బీట్రూట్ ఇలా వాడితే.. నేచురల్ గా మెరిసిపోతారు..!
బీట్ రూట్ సాధారణంగా సలాడ్‌లలో, కూరలలో, జ్యూస్ లలో ముఖ్యమైన భాగం. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను మరమ్మతు చేస్తాయి. సూర్యరశ్మి, కాలుష్యం వల్ల కలిగే నష్టాన్ని కూడా తిప్పికొడతాయి. బీట్‌రూట్ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది, మొటిమల మచ్చలను కూడా తేలికపరుస్తుంది. బీట్‌రూట్‌ను ఫేస్ ప్యాక్ లేదా ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల ముఖానికి అప్పటికప్పుడే గులాబీ రంగు మెరుపు వస్తుంది. ముఖం తాజాగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీన్ని రోజూ తినడం వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది. చర్మం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. బీట్‌రూట్ పెదవులపై హైపర్‌పిగ్మెంటేషన్‌ను తొలగించి వాటిని సహజంగా గులాబీ రంగులోకి మారుస్తుంది. ఇంత అద్బుతం చేసే ఈ బీట్రూట్ ను ఎలా ఉపయోగించాలంటే..
బీట్రూట్ ఎలా ఉపయోగించాలి..
చర్మ సంరక్షణ కోసం బీట్‌రూట్‌ను ఉపయోగించడానికి ఉత్తమ మార్గం దాని పొడిని తయారు చేసి నిల్వ చేయడం. పొడి చేయడానికి బీట్‌రూట్ తొక్క తీసి శుభ్రం చేయాలి. దానిని సన్నని గుండ్రని ముక్కలుగా కట్ చేసి ఎండలో ఆరబెట్టాలి. అది పూర్తిగా ఆరిపోయి గట్టిగా, సౌండ్ వచ్చేలా మారుతుంది. అప్పుడు పొడిని తయారు చేసుకోవాలి. ఇందుకోసం మిక్సర్ గ్రైండర్ ఉపయోగించవచ్చు. దీన్ని రిఫ్రిజిరేటర్‌లో ఒక నెల వరకు నిల్వ చేయవచ్చు. ఫేస్ ప్యాక్, ఫేస్ స్క్రబ్, లిప్ స్క్రబ్, ఫేస్ మాస్క్ వంటి ఎందులో అయినా ఈ పొడిని చేర్చుకోవచ్చు.
ఇలా కూడా వాడచ్చు..
2 టేబుల్ స్పూన్ల బీట్‌రూట్ రసం, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, ½ టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. వృత్తాకారంగా మసాజ్ చేస్తూ దానిని తొలగించాలి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి అప్లై చేయాలి. ముఖం మీద మెరుపు కనిపించడం ప్రారంభమవుతుంది.
మరో మార్గం..
2 టేబుల్ స్పూన్ల బీట్‌రూట్ రసంలో 2 టేబుల్ స్పూన్ల తేనె కలపాలి . ఈ మిశ్రమంలో ఒక కాటన్ బాల్ ముంచి ముఖం, మెడపై అప్లై చేయాలి. 15 నుండి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. గోరువెచ్చని టవల్ తో తుడవాలి. బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మం కొల్లాజెన్ స్థాయిని పెంచుతాయి, ఇది చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
ఇంకొక మార్గం..
1 టేబుల్ స్పూన్ బీట్‌రూట్ పొడి, 1 టేబుల్ స్పూన్ నారింజ తొక్కల పొడిని రెండు టేబుల్ స్పూన్ల నీటితో కలిపి పేస్ట్ తయారు చేయాలి. డ్రై స్కిన్ ఉన్నవారు పాలు కలుపుకోవచ్చు. ఐరన్, విటమిన్ సి అధికంగా ఉండే బీట్‌రూట్ హైపర్‌పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది. విటమిన్ సి అధికంగా ఉండే నారింజ తొక్క, నల్లటి మచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, చర్మానికి తక్షణ మెరుపును ఇస్తుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
