డ్రీమ్ ఫీడింగ్.. పిల్లలు రాత్రిళ్ళు నిద్రలేవడమనే సమస్యే ఉండదు..
ఈ సృష్టిలో తల్లికావడం చాలా గొప్ప విషయం. చెప్పలేనంత అనుభూతి తల్లుల సొంతం.కొత్త తల్లి మనస్సులో శిశువుకు సంబంధించి అనేక ప్రశ్నలు, సందేహాలు ఉంటాయి. బిడ్డకు స్నానం చేయించడం నుంచి తల్లి పాలివ్వడం వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి గందరగోళాల మధ్య కొత్త తల్లులకు మరొక సవాల్ రాత్రిపూట ఎదురవుతుంది. రాత్రిపూట శిశువుకుపాలు ఇవ్వడం చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది.నవజాత శిశువులు తరచుగా రాత్రి సమయంలో మేల్కొంటారు. ఈ సమయంలో బిడ్డకు తల్లి పాలు ఇవ్వడం, బిడ్డ నిద్రలోకి జారుకోవడం, ఆ తరువాత మరికొద్దిసేపటికే బిడ్డ మేల్కోవడం జరుగుతుంటుంది. దీనివల్ల తల్లికి నిద్రకరువవుతుంది. కానీ 'డ్రీమ్ ఫీడ్' బిడ్డకు మంచి నిద్రను ఇవ్వడంలో సహాయపడుతుంది. ఇది మంచి ఎంపిక కూడా. అసలు డ్రీమ్ ఫీడింగ్ అంటే ఏమిటి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? వీటికి సమాధానం తెలుసుకుంటే ఇవి చంటి బిడ్డలున్న తల్లులకు ఎంతగానో ఉపయోగపడతాయి.
డ్రీం ఫీడింగ్ అంటే ఏమిటి?
డ్రీం ఫీడింగ్ అంటే నిద్రలో బిడ్డకు పాలివ్వడం. డ్రీం ఫీడ్ సాధారణంగా రాత్రి 10 లేదా 11 గంటలకు నిద్రపోయే ముందు చేయాలి. ఇది రాత్రంతా శిశువు కడుపు నిండుగా ఉంచుతుంది. బిడ్డ చాలా కాలం పాటు ప్రశాంతంగా నిద్రించగలడు.
డ్రీమ్ ఫీడింగ్ ఎలా చేయాలి?
డ్రీం ఫీడింగ్ కోసం ప్రతిరోజూ ఒకే సమయంలో శిశువును నిద్రపోనివ్వాలి. ఇలా అలవాటు చేస్తే ఈ ఫీడింగ్ కూడా చాలా బాగా సక్సెస్ అవుతుంది. అదే సమయంలో రాత్రి 10 లేదా 11 గంటలకు తల్లి పిల్లవాడిని ఎత్తకుండా, నిద్రలేపకుండా మెల్లగా పక్కన పడుకుని బిడ్డ నోటి దగ్గర తల్లి రొమ్మును సున్నితంగా అందివ్వాలి. బిడ్డ స్వయంచాలకంగా పాలు తాగడం ప్రారంభిస్తాడు.ఆ సమయంలో బిడ్డను మెల్లిగా ఎత్తుకోవాలి. ఇలా ఎత్తుకునేటప్పుడు లైట్ ఆన్ చేయవద్దు, తద్వారా అది బిడ్డ నిద్రకు భంగం కలిగించదు. అంతేకాదు అవసరమనే కారణంతో డైపర్‌ను కూడా మార్చవద్దు.
అయితే తల్లులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్రీమ్ ఫీడ్ లు ఎప్పుడూ మొదటిసారే విజయవంతం కావు. కాబట్టి కొంత సమయం తీసుకోవాలి. శిశువు అలవాటు పడే వరకు డ్రీమ్ ఫీడ్‌ని మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉండాలి. చాలా సార్లు పిల్లలు డ్రీమ్ ఫీడ్ సమయంలో పూర్తిగా పాలు తాగుతారు, ఉదయం వరకు నిద్రపోతారు. కానీ కొందరు పిల్లలు డ్రీమ్ ఫీడ్ తర్వాత కూడా చాలా సార్లు రాత్రి మేల్కొంటారు. కొన్నిసార్లు పిల్లలు డ్రీమ్ ఫీడ్ సమయంలో మేల్కొంటారు, తర్వాత చాలా సేపు మెలకువగా ఉంటారు. ఇది సక్సెస్ కావాలంటే సమయం పడుతుంది. తల్లులు నిరాశతో దీన్ని ఆపకుండా రోజూ ప్రయత్నిస్తుంటే ఇది సక్సెస్ అవుతారు.
లాభాలేంటంటే..
డ్రీమ్ ఫీడ్ తో బిడ్డ ఎక్కువ సేపు నిద్రపోతాడు. ఇది పిల్లలకు అలవాటైతే పిల్లలు ఉదయం నేరుగా మేల్కొంటారు. ఇదొక మంచి అలవాటుగా మారుతుంది. డ్రీం ఫీడింగ్ తల్లి, బిడ్డ బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. కాబట్టి తల్లులు నిరాశ పడకుండా దీన్ని అలవాటు చేయడం మంచిది.
*నిశ్శబ్ద.