు వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. అనుకున్న ప్రకారం 'బా- బాపు భవనం' నిర్మాణం వీలయినంత త్వరగా జరిగిపోవాలి" అని చెపుతూనే వున్నారు. మరికొంతసేపటికి ఆమె మాట పడిపోయింది. అవే ఆమె చివరి మాటలు. మరి మూడురోజులకు 27-8-1970 ఆమె భగవత్సాన్నిధ్యాన్ని చేరుకున్నారు. ఇంతటి కార్య దీక్షత కలిగిన మహిళ లక్ష్మీబాయమ్మ.

ఇప్పటికాలం మహిళలు ఇంటి పని ఉద్యోగం పెద్ద టాస్క్.. అని అంటూ ఉంటారు. ఒకప్పుడు మహిళలు అందరూ ఉద్యోగాలు ఏమీ చేయలేదు.. వారికేం తెలుసు ఇంత పెద్ద టాస్క్ ల గురించి అని కూడా అనుకుంటారు. కానీ అందరూ లక్ష్మీబాయమ్మ గురించి తెలుసుకోవాలి. 

శ్రీమతి లక్ష్మీబాయమ్మ 1898 లో శ్రీ చన్నా ప్రగడ సుందర రామయ్య-శ్రీమతి రామ లక్ష్మాంబల కడగొట్టు బిడ్డగా జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం తాలుకా లోని ముత్యాలవల్లి ఆమె జన్మ స్థలం. అదొక విద్వత్కుటుంబం. అందరు కవులు, పండితులే. నిత్యం పండిత గోష్టులు, సాహిత్య చర్చలు జరుగుతు వుండేవి. తన రెండవ యేటనే తల్లిని పోగొట్టుకున్న లక్ష్మీబాయమ్మ కవులు, పండితుల మధ్య తండ్రివడిలో పెరిగారు. సంస్కృత పద భూయిష్టమైన భాషనే యింట్లో అందరు మాట్లాడటంతో ఆభాషే ఆమెకు సహజంగ వచ్చేసింది. భోజనానికి వెళ్ళబోతూ "అన్నయ్యా యీవేళ సూపమాః చోష్యమాః భక్ష్యములేమిటి" అని అడిగే వారట. 

లక్ష్మీబాయమ్మది బడికి వెళ్ళి నేర్చిన చదువుకాదు. అంతా స్వయం కృషివల్ల సాధించినదే. హిందీ, ఇంగ్లీషు భాషలు చక్కగా చదవడం, వ్రాయడం వచ్చు. సంస్కృత, ఆంధ్రభాషలలో గొప్ప విద్వత్తుగలవారు. కవిత అల్లగల వారు. చిన్న వయసులోనే ఆమె కంద పద్యాలలో 'కృష్ణ శతకం' వ్రాశారు. మరి మూడేళ్లకు 'వీరమతి' అనే నవలను వ్రాశారు. 'శాంతి కాముడు' అనే పద్య కథానికను, ఇంటరంటే ఏమిటనే వ్యాసం, నారాయణ రావు అనే కథానిక, 'దుర్గా దండకం', శ్రీకృష్ణ పరంగా 'ప్రభూ' అనే శీర్షికతో పద్య వ్యాసం వ్రాశారు. గృహ లక్ష్మి పత్రికలో అనేక కథలు, గేయాలు, వ్యాసాలు వ్రాశారు. భారతి పత్రికలో కూడ అసంఖ్యాకంగ గద్య పద్యరచనలు వ్రాశారు. విదుషిగా, కవయిత్రిగా తెలుగు నాట పేరుపొందగలిగారు.

ఎక్కడ ఏ అవకాశం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకుని తన కష్టార్జితాన్ని యితరులకు సంతోషంగ పంచారు. శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆధ్వర్యాన నడుస్తున్న కేంద్ర స్త్రీ సంక్షేమ సంఘంలో శ్రీమతి లక్ష్మీబాయమ్మ 1955 నుంచి సభ్యురాలుగా వున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇంప్లిమెంటింగు కమిటీ చైర్మన్ గా నాలుగయిదు సంవత్సరాలు సేవ చేశారు. తాలూకాలలో, గ్రామాలలో విరివిగా సెంటర్లు నెలకొల్పి వాటి తరపున స్త్రీలకు చదువుకునే అవకాశాలు, కుట్లు అల్లికలవంటి వుపయోగ కరమైన చేతిపనులు, ప్రసూతి కేంద్రాలు, వైద్య సౌకర్యాలు యెన్నో ఆమె కల్పించి యెనలేని సహాయం చేశారు. ఎంతోమంది స్త్రీలకు తమకాళ్ళపైన తాము నిలబడగల శక్తిని కల్పించారు. మహిళాభ్యున్నతి ఆమెకు అతి ప్రధానం అని చెప్పవచ్చు.


                                   ◆నిశ్శబ్ద.