అమెరికన్ బళ్ళల్లో బెదిరింపుకి (బుల్లియింగ్) గురిఅవుతున్న విద్యార్ధులు
అదొక స్కూల్ ఆవరణ. స్కూల్ పిల్లలంతా ఆడిటోరియంలో కూర్చుని ఆ రోజు బుల్లియింగ్ (Bullying) గురించి మాట్లాడటానికి వచ్చే గెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కబుర్లు చెప్పుకుంటూ. రాబర్ట్, 45 ఏళ్ళ వయసు వుంటుంది. స్టేజ్ పైకి వచ్చి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత స్క్రీన్ పైకి కంప్యూటర్ వాడుతూ ఒక అబ్బాయి, పదమూడేళ్ళ వయసుంటుంది, నీలి కళ్ళతో, వొత్తైన జుట్టుతో, బుగ్గల్లో సొట్టలతో నవ్వుతూ వున్న ఫోటో ప్రొజెక్ట్ చేసాడు. పిల్ల్లలందరూ ఇంకా మాట్లాడుకుంటున్నవారు ఆ ఫోటో చూడగానే నిశ్శబ్దంగా అయిపోయారు. ఆ ఫోటో చుట్టూ ఆ అబ్బాయి చిన్నప్పటి, ఫోటోలు పెట్టాడు రాబర్ట్. ఆ తర్వాత గొంతు సవరించుకుని మాట్లాడసాగాడు.
రాబర్ట్ చిన్న కొడుకయిన స్టీవ్ ఎలా బుల్లియింగ్ గురి అయ్యాడు చెప్పసాగాడు. స్టీవ్ పుట్టినపుడు మామూలుగానే అనిపించాడు, చూడడానికి అందరిలా మామూలుగా పెరుగుతున్నాడు, ముద్దులు మూటకడ్తూ అందరినీ ఆనందంలో ముంచేస్తున్నాడు. కానీ స్కూల్ వయసు వచ్చేసరికి తెలిసిందేమంటే అతనికి ఏ.డి.హెచ్.డి (ADHD-Attention Deficit Hyperactivity Disorder) వుందని తేలింది. అది తెలిసిన తర్వాత ఇంట్లోనే తల్లి తండ్రి హోం స్కూలింగ్ అని స్కూల్ నుండి సిలబస్ తెప్పించి చదువు చెప్పారు. అలా కొన్నాళ్ళయ్యాక స్పెషల్ ఎడ్, అంటే ఇలాంటి పిల్లలకి వారికి చెప్పాల్సిన పద్దతిలో అన్నీ నేర్పిస్తారు, అక్కడికి వెళ్ళేవాడు. కొన్నేళ్ళ తర్వాత ఆ టీచర్లు స్టీవ్ బాగా ఇంప్రూవ్ అయ్యాడని ఇక అతన్ని మామూలు స్కూలుకి పంపించవచ్చని చెప్పారు, దాంతో స్టీవ్ మామూలు స్కూలుకి వెళ్ళసాగాడు. కొన్నాళ్ళు బాగానే గడిచింది కానీ అతని సంగతి తెలిసిన వారు అతన్ని తెలివిలేని దద్దమ్మలా చూడడం, నానా రకాల మాటలతో, చేతలతో బెదిరించడం, విసిగించడం మొదలు పెట్టారు. ఇంట్లో వారికి తెలిసింది. మొదలు స్టీవ్ కి అవన్నీ పట్టించుకోవద్దనీ, వాళ్ళు అన్నంత మాత్రానా, స్టీవ్ వ్యక్తిత్వం మారిపోదని, ధైర్యం చెప్పారు.
తనతో క్లోజ్ గా తిరిగే ప్రెండ్ తో సరదాగా ఏదో జోక్ చెబితే అతను వెళ్ళి స్టీవ్ కి ఆడపిల్లలంటే ఇష్టం లేదని అతను "గే" అని అందరికి చెప్పాడు. దాంతో స్టీవ్ పరిస్థితి మరింత కఠినమై పోయింది. సెలవుల్లో ఆన్ లైన్ లో తన ఫ్రెండ్స్ లిస్ట్ లో ఒకమ్మాయిని తన గర్ల్ ఫ్రెండ్ గా పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి కూడా అతనంటే తనకిష్టం అని ఆన్ లైన్ లో చెప్పేది. స్కూల్ తెరవగానే ఆ అమ్మాయి వచ్చి అందరి ముందర స్టీవ్ అంటే తనకిష్టం లేదని, అతనొక స్టుపిడ్ అని, అతన్ని తను ఎలా ఇష్టపడుతుంది అని పగలబడి నవ్వి తామిద్దరూ ఆన్ లైన్ లో రాసుకున్న మెసెజస్ అందరికీ చదివి వినిపించింది. అది విని అందరూ పడి పడి నవ్వసాగారు. స్టీవ్ నివ్వెరపోయాడు. అతని వయసు 13, ఇంత అవమానాన్ని అతని మనసు తట్టుకోలేక పోయింది. అది స్టీవ్ జీవితంలో మొదటి ప్రేమ, తను ప్రేమిస్తున్న అమ్మాయి అంత భయంకరంగా అవమానించడం ఆ చిన్ని మనసు తట్టుకోలేకపోయింది. ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. రాబర్ట్ కి ముందు కోపం వచ్చినా దానివల్ల తను ఏమీ చేయలేనని, స్టీవ్ తిరిగి రాడని అందుకే తన కొడుక్కి జరిగిన అన్యాయం మళ్ళీ ఎవరికీ జరగకుండా వుండాలని, బుల్లియింగ్ గురించి చాలా రిసెర్చ్ చేసి అమెరికాలో ఎన్ని స్కూల్స్ వీలయితే అన్ని స్కుల్స్ కెళ్ళి ఈ బుల్లియింగ్ గురించి అవగాహన పెంచాలని నిశ్చయించుకున్నాడు.
ఎంతో భవిష్యత్తు వున్న ఇంకా ఎన్నో నేర్చుకోవాల్సిన వయసులో అర్ధాంతరంగా ఏ జబ్బు లేకుండా, ఆడుతూ పాడుతూ వున్న పిల్లలు జీవితాన్ని ప్రేమించాల్సినవారు అంత చిన్న వయసులో ఎలా ప్రాణాలు తీసుకుంటున్నారో తెలియక జుట్లు పీక్కుంటున్నారు తల్లి తండ్రులు. తాము ఏం తప్పు చేసాము, ఇంకా ఏమన్నా చేయాల్సిందా అని కుమిలిపోతారు. అసలు బుల్లియింగ్ అంటే ఏమిటీ అన్నది మీకందరికీ ఈ సంఘటన చదివితే ఒక ఐడియా వచ్చి వుంటుంది.
స్కూల్స్ అంటే చదువుకోవడానికి, స్నేహితులతో సరదాగా గడపడానికి, ఆటలాడుకోవడానికి, భవిష్యత్తుకి మార్గం వేసుకోవడంలా వుండాలి. కానీ అమెరికాలో, యూరోప్ లో కొన్ని స్కూల్స్ లో ఈ బుల్లియింగ్ ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు తీసుకోవడానికి కారణం అవుతుంది. ఇది ఎలిమెంటరీ స్కూల్ లో మొదలైతే, మిడిల్ స్కూల్ లో, హైస్కూల్ వరకూ కొనసాగుతుంది. ఒకో స్టేజ్ లో ఒకో రకంగా వుంటుందీ బుల్లియింగ్.
ఈ బుల్లియింగ్ మిడిల్ స్కూల్ లో ఎక్కువగా జరుగుతుందని ముఖ్యంగా ఐదు, ఆరవ తరగతి వారిని ఏడు, ఎనిమిది తరగతి వారు ఏడిపిస్తుంటారని ఒక సర్వేలో తేలింది. బుల్లియింగ్ చేసేవారు కొట్టడం, తన్నడం, తోసెయ్యడం, క్రింద పడేయడం, స్కూల్ బస్ లో నానా రకాలుగా విసిగించడం చేస్తుంటారు.
ఈ బుల్లియింగ్ ఎన్నో రకాలుగా వుంటుంది. పెద్ద చేప చిన్న చేపని తిన్నట్టుగా స్కూల్స్ లో అదే విధంగా కొంచెం బాగా మాట్లాడగలిగేవారు, ఒకోసారి కొంచెం డబ్బున్న వారు లేదా బాగా కంట్రోలింగ్ వ్యక్తిత్వం వున్నవారు తమచుట్టూ ఒక గ్రూప్ ని తయారు చేసుకుంటారు. వీరిని పాపులర్ కిడ్స్ అంటారు, వీరిలో మగపిల్లలయితే చదువులో మంచి గ్రేడ్స్ వచ్చినా రాకున్నా, కొంచెం సింపుల్ గా వుండి, కొద్దిగా సిగ్గుపడుతూ, మరీ ఎక్కువగా మాట్లాడడం రాని వారిని శారీరకంగా బలహీనంగా వున్నా, వికలాంగులను, వేరే దేశస్థులను, వేరే జాతికి చెందిన వారిని, నల్లవారిని, లేదా తల్లి తండ్రుల్లో ఒకరు తెలుపు, ఒకరు వేరే దేశస్థులయినా, లేదా, ఇతర జాతికి సంబంధించిన వారైనా, ఏమైనా చిన్న లర్నింగ్ ప్రాబ్లెమ్స్ వున్నా, ఇలా ఒక విషయం అని చెప్పడానికి లేదు వారికి పిల్లలను బెదిరించడానికి, తమ బలాన్ని చాటుకోవడానికి ఏదో ఒక కారణం కావాలి అంతే. సున్నిత మనస్కులయిన పిల్లలయితే ఈ బుల్లియింగ్ ని తట్టుకోలేక ప్రాణాలను కూడా తీసుకుంటారు. దీన్న”బుల్లిసైడ్’ అంటున్నారు.
గ్రూప్ గా ఏడిపించడం ఒక రకమైతే, ఒక్కరే ఒకరిని పట్టుకుని కొట్టడం, వారి తలని గోడకేసి కొట్టడం, కాళ్ళతో తన్నడం, జుట్టు పట్టి పీకడం, గొంతు పిసకడం,వారి వస్తువులు పాడుచేయడం, పడేయడం చేస్తారు. మిడిల్ స్కూల్ లో పాపులర్ అమ్మాయిలు, పాపులర్ కానీ అమ్మాయిలని వుంటారు. పాపులర్ అమ్మాయిల్లో కొంచెం అందంగా వుండి బాగా ఫ్యాషనబుల్ బట్టలు వేసుకుని, బాగా చదువుకుంటూ సింపుల్ గా వుండే అమ్మాయిలను, కళ్ళకు కాంటాక్ట్స్ కాకుండా కళ్ళద్దాలు పెట్టుకునే అమ్మాయిలను, టీజ్ చేయడం, అమ్మాయిల్లో ఎక్కువగా తాము బెదిరించే అమ్మాయిల గురించి పుకార్లు పుట్టించి వాటిని అందరికీ ప్రచారం చేయడం, వారికి సంబందించిన వస్తువులను దాచేయడం లేదా దొంగిలించడం, వారిని మాటలతో, తిట్లతో ఇన్ సల్ట్ చేయడం చేస్తుంటారు. స్పోర్ట్స్ ఆడేవారు, ఆడనివారిని చులకనగా చూడడం, అమ్మాయిల్లో, చియర్ లీడింగ్ చేసేవారు తాము చాలా అందంగా వుంటామని, వారంతా ఒక గ్రూప్ గా వుంటారు వేరే వారిని తమతో ఎక్కువగా కలవనీయరు. మిగతా అమ్మాయిలను చులకనగా చూస్తారు. (అందరూ ఇలాగే వుంటారని కాదు కానీ చాలావరకు ఇలాగే వుంటున్నారని సర్వేలు తెలుపుతున్నాయి.) ఆన్ లైన్ ద్వారా బుల్లియింగ్ ని సైబర్ బుల్లియింగ్ అంటున్నారు. హై స్కూల్లో ఎక్కువగా జరుగుతుంటుంది, ఈ మధ్యన మిడిల్ స్కూల్ కి కూడా పాకింది అంటున్నారు ఈ బుల్లియింగ్ పై సర్వే చేసినవారు.
ఈ సైబర్ బుల్లియింగ్ లో ఎవరైన ఒకరి గురించి ఉన్నవీ లేనివీ కల్పించి రాసి అందరికీ మెసేజస్ ద్వారా పంపించి వారి ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థయిర్యం పై దెబ్బ తీయడానికి ప్రయత్నం చేస్తారు. స్కూల్లో ఫ్రెండ్స్ లేనివారు ఈ ఆన్ లైన్ ఫ్రెండ్ షిప్ చేయడం మోసం గురించి తెలియనివారిని ఫ్రెండ్స్ అయ్యి వారి నమ్మకాన్ని సంపాదించుకున్న తర్వాత వారు చేయమన్న పనులను చేసేట్టు చేసుకుంటారు. ఇందులో అందమైన అమ్మాయిలనయితే చిన్న బట్టలేసుకుని డ్యాన్స్ చేయమని అడగడం, అదీ సరదా కోసం అని నమ్మిస్తూ, ఆ తర్వాత వారికిష్టమయిన రీతిలో వారి ఫోటోలు తీసుకోవడం, లేదా ఫిల్మ్ చేయడం వాటిని ఏమి చేయము అని చెప్పి ఆన్ లైన్ లో పోర్నోగ్రఫి సైట్స్ అన్నిట్లో పోస్ట్ చేయడం అవి స్కూల్లో వారు చూసి ఆ అమ్మాయిని ఏడిపించడం చేస్తారు. అది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటారు.
2010 లెక్కల ప్రకారం ప్రతి ఏడాది 2.7 మిలియన్ల విద్యార్ధులు ఈ బుల్లియింగ్ కి గురవుతున్నారు. కిండర్ గార్టెన్ నుండి పన్నెండవ తరగతి వరకు ఏడుగురు విద్యార్ధుల్లో ఒకరు ఒక బుల్లిగానో లేదా బుల్లియింగ్ కి గురయినవారున్నారు. ఒకోసారి ఒక టీనేజర్ కానీ చిన్నపిల్లలు కానీ బుల్లియింగ్ కి గురయితే వారే మళ్ళీ బుల్లియింగ్ చేసే అవకాశం వుంది ఎందుకంటే వారికి ఎవరిపైనైన కక్ష తీర్చుకోవాలనిపించడమే కారణం.
అసలు ఈ బుల్లియింగ్ ఎందుకు చేస్తారు? అన్న ప్రశ్నకి సైకాలజిస్ట్ లు ఇచ్చే సమాధానం, " ఎవరైనా సరే, ఈ బుల్లియింగ్ చేసేవారు టీనేజర్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దవారు కానీ వారు ఇంట్లో వారి చేతిలో హింసాత్మక చర్యలకు గురైతే వారే ఇలా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా వుంది," అంటున్నారు. దేశం మొత్తంలో ప్రతి నెల దాదాపు 282,000 విద్యార్ధులు బుల్లియింగ్ కి గురవుతున్నారని ఈ లెక్కల ప్రకారం తెలుస్తుంది.
యేల్ స్కూల్ ఆఫ్ మెడిసెన్ (Yale School of Medicine) కొత్త స్టడీ ప్రకారం యవ్వనంలోకి అడుగిడుతున్న వారి ఆత్మహత్యలు గత ముప్పై ఏళ్ళకన్నా50% కంటే ఎక్కువగా పెరిగిపోయాయి. బుల్లియింగ్ కి గురయ్యేవారు డిప్రెషన్ కి లోనవ్వుతారని, దాన్ని గమనించి స్కూల్లో కౌన్సిలర్ దగ్గర కానీ, థెరఫిస్ట్ దగ్గరకు తీసుకెళితే వారు ఈ సమస్యను ఎదుర్కునే ధైర్యం వస్తుంది, ఆత్మహత్యయ్ చేసుకోకుండా ఆపవచ్చు కూడా. పిల్లలు బుల్లియింగ్ కి గురవ్వకుండా వుండాలంటే తల్లితండ్రులు పిల్లలతో దాని గురించి మాట్లాడాలని, స్కూల్లో ఎవరన్నా విసిగిస్తుంటే తల్లి తండ్రులకు చెప్పొచ్చు అనే ధైర్యం వస్తుంది. పిల్లల్లో ముందునుండే ఆత్మస్థయిర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందేలా చూడాలని, దాని వల్ల ఎవరైనా విసిగించినా పిల్లలు పెద్దగా పట్టించుకోరని, బుల్లియింగ్ గురించి పిల్లలు వెంటనే పెద్దవారికి చెప్పడమో లేదా స్కూల్లో టీచర్స్ కానీ ప్రిన్సిపాల్ లాంటి వారికి రిపోర్ట్ చేస్తే అది తెలిస్తే విసిగించేవారు వెనక్కి తగ్గుతారు ఎందుకంటే వారికి కఠినమైన శిక్షలున్నాయి పిల్లల డిటెన్షన్ సెంటర్లలో.
ఇప్పుడు దేశ వ్యప్తంగా స్కూల్స్ లో ఈ బుల్లియింగ్ కి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టారు, పిల్లల్లో, తల్లితండ్రుల్లో అవగాహన పెంచడం, పిల్లలు తమను తాము స్వయంగా రక్షించుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించడం చేస్తున్నారు, బుల్లియింగ్ కి వ్యతిరేకంగా పుస్తకాలు రాస్తున్నారు, డాక్యుమెంటరీలు చేస్తున్నారు, రేడియోలో, టీ.వి.లో యాడ్స్ లా చూపిస్తుంటారు.
పిల్లలు ఎప్పుడు ఒక్కరే వుండకుండా మంచి స్నేహితులతో ఎల్లప్పుడూ వుండాలని ఒకరికొకరు సాయం చేసుకుంటే కూడా ఈ బుల్లియింగ్ ని ఆపవచ్చని అంటున్నారు.
-కనకదుర్గ