యోగర్ట్ యోగం



పెరుగు ఆరోగ్యానికి మంచిదని తెలుసు కదా. అయితే దానిని రోజువారీ వంటలలో విరివిగా ఎలా వాడచ్చో తెలుసుకుంటే పెరుగు వాడకాన్ని పెంచవచ్చు. ఆ చిట్కాలే కొన్ని  ఈ రోజు మీకోసం ఇస్తున్నాం, ఆలోచిస్తే మీకూ కొన్ని తడతాయి.

* పెరుగును బాగా చిలికి కొద్దిగా పంచదార, ఉప్పు, నచ్చిన పండ్ల ముక్కలు లేదంటే మొలకెత్తిన గింజలను చేర్చాలి. చివరిలో కొంచెం తేనె వేస్తే రుచిగా వుంటుంది. ఎండలు ఎక్కువగా వున్నప్పుడు సాయంత్రాలలో తింటే హాయిగా వుంటుంది.

*  చపాతీ పిండి కలిపేటప్పుడు కొంచం పాలు పోస్తాం కదా.. మెత్తగా వస్తాయని, ఈసారి కొంచం పెరుగు వేసి చూడండి.. రోటీలు మృదువుగా వస్తాయి, పైగా రుచి కూడా పెరుగుతుంది.



* బిర్యానీ చేసేటప్పుడు ఓ కప్పు పెరుగు వేస్తే కమ్మదనంతో పాటు రుచి కూడా చాలా బావుంటుంది.

* పెరుగు పచ్చళ్ళ గురించి చెప్పేదేముంది... కొబ్బరి, పొట్లకాయ, టమోటా ఇలా ఎన్నోరకాల  పెరుగు పచ్చళ్ళు చేసుకోవచ్చు.

* చపాతీలలోకి రైతా చేసుకుంటే చాలా బావుంటుంది. త్వరగా అయిపోతుంది కూడా. బూందీ రైతా అయితే అన్ని రైస్ ఐటమ్స్‌లోకి బావుంటుంది. రోటిలలోకి మాత్రం కీరా, కారెట్, అలాగే ఆనపకాయ తురిమి వేస్తే చాలా రుచిగా వుంటుంది.

* చాలా కూరలలో పాలు పోసి వండుతాం కదా.. కొన్ని గ్రేవీ కూరలలో పెరుగు వేస్తారు. కొంచెం పులుపు రుచి వస్తుంది దాని వల్ల కూరకి.

* సూపులలో క్రీమ్‌కి బదులుగా పెరుగు వాడవచ్చు.



* ఇక ఇన్‌స్టెంట్ రవ్వ దోశలు వేయాలంటే పెరుగు వుండాల్సిందే. వేయించిన రవ్వని పెరుగులో కలిపి కాసేపు పోయాక తగినంత నీరుపోసి వేస్తే రవ్వ దోశలు చక్కగా కుదురుతాయి.

* పెరుగు వడలు, ఆవియల్ వంటి కూరలు, దద్దోజనం లాంటి రైస్ ఐటమ్ ఒకటా రెండా.. పెరుగుతో ఎన్నో వంటకాలు చేసుకోవచ్చు.

* ఇక లస్సీ, నిమ్మరసం కలిపిన మజ్జిగ దాహాన్ని తీరుస్తాయి.

* పెరుగు మన డైజిస్టివ్ సిస్టంని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే వీలు అయినంత ఎక్కువగా పెరుగును వివిధ రూపాలలో మన ఆహారంలో చేర్చుకోవాలి.

 

 

-రమ