వర్షాల వల్ల చుండ్రు, దురద ఇబ్బంది పెడుతున్నాయా...ఈ హెయిర్ మాస్క్ ట్రై చేయండి..!

వర్షాకాలం నడుస్తోంది. దీని కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వర్షంలో తడిసిన తర్వాత చర్మం దురద పెడుతూ ఉంటుంది. జుట్టు సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఈ వర్షంలో తడిసిన తర్వాత చుండ్రుతో బాధపడటం చూస్తుంటాం. ఈ చుండ్రు కారణంగా దురద.. ఇది కాస్తా చర్మ సమస్యలకు దారి తీసి ముఖం మీద అలెర్జీ, మొటిమలు రావడానికి కూడా కారణం అవుతుంది. తల నుండి చుండ్రును తొలగించే సూపర్ హెయిర్ మాస్క్ ఉంది. అదేంటో.. దాని తయారీకి కావలసిన పదార్థాలేంటో, దాన్నెలా తయారు చేయాలో తెలుసుకుంటే..
హెయిర్ మాస్క్ తయారీ సామాగ్రి..
వేప ఆకులు - 10-15
పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 1 స్పూన్
టీ ట్రీ ఆయిల్ - 2-3 చుక్కలు
తయారు విధానం..
ముందుగా అన్ని పదార్థాలను తీసి ఒక వైపు ఉంచాలి. ఇప్పుడు ఒక పాన్ లో కొంచెం నీరు తీసుకుని అందులో వేప ఆకులు వేసి మరిగించాలి. ఆకులు ఉడికిన తర్వాత దానిని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వేప పేస్ట్ లో కొంచెం పెరుగు, నిమ్మరసం కలపాలి. చివర్లో ఈ పేస్ట్ లో టీ ట్రీ ఆయిల్ కలపాలి. టీట్రీ ఆయిల్ లేకపోతే దాన్ని మినహాయించవచ్చు. ఇప్పుడు అన్ని వస్తువులను కలిపిన తర్వాత హెయిర్ మాస్క్ సిద్ధమైనట్టే..
ఉపయోగించే విధానం..
తయారు చేసుకున్న పేస్ట్‌ను తలకు అప్లై చేయాలి. అయితే ఈ పేస్ట్ అప్లై చేయడానికి ముందే తల స్నానం చేసి జుట్టును శుభ్రం చేసుకుని ఉండాలి. ఆ తరువాతే హెయిర్ మాస్క్‌ను అప్లై చేయాలి. 30 నిమిషాలు మాస్క్ ను అలాగే ఉంచాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును తేలికపాటి షాంపూతో కడగాలి. తద్వారా జుట్టు శుభ్రంగా మారుతుంది.
జాగ్రత్తలు..
ఈ హెయిర్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు. ఈ మాస్క్‌ను రెండు నుండి మూడు సార్లు ఉపయోగించిన తర్వాత, తలపై చుండ్రు పూర్తిగా మాయమవుతుంది. దీన్ని అప్లై చేసిన తర్వాత, కొంచెం దురద లేదా ఏదైనా ఇతర సమస్య ఉంటే వెంటనే జుట్టును కడిగేసుకోవాలి. సైనస్ సమస్యలు ఉన్నవారు హెయిర్ మాస్క్ లకు దూరంగా ఉండటం మంచిది.
*రూపశ్రీ.



