బాపు ప్రాణం అయితే ముళ్ళపూడి ఆత్మ
on Feb 23, 2011
"స్నేహమేరా జీవితం-స్నేహమేరా శాశ్వతం" అన్నాడో కవి.తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతో,బంధువులతో చెప్పుకోలేని అనేక విషయాలు దాపరికం లేకుండా ఒక్క స్నేహితుడితోనే చెప్పుకోగలం.ఈ విషయాన్ని ఎవరైనా కాదనగలరా...?అలాంటి స్నేహాన్ని అందించే సరైన స్నేహితుడు ఒక్కడు దొరికితే ఆ మనిషి జన్మధన్యం.స్నేహం విలువ తెలిసిన వారి స్నేహం కలకాలం నిలిచి ఉంటుందనటంలో సందేహం లేదు.స్నేహానికి ఆస్తులు,అంతస్తులు ఏనాడూ అడ్డంకిగా నిలబడలేవు.అందుకు ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ,కుచేలుర స్నేహమే నిదర్శనం.ఇలాంటి అపూర్వ స్నేహితులు మనకాలంలోనూ ఉన్నారు.వారు మరెవరో కాదు.బాపు-రమణలే. వీళ్ళిద్దరినీ ఈ మిల్లీనియం స్నేహితులని ఘంటాపదంగా చెప్పవచ్చు. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, ఆనందంలోనూ, బాధల్లోనూ వీరు కలిసే ఉన్నారు.అంతేకాదు...తమ స్నేహాన్ని బంధుత్వంగా కూడా మార్చుకున్న అపూర్వ స్నేహితులు బాపు-రమణలు.అన్నట్టు బాపుగారి అసలు పేరు మీకు తెలుసా...?సత్తిరాజు లక్ష్మీనారాయణ బాపుగారి అసలు పేరు.
ఆయన పశ్చిమ దావరి జిల్లాలోని నర్సాపురంలో జన్మించారు.1955లో ఆయన మద్రాసు యూనివర్సిటీ నుంచి,"లా"లో డిగ్రీ పూర్తిచేశారు.ఆయన మంచి పెయింటర్, కార్టూనిస్ట్ కావటంతో ఆయనకు "ఆంధ్రపత్రిక"లో ఉద్యోగం దొరికింది.అలాగే తన 14వ సంవత్సరంలోనే కథలు వ్రాయటం మొదలు పెట్టిన ముళ్ళపూడి వేంణకటరమణ "అమ్మమాట వినకపోతే"అన్న కథను వ్రాశారు.అసలింతకీ బాపు- రమణలు తొలిసారి ఎప్పుడు కలిశారంటే వాళ్ళిద్దరూ మద్రాలోని పి.యస్.హైస్కూల్ లో నాలుగవ తరగతి చదివేటప్పుడు1942 లో కలిశారు
.సినీ రంగంలోకి ముందుగా రచయితగా ముళ్ళపూడి ప్రవేశించారు. 1962 లో ఆయన తొలిసారి "రక్తసంబంధం"అనే చిత్రానికి రచయితగా పనిచేశారు.ఆయన రచనల్లోని హాస్యం వల్ల ప్రసిద్ధి చెందిన ముళ్ళపూడివారు తొలిసారి ఒక అన్నాచెల్లి మధ్య సెంటిమెంట్ తో కూడిన సినిమాకి మాటలు వ్రాయటం విచిత్రం కదూ.ఆ తర్వాత ఆయన మూగమనసులు,దాగుడు మూతలు,ప్రేమించిచూడు,కన్నె మనసులు,నవరాత్రి, పూల రంగడు,ప్రాణమిత్రులు వంటి చిత్రాలకు మాటలు,కథలు వ్రాశారు.
ఆ తర్వాత ముళ్ళపుడి వారికి బాపుగారి నిశిత దృష్టి మీద ఉన్న నమ్మకంతో "మనమే ఒక సినిమా ఎందుకు తీయకూడద"న్నతన ఆలోచనను బాపు గారికి చెప్పటంతో,1967లో "సాక్షి" చిత్రం మొదలయ్యింది.అది ఆశించినంతగా ఆర్థిక విజయం సాధించకపోయినా బాపు-రమణలకు బోల్డంత పేరు తెచ్చిపెట్టింది.తర్వాత "బంగారు పిచ్చుక"అనే సినిమా తీశారు.అదికూడా జాటర్ ఢమాల్ అయ్యింది.
1969లో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుగారు ద్విపాత్రాభినయం చేయగా,బాపు దర్శకత్వంలో,ముళ్ళపూడి వేంకట రమణ నిర్మాతగా"బుద్ధిమంతుడు"అనే చిత్రాన్ని తీశారు.దీన్నిఒక క్లాసిక్ చిత్రంగా ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు.ఆ చిత్రం ఘనవిజయం సాధించటంతో బాపు-రమణల పేర్లు ఆంధ్రప్రదేశ్ లో మారుమ్రోగిపోయాయి. ఆ తర్వాత ఇంటిగౌరవం,బాలరాజుకథ వంటి చిత్రాలను తీశారు. అప్పుడే బాపు-రమణలు ఒక సాహసం చేశారు.
అదేమటంటే "సంపూర్ణరామాయణం"అనే పౌరాణిక చిత్రాన్ని తీశారు.అప్పటి వరకూ రాముడన్నా,కృష్ణుడన్నా అందరికీ గుర్తొచ్చే పేరు నటరత్న యన్ టి ఆర్.ఆయన్ని కాదని శోభన్ బాబుని శ్రీరాముడిగా నటింపజేశారా చిత్రంలో.మొదట్లో ఎవరూ పట్టించుకోని ఆ చిత్రం కలెక్షన్లలో ఒక సునామీనే సృష్టించింది.ఆ చిత్రంలో రావణాసురుడిగా యస్.వి.రంగా రావు గారి నటన ఆకాశాన్నంటిందని చెప్పాలి.
అలా అలా 1975 లో "ముత్యాల ముగ్గు"అనే అపూర్వమైన చిత్రాన్ని తీశారు.రావు గోపాలరావుగారికి ఆ చిత్రం విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది.ఆ చిత్రంలోని డైలాగుల కోసం ఆడియో కేసెట్లు వేలాదిగా అమ్ముడు పోయాయి.ఆ తర్వాత కృష్ణంరాజు హీరోగా "భక్తకన్నప్ప","మనవూరి పాండవులు"అనే చిత్రాలను తీశారు."అందాలరాముడు","శ్రీ రామాంజనేయ యుద్ధం",రాధాకళ్యాణం,చిరంజీవి హీరోగా "మంత్రిగారి వియ్యంకుడు"అనే చిత్రాన్ని,
1991లో "పెళ్ళి పుస్తకం","మిస్టర్ పెళ్ళాం"చిత్రాలు బాపు-రమణలను మళ్ళీ వెలుగులోకి తెచ్చాయి."శ్రీనాథ కవిసార్వభౌముడు" చిత్రానికి పనిచేయవలసిందిగా యన్ టి ఆర్ స్వయంగా బాపు-రమణలను అడిగారట."సీతా కళ్యాణం"అనే చిత్రం అంతర్జాతీయ స్థాయిలో వారికి గుర్తింపు తెచ్చింది.అలాంటి అద్భుతమైన చిత్రాలను మనకందించిన ఘనులు బాపు-రమణల స్నేహానికి 60 వసంతాలు పూర్తయ్యాయి. ఆదర్శప్రాయులైన స్నేహితులు బాపు-రమణలను "మిలీనియం ఫ్రెండ్స్"గా తెలుగువన్ భావిస్తుంది.
అటువంటి ప్రాణ స్నేహితుల్లో ప్రాణం బాపు అయితే ఆత్మ ముళ్ళపూడి వారు. ఫిబ్రవరి 23 వ తేదీన చెన్నైలోని వారి స్వగృహంలో ముళ్ళపూడి వారు దివి కవిసమ్మేళన ఆహ్వానానికి స్పందించి, తన ప్రాణాన్ని ఇక్కడ భువిలోనే వదిలేసి ఒంటరిగా స్వర్గానికి వెళ్ళటం జరిగింది.ముళ్ళపూడి వారు ఆయనకేం మహానుభావుడు ఎంచక్కా 80 వసంతాలు కవితా సేద్యం చేసి,పై లోకాల్లోనూ సాహిత్య సేద్యం చేయటానికి, ఆ సేద్యంలోని కొత్త మెళుకువలు వారికి తెలియ చెప్పటానికి, మనల్ని దుఃఖసాగరంలో ముంచి సంతోషంగా తరలిపోయారు.కానీ తెలుగు సినీ పరిశ్రమకు ఆయన లేని లోటు ఎవరూ తీరుస్తారు...? మరో బుడుగు వచ్చి తన "శీ గాన పసూనాంబ"తో ముచ్చట్లను చెప్పేలా ఎవరు వ్రాస్తారు. మరో "జనతా ఎక్స్ ప్రెస్"లో సామాన్యుడి సాధక బాధకాలను సునిశిత హాస్యంతో మనకు ఇంకెవరు చెపుతారు.
ఆయన "కోతికొమ్మచ్చి"ని వేరెవరు వ్రాయగలరు....? అది ఒక్క ముళ్ళపూడి వారికే సాధ్యం కదా...! ఆయన ఘన నిర్యాణం మనకన్నా ఆయన ప్రాణం బాపు గారికి మరింత తీరని లోటు. తెలుగువన్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతిని ప్రార్థిస్తూంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



