అమ్మ తింటే పిల్లలూ తిన్నట్టే


అమ్మకి పెద్ద ఛాలెంజింగ్ ఏమిటీ అని అడిగితే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం ‘‘పిల్లలకి తినిపించడం’’ అనే. మనం ఏదైనా పెట్టబోతున్నాం అని తెలిస్తే చాలు పెదాలు రెండూ మూసి వద్దు అంటారు. కుక్కబోతే కెవ్వుమంటారు. ఆ సమయంలో ఎంత కోపం వస్తుందో అమ్మకి. తిని, ఎంత ఎంతైనా అల్లరి చేయరా బాబూ అని బతిమాలుతుంది అమ్మ. అసలు వాళ్ళ ఆకలికి ఎలా ఆగగలుగుతున్నారో తెలిస్తే బావుండును... మనమూ డైటింగ్ చేయచ్చు అనిపిస్తుంది. ఇలా పిల్లలకి తినిపించడంలో ఇబ్బందులు ఎదుర్కునే అమ్మలు పిల్లల చిన్నతనంలోనే జాగ్రత్తపడాలి అంటున్నారు ఇటీవల ఈ విషయంపై అధ్యయనం చేసిన నిపుణులు. పిల్లలు అన్నిరకాల పళ్ళు, కూరగాయలు తినాలంటే, అన్ని రుచులని ఇష్టపడాలంటే అమ్మ తను గర్భంతో వుండగా వాటిని ఎక్కువగా తినాలిట. అలాగే పిల్లలు పుట్టాక, పాలు ఇస్తున్నప్పుడు కూడా ఆ పళ్ళని, ఆకు కూరల్ని ఎక్కువసార్లు తీసుకుంటూ వుండాలిట. ఇదేం లింకు అంటారా?

బిడ్డకి పాలిచ్చే తల్లి తినే ఆహారంలోని రుచి పాల ద్వారా పిల్లలకి చేరుతుందిట. ఇలా తల్లి ఎక్కువగా తినే పళ్ళు, కూరగాయల రుచికి పిల్లలు త్వరగానే అలవాటు పడిపోతారుట. ఈ విషయాన్ని అధ్యయనం చేయటానికి నాలుగు నుంచి ఎనిమిది నెలల మధ్య ఉండే 45 మంది పిల్లలని తీసుకుని వారిలో 20 మందికి వాళ్ళ అమ్మలు ఎక్కువగా తీసుకునే ఆహారాన్ని ఇచ్చినప్పుడు వెంటనే తినటానికి ఇష్టపడటం గుర్తించారు. అలాగే వేరే కొత్త రుచులు  ఇవ్వటానికి ప్రయత్నిస్తే మొహం చిట్లించి చక్కగా ఉమ్మేసారుట ఆ పిల్లలు. ఇంకో విషయం కూడా తెల్సిందండోయ్. ఈ అధ్యయనంలో కొంతమంది పిల్లలకి వాళ్ళు వద్దంటున్నా రోజూ అదే ఆహారాన్ని ఇవ్వటానికి ప్రయత్నిస్తూ వుంటే ఓ 15 రోజులకి నెమ్మదిగా వారు ఆ ఆహారాన్ని, ఆ రుచిని ఒప్పుకోవడం గమనించారు నిపుణులు. అంటే పిల్లలు ఇష్టపడటం లేదంటూ పెట్టడం మానెయ్యకుండా రోజూ ప్రయత్నిస్తూ వుంటే వాళ్ళు తప్పకుండా ఆ రుచిని ఇష్టపడటం మొదలుపెడతారుట. కాబట్టి పిల్లాడికి నచ్చదంటూ పళ్ళు, కూరగాయలని పక్కన పెట్టేసి, ఇష్టం అంటూ ఏ పెరుగు అన్నాన్నో పెట్టే తల్లులు ఇక పట్టువదలని విక్రమార్కుల్లా పిల్లల వెంట పడాల్సిందే.

పళ్ళు, కూరగాయల వంటివి ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెల్సిందే. పిల్లలు పాలు మానేసి ఘనాహారానికి మారినప్పుడే అన్ని కూరగాయలని, పళ్ళని పిల్లలకి రుచి చూపించాలిట. చిన్నతనంలోనే పిల్లలని అన్ని రుచులకి అలవాటు చేయటం సులువుగా వుంటుందిట. పెద్దయినకొద్దీ రకరకాల రుచులకి అలవాటుపడి తొందరగా దేనినీ ఇష్టపడరు. ఈ విషయంలో నిపుణులు చేసే సూచన పిల్లలకి ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా ఆరోగ్యకర ఆహారాన్ని అలవాటు చేయండి. పిల్లలకి నచ్చదంటూ ఏ ఆహారాన్నీ ఇవ్వటం మానెయ్యవద్దు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు.  పాలిచ్చే తల్లులు అన్ని రుచుల ఆహారాన్ని తప్పకుండా తినాలి.

ఇవండీ పిల్లలు సులువుగా అన్నీ తినాలంటే నిపుణులు సూచించిన మార్గాలు. పిల్లలని ఆరోగ్యవంతులుగా మార్చడం అమ్మ చేతిలోనే వుంది... ప్రయత్నించండి.

-రమ