అదీ త్రివిక్రమ్ మ్యాజిక్ అంటే...
on Apr 14, 2015
ఏ సినిమాకైనా - టాక్‌ని బట్టే వసూళ్లు..! సినిమా బాలేదని తెలిస్తే.. ఆ థియేటర్ చుట్టుపక్కలకు వెళ్లడానికి కూడా జనాలు భయపడుతున్నారు. రివ్యూలూ వసూళ్లలో తన వంతు పాత్ర పోషిస్తున్నాయి. అయితే సన్నాఫ్ సత్యమూర్తి విషయంలో ఈ థీరీ మొత్తం రివర్స్ అయ్యింది. ఈ సినిమాపై విపరీతమైన డివైడ్ టాక్ వచ్చింది. సినిమా బాగుంది అన్నవాళ్లు కూడా ఏదో ఓ అసంతృప్తి వెళ్లగక్కారు. మొత్తానికి ఇది త్రివిక్రమ్ సినిమాలా లేదేంటి? అని పెదవి విరిచారు. అయితే... వసూళ్లు మాత్రం భీకరంగా ఉన్నాయి. తొలి నాలుగు రోజులకూ. 30 కోట్లు దాటేసిందని ట్రేడ్ వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఓవర్సీస్‌లో దుమ్ము దులిపింది. తమిళనాడు, కర్నాటకలలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
రివ్యూలు నెగిటీవ్‌గా ఉన్నా, జనాలు పెదవి విరుస్తున్నా, త్రివిక్రమ్ అభిమానులు నొచ్చుకొంటున్నా ఈ వసూళ్ల ఉదృతికి కారణమేంటి?? వెరీ సింపుల్. ఇది త్రివిక్రమ్ సినిమా. త్రివిక్రమ్ ఎట్టిపరిస్థితుల్లోనూ చెత్త సినిమా తీయడు.. అని జనాలు బాగా నమ్ముతున్నారు. సినిమా బాలేదు.. అంటున్నా..`ఎలా ఉందో ఓసారి చూసొద్దాం..` అనేవాళ్లే ఎక్కువయ్యారు. సినిమాకి భారీవసూళ్లు రావాలంటే రెండు మూడుసార్లు చూడొక్కర్లెద్దు. అందరూ ఒకొక్కసారి చూస్తే చాలు. ఇప్పుడు సన్నాఫ్ సత్యమూర్తికీ అదే ఫార్ములా వర్కవుట్ అయ్యింది. ప్రతీ ఒక్కరూ ''ఈసినిమా త్రివిక్రమ్ ఎలా తీశాడో చూసొద్దాం'' అనుకొన్నవాళ్లే. దాంతో.. వసూళ్లకు కొదవ లేకుండా పోయింది. ఈ సినిమాకి వచ్చిన హైప్.. దేవిశ్రీ పాటలతో చేసిన మ్యాజిక్, ఉపేంద్ర, స్నేహ, నిత్యమీనన్‌లాంటి భారీ తారాగణం.. ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. అదీ... సత్యమూర్తి స్పీడుకి కారణం.