జ్ఞాపకాన్ని బహుమతిగా ఇద్దాం..
పిల్లలకి ఎన్నో మంచి బహుమతులు ఇస్తుంటారు పేరెంట్స్. వాళ్ళు అడిగినవి, అడగనివి కూడా ఇచ్చి, పిల్లల కళ్ళలో కనిపించే సంతోషాన్ని చూసి పొంగిపోతారు. ఆ బహుమతులు ఏంతో అపురూపంగా చూసుకుంటారు పిల్లలు. అయితే బహుమతి ఎప్పుడూ వస్తువుల రూపంలోనే ఉండక్కరలేదు. జ్ఞాపకాలుగా కూడా ఇవ్వచ్చు. అలా జ్ఞాపకాలుగా ఇచ్చిన బహుమతి ఎన్నో ఏళ్ళు పిల్లల మనసులలో చెరగని ముద్ర వేసుకు కూర్చుంటుంది. ముఖ్యంగా తల్లితండ్రులు, పిల్లలకి మధ్య మంచి అనుభందం ఏర్పడటానికి దారితీస్తుంది. జ్ఞాపకాలని బహుమతిగా ఇవ్వటం అంటే ఎలా అంటే ...నిజానికి పేరెంట్స్ అందరూ దానిని పాటిస్తూనే వుంటారు. కానీ ప్రత్యేకంగా దానిని గుర్తించరు అంతే.
మన చిన్నతనాన్ని గుర్తుచేసుకుంటే చాలు ఒకసారి, విషయం అర్ధం అయిపోతుంది .
* "నాన్న కొని ఇచ్చిన పెన్ను, పెన్సిల్ వంటివి కంటే నాన్న రోజు ఆఫీస్ నుంచి రాగానే ఒకసారి నన్ను అలా స్కూటర్ మీద తిప్పి తెచ్చేవారు. ఏ రోజు మిస్ చేసే వారు కాదు",
* " సెలవులు అనగానే తప్పకుండా ఓ ట్రిప్ ప్లాన్ చేసి తీసుకు వెళ్ళేవారు ".
* " మా పరీక్షలు మొదలు అయ్యేరోజు అమ్మ తప్పకుండా స్వీట్ చేసి పెట్టేది."
* " నా పుట్టిన రోజున అమ్మ రోజంతా ఓ పండగలా చేసేది. ఆ రోజు ఓ ఫోటో తీయించేది. నా మొదటి పుట్టిన రోజునించి, వరసగా అన్ని పుట్టిన రోజు ఫోటోలు ఒక ఆల్బం చేసింది. "
ఇలా మనలో చాలామందికి, ఇలాంటివే ఎన్నో జ్ఞాపకాలు, తీపిగా గుర్తుండిపోయి వుంటాయి. అవి ఎప్పుడు గుర్తుకు వచ్చినా ..ఆనందం తన్నుకు వచ్చేస్తుంది. పసిపాపగా మారిపోయి అమ్మా, నాన్నల చుట్టూ మన మనసు పరిగెడుతుంది. అదిగో అదే నేను చెప్పే బహుమతి. ఎన్ని ఏళ్ళు అయినా పాడవని బహుమతి. ఎప్పటికి మనతో వుండే బహుమతి. మనం కూడా అలాంటి బహుమతి పిల్లలకి ఇస్తే చాలు. అందుకు మనం చేయాల్సిందల్లా కొంచెం శ్రద్దగా ఆలోచించి ఆ బహుమతుల్ని నిర్ణయించుకోవటం .
ఉదాహరణకి కొన్ని చెబుతా ..మీరు ఇంకా అలోచించి మంచి బహుమతుల్ని సిద్దం చేయండి మీ పిల్లలకి.
1. పిల్లల పుట్టిన రోజుని ఎంత ప్రత్యేకంగా చేస్తామో కదా. అయితే పిల్లల చిన్నప్పటి నుంచి ఆ పుట్టిన రోజున పాటించే కొన్ని విధానాలని నిర్ణయించుకుని ఎప్పటికి, వాటిని తుచ తప్పక పాటించాలి. ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేపే ముందు వాళ్ళ మంచం నిండా బెలూన్లు వుంచటం. వాళ్ళకి కొన్న బహుమతుల్ని అక్కడక్కడా దాచి వెతుక్కోమనటం, ఇలా ...చిన్న చిన్న విషయాలనే చాలా ముఖ్యమైనవిగా ప్రతి సంవత్సరం పాటించటమే మనం పిల్లలకి ఇచ్చే బహుమతి. అంటే ఓ ఆచారం అంటారు చూసారా, తప్పక పాటించి తీరేది అలా వుండాలి కొన్ని కొన్ని .
2. పుట్టిన రోజున పిల్లలకి ఏంతో ప్రత్యేకం గా వుంటుంది. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన బహుమతులు, ఇంకా మనం చేసే హడావుడి .ఇవన్నీ ఆ రోజుని ప్రత్యేకమైనవిగా మారుస్తాయి. అలాంటి రోజులు ఇంకో రెండు అయినా వుండాలి. పిల్లలు స్కూల్ మొదలయ్యే రోజు. అలాగే పెద్ద పరీక్షలు అయిపోయిన ఆఖరి రోజు. పరీక్షలు అయిపోయే ఆఖరి రోజున పిల్లల స్కూల్ కి వెళ్లి, వాళ్ళ ఫ్రెండ్స్, టీచర్స్ తో పిల్లల కి ఫోటో లు తీయటం, ఫ్రెండ్స్ అందరికి వీళ్ళతో చిన్న చిన్న బహుమతులు, లేదా చాక్లెట్స్ ఇప్పించటం. అలాగే ఆ రోజున వాళ్ళని బయటకి తీసుకు వెళ్ళటం. ఎగ్జామ్స్ కి బాగా చదివారని గిఫ్ట్స్ ఇవ్వటం. ఇవన్నీ ఆ రోజుని ప్రత్యేకం గా మారుస్తాయి. పిల్లలు ఆ రోజు కోసం ఎదురు చూసేలా చేస్తాయి. అదే మనం పిల్లలకి ఇచ్చే విలువైన బహుమతి. " జ్ఞాపకాలు. "
3. అలాంటి జ్ఞాపకాలు పిల్లలకి ఇంకా ఎన్నో ఇవ్వచ్చు. రోజు వారి జీవితం లో కూడా. ఒక్కసారి అలోచించి చూడండి. పిల్లలని నిద్రలేపటం నుంచి, రాత్రి పడుకునే ముందు కథ చెప్పటం దాకా.. ఒకరోజు చేసి, ఒక రోజు చేయక కాదు. పిల్లలకి తెలియాలి, అమ్మ ఇప్పడు ఇలా చేస్తుంది అని. దాని కోసం వాళ్ళు ఎదురు చూడాలి. " ఈ రోజు ఆదివారం, అంటే నాన్న నాకు అన్నం తినిపిస్తాడు. " అనే చిన్న జ్ఞాపకం పిల్లలకి ఎంతో ప్రత్యేకం గా వుంటుంది.
ఇలా ఎన్నో, ఎన్నో... మన కంటి పాపలకి మనం ఇవ్వగలిగే అపురూప మైన బహుమతులు శ్రమ లేనివి, ఖర్చు లేనివి.. కాని ఎంతో విలువైనవి. ప్రేమని ఓ బహుమతి గా మార్చి ఇద్దాం. అది జ్ఞాపకం గా వారి గుండెల్లో నిలిచిపోయి వారికి జీవితాంతం సంతోషాన్ని అందిస్తుంది. అమ్మ, నాన్నలుగా మనం కోరుకునేది కూడా అదేగా. ఎప్పటికి మన పిల్లలకి సంతోషాన్ని ఇవ్వగలగాలి, మన జ్ఞాపకాలు వారికి బరోసా కావాలి. పసితనం వారి గుండెల్లో బంది కావాలి. అందుకే జ్ఞాపకాలని బహుమతిగా అందిద్దాం. మన ప్రేమని చేతలలో చూపిద్దాం.
-రమ