మెల్లకన్ను - చికిత్స

Cross eye – Treatment

మెల్లకన్ను అంటే తెలియని వారుండరు, కానీ మెల్లకన్నుకు గల కారణాలు , దానికి సంబంధించిన ఇబ్బందులు , చికిత్స గురించి తెలిసిన వారు మాత్రం చాలా అరుదు. రెండు కళ్ళు సరియైన క్రమంలో కాకుండా కాస్త అటూ ఇటూగా ఉండటాన్నే మెల్లకన్ను అంటారు.

 

మెల్లకన్ను - కంటి చూపు మందగించే ప్రమాదం

సాధారణంగా మన కళ్ళు ఒకేసారిగా ఒకే చోట ఫోకస్ చేస్తాయి, మెదడు కూడా అదే విధంగా సంకేతాలను సేకరిస్తుంది. కానీ మెల్లకన్ను ఉన్నవారిలో రెండు కళ్ళ అమరిక సరిగ్గా లేని కారణంగా దృష్టి రెండు చోట్ల పడుతుంటుంది.. ఈ క్రమంలో కొన్నాళ్ళకు మెదడు ఒక కన్ను స్సంకేతాలను స్వీకరించడం మానేస్తుంది . దాంతో మెల్లకన్ను ఉన్నవారు ఒక కంటి చూపును శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంది.

కాబట్టి చిన్నతనంలోనే , మెల్లకన్ను ఉందని గుర్తించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. ఏడేళ్ళ వయసు లోపు ఉన్న పిల్లల్లో ఈ సమస్యను అవలీలగా పరిష్కరించగలుగుతున్నారు వైద్యులు.

మెల్లకన్ను - చికిత్స

ప్రారంభ దశలోనే చికిత్స మొదలు పెట్టినట్లయితే అకారణంగా ఒక కంటిచూపు మందగించకుండా కాపాడుకోగలుగుతాం.. కంటి చూపు సరిగ్గా ఉండి మెల్ల కన్ను ఉండటమే సమస్య అయితే సర్జరీ ద్వారా రెండు కళ్ళను సరియైన క్రమంలో అమర్చగలుగుతున్నారు వైద్యులు.

కానీ సర్జరీ కంటే ముందుగా మందగించిన కంటి చూపు విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఈ ట్రీట్ మెంట్ లో భాగంగా వైద్యులు మొదట వీక్ అయిన కంటి చూపును దాని సామార్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తారు. అందుకు మెల్లకన్ను ఉన్నవారు కొన్ని రోజులు కళ్ళద్దాలు ధరించాల్సి ఉంటుంది, లేదా కంట్లో డ్రాప్స్ వేసుకోవాల్సి ఉంటుంది. తత్ఫలితంగా ఆరోగ్యంగా ఉన్న కన్ను మసకబారిపోవడం, లేదా ఎదురుగా ఉన్న కనిపించకపోవడం లాంటి ఇబ్బందులు ఉంటాయి. తత్ఫలితంగా వీక్ గా ఉన్న కంటి పై భారం పెరిగి, కండరాలపై ఒత్తిడి అధికమై కంటి నరాలు పుంజుకోవడం మొదలుపెడతాయి. పిల్లలు ఈ రకం కళ్ళద్దాలు ధరించడానికి గానీ, లేదా డ్రాప్స్ వేసుకోవడానికి అంతగా మనస్కరించకనట్లయితే కంటికి ప్యాచ్ కూడా వేయించుకోవచ్చు. వీక్ గా ఉన్న కంటి చూపును మెరుగుపరచడానికి ఇది కూడా మంచి పద్ధతే.

       ఈ ట్రీట్ మెంట్ ఎన్నాళ్ళలో పూర్తవుతుందో చెప్పలేం, కొందరికి వారం రోజుల్లోనే పరిస్థితి మెరుగుపడుతుంది. మరికొందరికి సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అందుకే పరిస్థితి ప్రారంభదశలో ఉన్నప్పుడే చికిత్స మొదలుపెడితే తొందరగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.