ఇంట్లోనే తయారు చేసే ఈ క్రీములు వాడితే పాదాలు కోమలంగా మారతాయి..!
స్త్రీలు తమ శరీరంలో ప్రతి భాగాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. చేతి వేళ్ల నుండి పాదాల వరకు అన్ని విషయాల్లో శ్రద్ద తీసుకుంటారు. సాధారణంగా వర్షాకాలంలో పాదాల సమస్యలు పెరుగుతాయి. పాదాల మడమలు పగిలి నొప్పి పెడతాయి. మరికొన్ని సార్లు బ్యాక్టీరియా, ఫంగస్ కారణంగా పుండ్లు కూడా వస్తాయి. వీటికోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల క్రీమ్ లు కొనుగోలు చేసి వాడుతుంటారు. వీటికి బదులు ఇంట్లోనే పాదాల క్రీమ్ లను తయారు చేసుకుని వాడవచ్చు.
కొబ్బరినూనె, షియా బటర్ క్రీమ్..
సమాన పరిమాణంలో కొబ్బరినూనె, షియా బటర్ క్రీమ్ ను తీసుకుని రెండింటిని కలపాలి. ఈ క్రీమ్ ను రాత్రి పడుకునే ముందు పాదాలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. రోజూ రాత్రి ఇలా చేస్తుంటే పాదాలు మృదువుగా మారతాయి.
తేనె, కలబంద క్రీమ్..
1టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ అలోవేరా జెల్ మిక్స్ చేయాలి. దీన్ని పాదాలకు అప్లై చేసి 15-20 నిమిషాల పాటూ ఉంచాలి. ఆ తరువాత కడిగేయాలి. తేనె చర్మానికి మృదుత్వాన్ని, పగిలిన పాదాలకు ఓదార్పును ఇస్తుంది. కలబంద చర్మాన్ని హీలింగ్ చేస్తుంది.
అవకాడో, బనానా క్రీమ్...
పండ్లతో తయారు చేసుకునే క్రీమ్స్ చర్మాన్ని చక్కగా ట్రీట్ చేస్తాయి. అవకాడో, పండిన అరటిపండు రెండింటిని కలిపి క్రీమ్ లాగా చేసుకోవాలి. దీన్ని పగిలిన పాదాలకు పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇది చీలమండల నొప్పి నుండి తొందరగా ఉపశమనం ఇస్తుంది.
విటమిన్-ఇ, లావెండర్ ఆయిల్ క్రీమ్..
విటమిన్-ఇ క్యాప్సూల్ ఆయిల్, కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేయాలి. దీన్ని రాత్రి పడుకునే ముందు పాదాలకు అప్లై చేయాలి. చాలా చక్కని ఫలితం ఉంటుంది.
టీట్రీ ఆయిల్, పెప్పర్ మెంట్ క్రీమ్..
కొన్ని చుక్కల టీట్రీ ఆయిల్, పెప్పర్ మెంట్ ఆయిల్ తీసుకోవాలి. దీనికి ఒక స్పూన్ కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. దీన్ని పాదాలకు అప్లై చేసి సున్నితంగా మర్థనా చేసుకోవాలి. పగుళ్ల దగ్గర మరింత ఎక్కువ రాసుకోవాలి. ఇది చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.
పాలు, తేనె క్రీమ్..
పాలు, తేనెను సమాన పరిమాణంలో తీసుకుని మిక్స్ చేయాలి. కొన్ని నీటిలో ఈ మిశ్రమం వేసి కలపాలి. ఈ నీళ్లలో పాదాలను ముంచి 15 నిమిషాల పాటూ నానబెట్టాలి. ఇది పాదాలకు చాలా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
షీ బటర్, లెమన్ జ్యూస్..
షీ బటర్ ను కరిగించి అందులో నిమ్మరసం కలపాలి. దీన్ని పాదాలకు అప్లై చేసి కొన్ని నిమిషాల తరువాత కడిగేయాలి.
రోజ్ వాటర్, గ్లిజరిన్..
చాలా సులువుగా, చవకగా చేసుకోదగ్గ క్రీమ్ ఇది. సమాన మొత్తంలో రోజ్ వాటర్, గ్లిజరిన్ తీసుకుని మిక్స్ చేయాలి. రోజూ నిద్రపోయే ముందు పాదాలకు అప్లే చేయాలి. కొన్ని రోజుల్లోనే పాదాలు మృదువుగా కోమలంగా మారతాయి.
*రూపశ్రీ.