ఉప్పుతో కొన్ని ఉపకారాలు



ఇంట్లో ఇల్లాలికి చిన్నచిన్న చిట్కాలు తెలిస్తే పని సులువు అవుతుంది. శ్రమ తగ్గుతుంది. అలాంటి చిట్కాలలో అందుబాటులో ఉండే ఉప్పుతో కొన్ని ......

1) మైక్రోఓవెన్ లో వంట చేసేటప్పుడు కొన్నిసార్లు పదార్థాలు పొంగుతాయి. ఆసమయంలో ఓవెన్ అంతా శుభ్రం చెయ్యాలంటే పెద్దపనే - పైగా పదార్థాలు కాలిన వాసన ఓవెన్ లో అలానే ఉంటుంది. అందుకు చెయ్యాల్సిందల్లా పదార్థాలు పడిన చోట కొద్దిగా ఉప్పును చల్లి, పొడి వస్త్రంతో తుడిస్తే చాలు. ఓవెన్ శుభ్రపడడంతో పాటు, పదార్థాలు కాలినవాసన కూడా పోతుంది.

2) టీ, కాఫీ, తాగే కప్పులు మనం తోమినా, అడుగున నల్లగా మరకలు కట్టి ఉంటాయి. ఆ కప్పుల్లో చిటికెడు ఉప్పు వేసి, శుభ్రం చేస్తే కొత్త వాటిల్లా మెరుస్తాయి. గాజు, పింగాణి పాత్రలని ఇలా ఉప్పుతో శుభ్రం చేస్తే తెల్లగా మెరుస్తాయి.

3) అందానికి ఫ్లవర్ వాజ్ లలో పెట్టే ప్లాస్టిక్ పూలకి దుమ్ము పడితే, వాటిని నీటితో శుభ్రం చేసేకంటే ఒక ప్లాస్టిక్ కవరులో గుప్పెడు ఉప్పు వేసి, ఈ పువ్వులని కవరులో పెట్టి బాగా అటుఇటు కదిపితే, పువ్వులకి ఉండే మురికి వదులుతుంది. పువ్వులు కొత్తవాటిల్లా కనిపిస్తాయి.
 
4) టూత్ బ్రష్షులలో బ్యాక్టీరియా చేరుతుందని మీకు తెలుసా ? ఆ బ్యాక్టీరియా వల్ల దంతాలకు ఎంతో హాని జరుగుతుంది. అలా కాకూడదు అంటే వారానికి ఒక్కసారైనా ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో బ్రష్షులని వేసి ఒక 15 నిముషాలు ఉంచి కడగాలి.

5) వంటింటి గట్టు, డైనింగు టేబుల్ వంటివి ఉప్పు కలిపిన నీటితో శుభ్ర పరిస్తే ఈగల సమస్య ఉండదు.

6) ఒక మగ్గు నీటిలో గుప్పెడు ఉప్పు వేసి, ఆ నీటితో కిటికీ అద్దాలను, కారు అద్దాలను, డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలను తుడిస్తే మిలమిలా మెరుస్తాయి.

7) ఆపిల్ ని కట్ చేసాక గాలికి వదిలేస్తే ఎర్రగా మారుతుంది. అదే చిటెకెడు ఉప్పువేసిన నీటిలో ఆపిల్ ముక్కలను వేస్తే రంగు మారకుండా ఉంటాయి.

8) ఇంట్లో ఎక్కడైనా చీమలు వస్తే ఆ చుట్టుపక్కల ఉప్పుతో ఒకగీతను గీయండి, చీమలు ఆ ఉప్పుగీతను దాటి రావు.

9) ఇంట్లో ఉన్న కార్పెట్లను శుభ్రం చేయాలంటే ముందురోజు రాత్రి ఆ కార్పెట్లమీద ఉప్పును చల్లండి. మర్నాడు కార్పెట్ ని వాక్యూం క్లీనర్ తో క్లీన్ చేస్తే కార్పెట్లు ఫ్రెష్ గా ఉంటాయి. చెడువాసనలు ఏమైనా ఉంటే పోతాయి.
 
10) కొత్తబట్టలని మొదటిసారిగా ఉతికేటప్పుడు ఉప్పువేసిన నీటిలో నానబెట్టి ఉతికితే రంగులు పోకుండా ఉంటాయి.


-రమ