రక్షణ దళాలకు తొలి మహిళా అధిపతి- అర్చన!

 

కేంద్ర ప్రభుత్వం ‘సశస్త్ర సీమాబల్‌’కు ముఖ్య అధికారిగా అర్చనా రామసుందరాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక శాఖకి అధిపతులను నియమిస్తూ ఇలాంటి ఉత్తర్వులు వెలువడటం కొత్తేమీ కాదు. కానీ ఈసారి వాటిలో అర్చన రామసుందరం పేరు ఉండటమే ఇప్పడు వార్త. ‘సశస్త్ర సీమాబల్‌’ (SSB) భారత దేశ రక్షణకు బాధ్యత వహించే పారామిలటరీ దళాలలో ఒక ముఖ్య శాఖ. కీలకమైన భూటాన్‌, నేపాల్‌ సరిహద్దులను కాపాడటం ఈ శాఖ బాధ్యత! అలాంటి కీలకమైన శాఖకి ఒక మహిళా అధికారిని నియమించడం ఇదే తొలిసారి. కేవలం SSB మాత్రమే కాదు… BSF, CRPF వంటి ఏ ఇతర పారామిలటరీ రంగాలలో కూడా ఇప్పటివరకు మహిళలు అత్యున్నత పదవిని అందుకోలేదు. అయితే పదవిని చేపట్టిన తొలి మహిళగా పేరుపొందడం అర్చనకు కొత్తకాదు. సుదీర్ఘమైన తన కెరీర్‌లో ఆమె ఇలాంటి ఘనతలు ఎన్నో సాధించారు.

1957 అక్టోబరులో పుట్టిన అర్చనకి మొదటి నుంచీ గొప్ప పోలీస్‌ అధికారి కావాలన్నదే కలగా ఉండేది. అసలు మహిళలు ఉన్నత విద్యను సాధించడమే గొప్పగా భావించే ఆ రోజుల్లో అర్చన అటు MA, MSc పట్టాలనూ ఇటు IPSలో స్థానాన్నీ సంపాదించారు. ఐపిఎస్‌లో చేరిన తొలిరోజు నుంచీ కూడా అర్చన నిబద్ధత కలిగిన అధికారిగా పేరుపొందారు. ఆమె భర్త రాఘవన్‌ కూడా తమిళనాడు ఐపిఎస్‌ కావడంతో ఆమె తన విధులను నిర్వహించేందుకు కుటుంబ సహకారం కూడా తోడైనట్లుంది. 1980లో పోలీసు శాఖలో చేరిన అర్చన క్రమక్రమంగా డిజిపి స్థాయికి చేరుకున్నారు. 1995లో తన సేవలకుగాను రాష్ట్రపతి పతకాన్ని సైతం సాధించారు.

అర్చన ప్రతిభ గురించి విన్న కేంద్ర ప్రభుత్వం 2014లో ఆమెను సిబిఐకి అదనపు డైరక్టరుగా నియమించింది. ఆ పదవిని చేపట్టిన తొలి మహిళ అర్చన! తమ రాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఒక ముఖ్య అధికారిని కేంద్ర ప్రభుత్వం తీసేసుకోవడం తమిళనాడు ప్రభుత్వానికి నచ్చలేదు. ఆ కక్షతో ఆమె రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఉద్యోగం నుంచి రిలీవ్ చేయకుడా సస్పెండ్‌ చేసింది. ఆ సమయంలో తమిళనాట ముఖ్యమంత్రిగా జయలలిత సాటి మహిళ అని కూడా చూడకుండా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో వివాదాస్పదమైంది. అయినా ఇలాంటి వివాదాలకీ, వివక్షలకీ అతీతంగా తన పని తాను చేసుకుంటూ… ఆ పనితోనే సామర్థ్యాన్ని నిరూపించుకునే తత్వం అర్చనది. తరువాత రోజుల్లో సాంకేతిక కారణాల వల్ల ఆమెను ‘నేషనల్ క్రైమ్‌ రికార్డ్స్ బ్యూరోకి డైరక్టరుగా నియమించినా, అక్కడ కూడా అర్చన తనదైన శైలిలో అధికారాలను నిర్వహించి అందరి మన్నననూ పొందారు.


ఇప్పుడు SSBకి ఉన్నతాధికారిగా నియామకాన్ని సాధించిన అర్చన ఈ పదవి మీద కూడా తన ముద్రని వేస్తారని ఆశిద్దాం. ఆల్‌ ద బెస్ట్‌ అర్చన!