
సూపర్ స్టార్ కృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు
సూపర్ స్టార్ కృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు సినీ పరిశ్రమలో సాంకేతికంగా చాలా మార్పులకు కారణమైన హీరో, డేరింగ్ అండ్ డాషింగ్ అన్న మాటకు నిర్వచనం చెప్పిన హీరో ఘట్టమనేని శివరామకృష్ణ అంటే సూపర్ స్టార్ కృష్ణ. గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, బుర్రిపాలెం గ్రామంలో, వీరరాఘవయ్య, నాగరత్నమ్మ దంపతులకు 1943 వ సంవత్సరం, 'మే' 31 వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ జన్మించారు. బి.యస్.సి. వరకూ చదువుకున్నారు కృష్ణ. చదువుకునే రోజుల్లోనే నటన మీద మక్కువతో అనేక నాటకాలాడారు కృష్ణ. అనతరం 1965 లో"తెనె మనసులు" చిత్రం ద్వారా తొలిసారి హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత తెలుగు వెండితెర మీద సూపర్ స్టార్ ప్రభంజనం మొదలయ్యింది. మామూలుగా కృష్ణ గారికి ధైర్యం చాలా ఎక్కువ. ఎవరూ ఊహించటానికి కూడా సాహసించని రోజుల్లో ఆయన "జెమ్స్ బాండ్" తరహా "గూఢచారి 116" వంటి గూఢచారి చిత్రాలకు శ్రీకారం చుట్టారు. అలాగే మనకు అసలు పరిచయం లేని "మోసగాళ్ళకు మోసగాడు" వంటి కౌబాయ్ చిత్రాలకు కూడా కృష్ణ గారే ఆద్యుడు. ఇక తొలి సినిమా స్కోప్ " అల్లూరి సీతారామరాజు" చిత్రాన్ని కూడా ఆయనే హీరోగా నటిస్తూ నిర్మించారు. "సింహాసనం' చిత్రంతో 70 m m ని కూడా ఆయనే తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశపెట్టారు. ఒక టైంలో ఆయన సినిమాలు సంవత్సరానికి 17 విడుదలైతే వాటిలో 9 వందరోజులాడాయి...! ఇక విశ్వవిఖ్యాతనటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారకరామారావుగారితో ఢీ అంటే ఢీ అంటూ ఆయన "దానవీరశూరకర్ణ" చిత్రానికి పోటీగా "కురుక్షేత్రం" చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు. రామారావు గారి తెలుగు దేశం పార్టీకి వ్యతిరేకంగా కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆయనకు వ్యతిరేకంగా "మండలాధీశుడు" అనే చిత్రాన్ని నిర్మించి రామారావు గారిని దారుణంగా విమర్శించారు. నిజానికి అప్పట్లో రామారావుగారిని ఎదుర్కోవటమంటే సామాన్యమైన విషయం కాదు. అయినా ఎదుర్కొన్నారు. కృష్ణ గారి గుండెధైర్యం అలాంటిది. ఇక నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన కళాఖండం "దేవదాసు" చిత్రాన్ని తాను హీరోగా నటిస్తూ, తన భార్య విజయనిర్మల దర్శకత్వంలో మళ్ళీ నిర్మించారు. తన మనసులో ఉన్న విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పగలిగిన వ్యక్తి తెలుగు సినీ పరిశ్రమలో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ తొలి స్థానంలో ఉంటారు. తన సినిమానే కాదు ఎవరి సినిమా అయినా చూడగానే ఆయన జడ్జిమెంట్ అద్భుతంగా ఉంటుంది. ఆయన ఇది సూపర్ హిట్ అంటే సూపర్ హిట్టే...ఆయన ఫ్లాపంటే ఫ్లాపే. దీనికి ఉదాహరణగా కృష్ణ గారు "పోకిరి" సినిమా చూసి "ఇది 40 కోట్లు వసూలు చేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్టవుతుంది" అని దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో ప్రిన్స్ మహేష్ బాబుతో అన్నారట. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ నవ్వుకున్నారట. కాని కృష్ణ గారు చెప్పిన మాటలు నిజమైన తర్వాత వాళ్ళిద్దరూ కృష్ణ గారి దగ్గరకు వెళ్ళి క్షమాపణలు కోరారట. 350 కి పైగా చలన చిత్రాల్లో నటించిన ఆయన 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తర్వాత తను సొంతంగా బ్యానర్ స్థాపించి అనేక చిత్రాలను నిర్మించారు. ఇలా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనితరసాథ్యం. అటువంటి కృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలనివ్వాలని కోరుకుంటూ తెలుగువన్ ఆయన సమర్పిస్తున్న చిన్న జ్ఞాపిక ఈ వ్యాసం.
May 31, 2012 10:37AM
యన్.టి.ఆర్.89 జయంతి
తెలుగు వారందరికీ శ్రీ రాముడన్నా, శ్రీకృష్ణుడన్నా కళ్ళముందు కనపడే దివ్యమంగళ విగ్రహం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారకరామారావు గారు. ఒక నటుడి పర్సనాలిటీ, ముఖ వర్చస్సు కొన్ని పాత్రలకే పరిమితమవుతాయి. అన్ని పాత్రలకూ అందరూ సరిపోరు. కానీ రాజు నుండి పేద వరకూ, కృష్ణుడి నుండి దుర్యోధనుడి వరకూ, రాముడి నుండి రావణాసురుడి వరకూ, రైతు బిడ్డగా, రాజుగా ఇలా ఒకటనేమిటి...అన్ని పాత్ర్రలకూ రామారావు గారి ముఖం కానీ, పర్సనాలిటీ కానీ ఆయన వాచకం కానీ చక్కగా అతికినట్టు సరిపోతాయి. అది ఒక్క యన్.టి.ఆర్.కే సాధ్యమైంది. ఆయన తొలి చిత్రం "మనదేశం" నుండి ఒక్కో చిత్రంలో ఒక్కో పాత్రలో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన నటించిన పాత్రల గురించి చెప్పాలంటే ఆయన నటించిన అన్ని చిత్రాల గురించీ చెప్పాలి. అది కష్టం కనుక ఆయన నటించిన అజరామరమైన కొన్ని పాత్రల గురించి తెలియజేస్తాను. పాతాళ భైరవి, లవకుశ, మయాబజార్, కన్యాశుల్కం, మల్లీశ్వరి, జయసింహ, భూకైలాస్, సారంగధర, రాజమకుటం, భట్టి విక్రమార్క, శ్రీ వేంకటేశ్వర మహత్యం, గుండమ్మ కథ, రాముడు-భీముడు, గుడిగంటలు, ఉమ్మడి కుటుంబం, చిరంజీవులు, బడిపంతులు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, పల్లెటూరి పిల్ల, పాండురంగమహత్యం, రాజు-పేద, భీష్మ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ కృష్ణ పాండవీయం, శ్రీ కృష్ణార్జున యుద్ధం, దానవీరశూరకర్ణ, దీపావళి, వేటగాడు, అడవి రాముడు, చండశాసనుడు, మేజర్ చంద్రకాంత్ వంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. చలన చిత్రాల్లో మహారాజుగా వెలుగుతూండగానే ఆయన రాజకీయాల్లోకి రావటం జరిగింది. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారన్న నినాదంతో, తెలుగు దేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు తారకరామారావు గారు. ఇది మరెవరికీ సాధ్యం కాని చరిత్ర...! ఒక్క నందమూరి తారక రాముడికి మాత్రమే సాధ్యమైన చరిత్ర. అధికారంలోకి రాగానే పేదలకు కేవలం రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు. స్త్రీలకు ఆస్తిలో పురుషులతో పాటూ సమానంగా హక్కు కల్పించారు.మద్యానికి బానిసలైన పురుషుల వల్ల తెలుగింటి ఆడపడుచులు బాధ పడుతున్నారని తెలిసి, సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. తెలుగు ప్రజలకు ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఆయన చిత్తశుద్ధితో అమలుపరిచారు...! ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించినా, తన అసామాన్యమైన పట్టుదలతో, కృషితో, దీక్షతో చలనచిత్ర రంగంలో ఎదురులేని కథానాయకుడిగా, ప్రజాసంక్షేమం కోరే ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఆచంద్రతారార్కం నిలిచే ఉంటాయి. తెలుగువారికి ఆయన గుర్తుకొచ్చినప్పుడల్లా ఛాతీ నాలుగంగుళాలు విస్తీర్ణం పెరుగుతుంది. ఆ మహామహుని, ఆ మహనీయుని 89 వ జయంతి సందర్భంగా తెలుగువన్ ఆయనకు సమర్పిస్తున్న నివాళి...!
May 28, 2012 2:55PM
2012 లో రానున్న పెద్ద సినిమాలు
2012 లో రానున్న పెద్ద సినిమాలు ఏమిటంటే చాలానే ఉన్నాయి. రానున్న సంక్రాంతి రేస్ లో దాదాపు ఆరు సినిమాలున్నాయని ఇప్పటి వరకూ అనుకున్నాం. వివరాల్లోకి వెళితే యువరత్న నందమూరి బాలకృష్ణ "అధినాయకుడు", విక్టరీ వెంకటేష్ "బాడీగార్డ్", ప్రిన్స్ మహేష్ బాబు "బిజినెస్ మ్యాన్", రవితేజ "నిప్పు", సునీల్ "పూలరంగడు", యువ రాకింగ్ స్టార్ ఆది "లవ్ లీ" సినిమాలు రేపు రాబోయే సంక్రాంతి పండుగకు విడుదలవుతాయని వినపడింది. కానీ వీటిలో "బాడీ గార్డ్, బిజినెస్ మ్యాన్, పూలరంగడు" మాత్రమే సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. " అధినాయకుడు, నిప్పు , లవ్ లీ" సినిమాలు ఫిబ్రవరికి వాయిదాపడ్డాయి. ఇవికాక ఇంకా రాబోయే పెద్ద సినిమాలు ఏమిటంటే కింగ్ అక్కినేని నాగార్జున "డమరుకం", పవర్ స్టార్ "గబ్బర్ సింగ్", యంగ్ టైగర్ యన్.టి.ఆర్. "దమ్ము", యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ "రెబెల్", మెగాపవర్ స్టార్ "రచ్చ", యువసామ్రాట్ "ఆటోనగర్ సూర్య" స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "హనీ" మార్చ్, ఏప్రెల్ నెలల్లో విడుదలకు సిద్ధమవుతున్నాయి. యువ హీరోలు యన్.టి.ఆర్., రామ్ చరణ్, వరస సినిమాలు చేస్తున్నారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో యన్.టి.ఆర్. హీరోగా నటించే సినిమా కూడా ఈ సంవత్సరంలోనే విడుదలవుతుంది. అలాగే రామ్ చరణ్ కూడా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఒకటి, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో "ఎవడు" చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా ఈ సంవత్సరంలోనే విడుదలవుతాయి. సో 2012 లో అందరు పెద్ద హీరోలూ బిజీ బిజీగా సినిమాల్లో నటిస్తూంటే మన సినీ పరిశ్రమ కళకళలాడుతుందనటంలో సందేహం అక్కర్లేదు. అలాగే ప్రేక్షకులకు కూడా విందు భోజనం లాంటి సినిమాలు కనువిందుచేయనున్నాయి.
Jan 3, 2012 9:48AM
వివాదాల వర్మ
మన దేశంలో నూటికి తొంభై మంది ఎలాగోలా ఏదో ఒక ఉద్యోగం చూసుకునో, వ్యాపారం చేసుకునో జీవితంలో ఏదో ఒక విధంగా సెటిలవ్వాలనుకుంటారు. కానీ మిగిలిన పదిశాతం మందిలో ఎనిమిది శాతం మంది విపరీతంగా ధనం సంపాదించాలనుకుంటారు. ఇక మిగిలిన రెండు శాతం మంది కీర్తి కోసం ప్రాకులాడేవారుంటారు. వీళ్ళ కోవలోకి వచ్చే వ్యక్తి ప్రముఖ సినీ దర్శకులు రామ్ గోపాల వర్మ. ఈయన ఆలోచనా విధానం మొదటి నుంచీ విభిన్నంగానే ఉంటూ వచ్చింది. ఈ మధ్య అది మరీ వివాదాలకు దారి తీసేలా తయారయ్యింది. ఉదాహరణకు వస్తే మొన్న ఆయన రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆయన తీసిన "రక్తచరిత్ర" సినిమా రెండు భాగాలు చాలా వివాదాలను రేకెత్తించాయి. పరిటాల రవి, మద్దెల చెరువు సూరిల మధ్య జరిగిన హత్యారాజకీయాల, వర్గ పోరాటాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీశారు వర్మ. అదొక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు" చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమ మీద విమర్శల వర్షం కురిపించారు వర్మ. ఈ చిత్రంలో ఏకంగ తెలుగు సినీ పరిశ్రమలోని చాలా మంది ప్రముఖ దర్శకులను ఘాటుగా ఒక పాటలో విమర్శించారాయన. అదృష్టవశాత్తూ అందరూ దానికి పెద్దగా స్పందించలేదు గాబట్టి అది సంచలనాన్ని సృష్టించలేకపోయింది. ఐదు రోజుల్లో సినిమా తీస్తానంటూ "దొంగల ముఠా" సినిమా తీశారు. అదీ ఆశించినంతగా సంచలనం సృష్టించలేదు. ప్రస్తుతం "బెజవాడ" అనే చిత్రం ఆయన ఆధ్వర్యంలో నిర్మించబడుతూంది. ఈ చిత్రం వల్లవిజయవాడలోని రెండు సామాజిక వర్గాల్లో అసహనం, అశాంతి నెలకొంది. కారణం ఈ రెండు సామాజిక వర్గాలకూ ఆధిపత్య పోరు జరిగింది. ఆ ఆధిపత్యపోరులో ఇరువర్గాల నుండీ అనేకమంది నాయకులూ, కార్యకర్తలూ హత్యలకు గురయ్యారు. ఈ చిత్రానికి ముందుగా "బెజవాడ రౌడీలు" అని ఆయన పెట్టిన పేరే వివాదాస్పదమయ్యింది. ముందు ఎవరేమనుకున్నా తాను ఆ చిత్రం పేరు మార్చనని వర్మ అన్నా, ఆ తర్వాత దాన్ని "బెజవాడ" గా మార్చటం జరిగింది. ఈ చిత్రం డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల కానుంది. ఇది సినిమాల తాలూకు వర్మ పరిస్థితి. ఇక తన ట్విట్టర్ లో వర్మ రాసే వ్యాఖ్యలు చూస్తే మరింత వివాదాస్పదంగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని తెలియజేస్తాను. "పుణ్యం చేసిన మగవారి కోసం స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక వంటి దేవ వేశ్యలుంటారని అంటారు. మరి అదే పుణ్యం చేసిన ఆడవారి కోసం అక్కడ ఎవరుంటారో" అని సందేహం వ్యక్తం చేశారు వర్మ. రజనీకాంత్ ఒక నిమిషం పాటు హీరోగా నటించిన "రావన్" చిత్రంలో షారూఖ్ ఖాన్ రెండు గంటల పాటు అతిథి పాత్రలో నటించాడు"అని షారూఖ్ ఖాన్ మీద సెటైర్ వేశారు వర్మ. ఇవన్నీ ఎందుకు చర్చించాల్సి వచ్చిందంటే రామ్ గోపాల వర్మ మనస్తత్వాన్ని, ఆలోచనా సరళిని తెలియజెప్పే ప్రయత్నం చేయటానికి. నిజానికి వర్మ దూషణ, భూషణ, తిరస్కారాల వంటి వాటికి అతీతుడని వర్మ అమ్మగారు "నా ఇష్టం" పుస్తకం ఆవిష్కరణ సభలో చెప్పారు. ఏది ఏమైనా సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువుగా నిలవటం వర్మ ముద్ర అనేది సుస్పష్టం. దయచేసి ఈ ఆర్టికల్ మీద మీ మీ అభిప్రాయాలను తెలియజెయ్యండి....!
Nov 28, 2011 11:31AM
తెలుగు పాటల పల్లకి శ్రీమతి యస్.జానకి
ఆ నటరాజు అనుగ్రహం, అలాగే వాగ్దేవి కరుణ మనపై ఉంటేనే కానీ మనలో కాళాకారులకు కావలసిన కనీస అర్హత ఉండదు. ఆ తర్వాత ఆ కళలో మనం రాణించాలన్నా కూడా వారి అనుగ్రహం ఉండితీరాలి. లేకపోతే ఏ వ్యక్తీ కళాకారులవ్వటం అసాధ్యం. కొంతమందికి కళాకారులవ్వటంలో ఆ భగవంతుడి కరుణాకటాక్ష వీక్షణాలు పరిపూర్ణంగా వారిపై ప్రసరిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో తెలుగింటి పాటల పల్లకి, తేనెలూరే గాత్ర మాధురి, ఆరు నుంచి అరవై యేళ్ళ వయసు వారి వరకూ భావాలను తన గాత్రంలో పలికించగలిగే నేర్పరి ప్రముఖ సినీ నేపథ్య గాయని శ్రీమతి యస్.జానకి. 1938లో ఏప్రెల్ 23 వ తేదీన, గుంటూరు జిల్లా, రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో జానకి జన్మించారు. పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుడి వద్ద సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. విధియిన్ విలయాట్టు అనే తమిళ చిత్రంలో టి.చలపతిరావు గారి సంగీత సారథ్యంలో ఎ.వి.యమ్.స్టుడియోలో ఆమె తొలి పాట పాడారు. 1956 "యమ్.యల్.ఎ." చిత్రంలో "నీ ఆశ అడియాశ" అనే పాటతో తెలుగు సినీ రంగంలోకి నేపథ్య గాయనిగా ప్రవేరశించారు యస్.జానకి. అప్పటి నుండి తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ, ఒరియా,సింహళి, తుళు, బెంగాలీ, సంస్కృతం, సౌరాష్ట్ర, కొంకణి, బడుగ, జపనీస్, జెర్మని వంటి మొత్తం 17 భాషల్లో శ్రీమతి యస్.జానకి గారు కొన్ని వేల పాటలు పాడారు. ఆమె గురించి ఇళయరాజా ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె దినామూ కొన్ని లీటర్ల తెనె తాగుతుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా"అని ఆమె గాత్ర మాధుర్యం గురించి చమత్కరించారు. ఆమె పాడిన పాటల గురించి చెప్పాలంటే ఏకంగా ఒక గ్రంధమే వ్రాయాలి. ఒకటా....? రెండా.....? కొన్ని వేల పాటల్లో ఆమె పాడిన కొన్ని పాటల గురించే చెప్పాలంటే ఎలా....? "మురిపించే మువ్వలు" చిత్రంలో "నీలీల పాడెద దేవా" పాట వింటే అద్భుతమైన నాదస్వరం కూడా భయపడే స్థాయిలో గమకాలను పలికించగల గాత్రం జానకి గారిదేనంటే అతిశయోక్తి కాదుకదా...?. "బావామరదళ్ళు" చిత్రంలో "నీలి మేఘాలలో గాలి కెరటాలలో" అనే పాట వింటే గాలిలో తేలిపోని మనసుంటుందా...? "పూజాఫలం" చిత్రంలోని "పగలే వెన్నెల జగమే ఊయల" పాట వింటూంటే పగలే వెన్నెల కనపడదా...? జగమే ఊయల కాదా....? "నర్తనశాల" చిత్రంలో "జననీ శివకామినీ" పాటలో ఆ శివకామి మనకు దర్శనమీయదా...? అదే చిత్రంలోని "ఓ నరవరా ఓ కురువరా" అనే పాట వింటే తన్మయంలో తేలని తనువుంటుందా...? "పదహారేళ్ళ వయసు" చిత్రంలో "సిరిమల్లె పూవా" పాటలోని కమ్మదనం, "పంట చేలో పాలకంకి నవ్విందీ" పాట చివర్లో ఓ డబ్భై యేళ్ళ ముసలమ్మ నవ్వినట్లు నవ్వటం జానకమ్మకు తప్ప వెరెవ్వరికి సాధ్యం. "సప్తపది" చిత్రంలోని "గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన" పాటలో పద్నాలుగేళ్ళ కుర్రాడికీ, నాలుగేళ్ళ పసిపాపడికీ కలిపి పాడిన జానకమ్మ గాత్రం శ్రోతలను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. అదే చిత్రంలో "నెమలికి నేర్పిన నడకలివే" పాటలో ఆమె గాత్రంలో పలికిన స్వర మాధుర్య గమకాలు మరవగలమా....? జంధ్యాల గారి "శ్రీవారికి ప్రేమ లేఖ" చిత్రంలోని "తొలి సారి మిమ్మల్ని చూసింది మొదలు" పాటలో కన్నె పడుచులోని కలల కమ్మదనాన్ని ఎంత మధురంగానో పలికించారు జానకమ్మ. "రాక్షసుడు" చిత్రంలో దేవులపల్లి వారు వ్రాసిన అద్భుత దేశభక్తి గీతం "జయ జయ జయ ప్రియభారత జనయిత్రి దివ్య ధాత్రి- జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి" అనే పాట వింటే మన దేశం మీద దేశభక్తి పొంగిపొర్లుతుంది. ఇక "ప్రతిఘటన" చిత్రంలో "ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో" అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ పాటలోని "మర్మం స్థానం కాదది నీ జన్మస్థానం మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం" పదాన్ని జానకమ్మ పలికిన తీరు విన్నవారెవరైనా స్త్రీని గౌరవించకుండా ఉండగలరా.....? ఇక్కడ అప్రస్తుతమైనా వేటూరి వారి కలం ఆ పాటను మనసున్న ప్రతి మనిషికీ ఆపాదమస్తకం కంపించేలా వ్రాయగా, జానకమ్మ అంత కంటే అద్భుతంగా ఆ బ్ఘావాన్ని తన గాత్రంలో పలికించారు. "సాగర సంగమం" చిత్రంలో "మౌనమేలనోయీ ఈ మరపురాని రేయి" పాటకానీ, "ఓం నమఃశివాయ చంద్ర కళాధర సహృదయా" అనే పాటలో జానకమ్మ గాత్రం మరింతగా తెలెలూరుతుంది. "ఓం నమఃశివాయ చంద్ర కళాధర సహృదయా" పాటకు ఒక ప్రత్యేకతుంది. అదేమిటంటే ఆ పాటలో నర్తించింది మరొక చక్కని ప్రముఖ సినీ నేపథ్య గాయని శ్రీమతి శైలజ. "జ్యోతి" చిత్రంలోని "సిరిమల్లెపూవల్లె నవ్వు- చిన్నారి పాపల్లె నవ్వూ" అనే పాటలో ఆమె స్వరంలో నవ్వటం అంటే ఏమిటో ఆ పాటలో పలికిస్తుంది మహా గాయని శ్రీ మతి యస్.జానకి. ఇక్కడ ఇళయరాజా, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇద్దరి గురించి ఒక మాట చెప్పాలి. ఇళయరాజా, యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జానకమ్మల కాంబినేషన్ లో వచ్చిన పాటలు శ్రోతలను విపరీతంగా ఆకర్షించాయి, ఆనందడోలికల్లో తెలేలా చేశాయి. జానకమ్మ గురించి బాలు స్వయంగా ఎ.వి.యమ్.స్టుడియో తన సన్నిహితుల వద్ద అన్నమాట ఇది "జానకి గారి గురించి ఏం చెపుతామయ్యా....ఆవిడ గాత్రం స్వరం మీద నవ్వుతుంది...స్వరం మీద ఏడుస్తుంది....స్వరం మీద నాట్యం చేస్తుంది. ఆవిడ గాత్రంగురించీ, ఆ గాత్రం లోని మధురిమ గురించి పొగిడేందుకు వేయి పడగలున్నఆ ఆదిశేషుడి తరం కూడా కాదయ్యా" అని అన్నారు. ఇంతకంటే అవార్డు ఇంకేం కావాలండీ. ఇంతకంటే రివార్డులేముంటాయి. అటువంటి జానకమ్మ నాలుగుసార్లు జాతీయ ఉత్తమ గాయనిగా ఎన్నికయ్యారు. ఇక తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన "కళైమామణి" అవార్డులవంటివి అనేకం జానకమ్మను వరించి ధన్యత చెందాయి. అయితే చాలా బాధాకరమైన సంగతి ఏమిటంటే ఈ రోజుల్లో అర్హతలేని చాలా మంది వెధవలకు "పద్మశ్రీ" అవార్డులనిచ్చే మన భారత ప్రభుత్వం అద్భుతమైన గాయని, భారత దేశం యావత్తూ గర్వించదగిన, విశేష ప్రతిభ కలిగిన మధుర గాయని యస్.జానకి గారికి మాత్రం "పద్మశ్రీ" బిరుదు ఇంకా ఇవ్వలేదు. ఇవ్వకపోవటమే మంచిది. అనవసరంగా ఆ బిరుదిచ్చి అడ్డమైన వెధవల సరసకు ఆమె పేరుని కూడా చేర్చి జానకమ్మను అవమానించటమే అవుతుంది. అందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అపురూపమైన స్వర నర్తకి జానకమ్మ జన్మదినం సందర్భంగా ఆమె కలకాలం ఇలాగే తన గాత్ర మాధుర్యాన్ని తెలుగు శ్రోతలకు అందించాలని ఆశిస్తూ తెలుగు వన్ ఆమెకివే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
Apr 23, 2011 3:35PM.jpg)
సమ్మర్ హీరో ఎవరు....?
మన తెలుగు సినీ పరిశ్రమకు సీజన్ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ నుండి మొదలవుతుంది. సంక్రాంతి బరిలో మామూలుగా పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతాయి. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ అయిపోయిమది కనుక వేసవి శలవుల సీజన్ లో మళ్ళీ సినీ పరిశ్రమ కన్నేస్తుంది. ఈ వేసవి శలవుల్లో తెలుగు ప్రేక్షకులకు సినీ పరిశ్రమ బంపర్ ఆఫర్లనే ఇస్తూంది. పెద్ద హీరోల సినిమాలు విడుదలకు బాగానే రంగం సిద్ధమవుతోంది. యంగ్ టైగర్ యన్ టి ఆర్ తన "శక్తి" చిత్రంతో ఈ బంపర్ ఆఫర్ మొట్టమొదట మొదలెడుతున్నాడు. ఇలియానా హీరోయిన్ గా, సోనూ సూద్, జాకీ ష్రాఫ్, ఒకప్పుడు "కామసూత్ర" యాడ్ లో నటించిన డేరింగ్ సెక్సీ లేడీ పూజా బేడీ, అందాల మంజరి ఫడ్నిస్ తదితరులు నటించగా, మణిశర్మ సంగీతం అందించగా, మెహేర్ రమేష్ దర్శకత్వంలో, 45 కోట్ల ఖర్చుతో, 300 మంది యూనిట్ సభ్యులతో, 18 నెలల పాటు అత్యంత భారీగా, శక్తి పీఠాల నేపథ్యంలో జరిగే కథతో, మెగా నిర్మాత అశ్వనీదత్ ఈ "శక్తి" చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఏప్రెల్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఏప్రెల్ 21 వ తేదీన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, దశరథ్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మిస్తున్న "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం విడుదల కానుంది. దీనికి 20 కోట్ల బడ్జెట్ అని వినపడుతోంది. హీరో ప్రభాస్ తొలిసారి ఒక రొమాంటిక్ హీరోగా, ఒక డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం ఒక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. "మిస్టర్ పర్ ఫెక్ట్" చిత్రం విడుదల కాగానే ఏప్రెల్ 29 వ తేదీన రెండు కుర్ర హీరోల చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ఒకటి నాగచైతన్య హీరోగా, తమన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, గీతా ఆర్ట్స్ పతాకంపై, యువ నిర్మాత బన్నీ వాసు నిర్మిస్తున్న "100%లవ్" చిత్రం కాగా, మరొకటి రానా హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పురీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు శ్రీనివాస్ నిర్మిస్తున్న "నేను - నా రాక్షసి" చిత్రం మరొకటి. ఈ రెండు విడుదల కాగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "తీన్ మార్" చిత్రం ఏప్రెల్ చివరి వారంలో విడుదలవుతుంది. ఈ చిత్రం బాలీవుడ్ లో సుపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్'' అనే చిత్రానికి తెలుగు రీమేక్ గా వస్తోంది. ఈ చిత్రంలో త్రిష, కృతి కర్బంద హీరోయిన్లుగా నటిస్తూండగా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహిస్తుండగా, గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తూండగా, వి.వి.వినాయక్ దర్శకత్వంలో 40 కోట్ల భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ పతాకంపై, అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం "బద్రీనాథ్". ఈ చిత్రంలో అమదాల తార మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి చిన్ని కృష్ణ అద్భుతమైన కథనందించగా, అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఇండియన్ సమురాయ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే నెల 19 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు నిర్మాత అల్లు అరవింద్. శాన్వి ప్రొడక్షన్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, కాజల్ అగర్వాల్, తాప్సి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో, గణేష్ ఇంటూరి నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం "వీర". ఈ చిత్రం కూడా మే నెలలోనే విడుదలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత సమ్మర్ స్పెషల్ చిత్రంగా యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా త్రిపాత్రాభినయం చేస్తున్న "అధినాయకుడు" ( ఈ పేరు ఇంకా కన్ ఫర్మ్ చేయలేదు) చిత్రం జూన్ 10 వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో సలోనీ, మంజరి ఫడ్నీస్, పాయల్ ఘోష్, స్నేహ హీరోయిన్లుగా నటిస్తున్నారట. పరుచూరి మురళీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యమ్.యల్.కుమార్ చౌదరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మరి ఇంతమంది హీరోల ఇన్ని చిత్రాలు విడుదలవుతుండగా వీటిలో ఏ హీరో నటించిన చిత్రం హిట్టవుతుందో, ఏ హీరో నటించిన చిత్రం ఫట్టవుతుందో, ఈ సమ్మర్ హీరో ఎవరవుతారో, ఎంతమంది హీరోలవుతారో.... ఎంతమంది జీరోలవుతారో రానున్న వేసవికాలం చెపుతుంది.
Mar 26, 2011 4:57PM
బాపు ప్రాణం అయితే ముళ్ళపూడి ఆత్మ
"స్నేహమేరా జీవితం-స్నేహమేరా శాశ్వతం" అన్నాడో కవి.తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్ళతో,బంధువులతో చెప్పుకోలేని అనేక విషయాలు దాపరికం లేకుండా ఒక్క స్నేహితుడితోనే చెప్పుకోగలం.ఈ విషయాన్ని ఎవరైనా కాదనగలరా...?అలాంటి స్నేహాన్ని అందించే సరైన స్నేహితుడు ఒక్కడు దొరికితే ఆ మనిషి జన్మధన్యం.స్నేహం విలువ తెలిసిన వారి స్నేహం కలకాలం నిలిచి ఉంటుందనటంలో సందేహం లేదు.స్నేహానికి ఆస్తులు,అంతస్తులు ఏనాడూ అడ్డంకిగా నిలబడలేవు.అందుకు ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ,కుచేలుర స్నేహమే నిదర్శనం.ఇలాంటి అపూర్వ స్నేహితులు మనకాలంలోనూ ఉన్నారు.వారు మరెవరో కాదు.బాపు-రమణలే. వీళ్ళిద్దరినీ ఈ మిల్లీనియం స్నేహితులని ఘంటాపదంగా చెప్పవచ్చు. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, ఆనందంలోనూ, బాధల్లోనూ వీరు కలిసే ఉన్నారు.అంతేకాదు...తమ స్నేహాన్ని బంధుత్వంగా కూడా మార్చుకున్న అపూర్వ స్నేహితులు బాపు-రమణలు.అన్నట్టు బాపుగారి అసలు పేరు మీకు తెలుసా...?సత్తిరాజు లక్ష్మీనారాయణ బాపుగారి అసలు పేరు. ఆయన పశ్చిమ దావరి జిల్లాలోని నర్సాపురంలో జన్మించారు.1955లో ఆయన మద్రాసు యూనివర్సిటీ నుంచి,"లా"లో డిగ్రీ పూర్తిచేశారు.ఆయన మంచి పెయింటర్, కార్టూనిస్ట్ కావటంతో ఆయనకు "ఆంధ్రపత్రిక"లో ఉద్యోగం దొరికింది.అలాగే తన 14వ సంవత్సరంలోనే కథలు వ్రాయటం మొదలు పెట్టిన ముళ్ళపూడి వేంణకటరమణ "అమ్మమాట వినకపోతే"అన్న కథను వ్రాశారు.అసలింతకీ బాపు- రమణలు తొలిసారి ఎప్పుడు కలిశారంటే వాళ్ళిద్దరూ మద్రాలోని పి.యస్.హైస్కూల్ లో నాలుగవ తరగతి చదివేటప్పుడు1942 లో కలిశారు .సినీ రంగంలోకి ముందుగా రచయితగా ముళ్ళపూడి ప్రవేశించారు. 1962 లో ఆయన తొలిసారి "రక్తసంబంధం"అనే చిత్రానికి రచయితగా పనిచేశారు.ఆయన రచనల్లోని హాస్యం వల్ల ప్రసిద్ధి చెందిన ముళ్ళపూడివారు తొలిసారి ఒక అన్నాచెల్లి మధ్య సెంటిమెంట్ తో కూడిన సినిమాకి మాటలు వ్రాయటం విచిత్రం కదూ.ఆ తర్వాత ఆయన మూగమనసులు,దాగుడు మూతలు,ప్రేమించిచూడు,కన్నె మనసులు,నవరాత్రి, పూల రంగడు,ప్రాణమిత్రులు వంటి చిత్రాలకు మాటలు,కథలు వ్రాశారు. ఆ తర్వాత ముళ్ళపుడి వారికి బాపుగారి నిశిత దృష్టి మీద ఉన్న నమ్మకంతో "మనమే ఒక సినిమా ఎందుకు తీయకూడద"న్నతన ఆలోచనను బాపు గారికి చెప్పటంతో,1967లో "సాక్షి" చిత్రం మొదలయ్యింది.అది ఆశించినంతగా ఆర్థిక విజయం సాధించకపోయినా బాపు-రమణలకు బోల్డంత పేరు తెచ్చిపెట్టింది.తర్వాత "బంగారు పిచ్చుక"అనే సినిమా తీశారు.అదికూడా జాటర్ ఢమాల్ అయ్యింది. 1969లో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుగారు ద్విపాత్రాభినయం చేయగా,బాపు దర్శకత్వంలో,ముళ్ళపూడి వేంకట రమణ నిర్మాతగా"బుద్ధిమంతుడు"అనే చిత్రాన్ని తీశారు.దీన్నిఒక క్లాసిక్ చిత్రంగా ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు.ఆ చిత్రం ఘనవిజయం సాధించటంతో బాపు-రమణల పేర్లు ఆంధ్రప్రదేశ్ లో మారుమ్రోగిపోయాయి. ఆ తర్వాత ఇంటిగౌరవం,బాలరాజుకథ వంటి చిత్రాలను తీశారు. అప్పుడే బాపు-రమణలు ఒక సాహసం చేశారు. అదేమటంటే "సంపూర్ణరామాయణం"అనే పౌరాణిక చిత్రాన్ని తీశారు.అప్పటి వరకూ రాముడన్నా,కృష్ణుడన్నా అందరికీ గుర్తొచ్చే పేరు నటరత్న యన్ టి ఆర్.ఆయన్ని కాదని శోభన్ బాబుని శ్రీరాముడిగా నటింపజేశారా చిత్రంలో.మొదట్లో ఎవరూ పట్టించుకోని ఆ చిత్రం కలెక్షన్లలో ఒక సునామీనే సృష్టించింది.ఆ చిత్రంలో రావణాసురుడిగా యస్.వి.రంగా రావు గారి నటన ఆకాశాన్నంటిందని చెప్పాలి. అలా అలా 1975 లో "ముత్యాల ముగ్గు"అనే అపూర్వమైన చిత్రాన్ని తీశారు.రావు గోపాలరావుగారికి ఆ చిత్రం విపరీతమైన పేరు తెచ్చిపెట్టింది.ఆ చిత్రంలోని డైలాగుల కోసం ఆడియో కేసెట్లు వేలాదిగా అమ్ముడు పోయాయి.ఆ తర్వాత కృష్ణంరాజు హీరోగా "భక్తకన్నప్ప","మనవూరి పాండవులు"అనే చిత్రాలను తీశారు."అందాలరాముడు","శ్రీ రామాంజనేయ యుద్ధం",రాధాకళ్యాణం,చిరంజీవి హీరోగా "మంత్రిగారి వియ్యంకుడు"అనే చిత్రాన్ని, 1991లో "పెళ్ళి పుస్తకం","మిస్టర్ పెళ్ళాం"చిత్రాలు బాపు-రమణలను మళ్ళీ వెలుగులోకి తెచ్చాయి."శ్రీనాథ కవిసార్వభౌముడు" చిత్రానికి పనిచేయవలసిందిగా యన్ టి ఆర్ స్వయంగా బాపు-రమణలను అడిగారట."సీతా కళ్యాణం"అనే చిత్రం అంతర్జాతీయ స్థాయిలో వారికి గుర్తింపు తెచ్చింది.అలాంటి అద్భుతమైన చిత్రాలను మనకందించిన ఘనులు బాపు-రమణల స్నేహానికి 60 వసంతాలు పూర్తయ్యాయి. ఆదర్శప్రాయులైన స్నేహితులు బాపు-రమణలను "మిలీనియం ఫ్రెండ్స్"గా తెలుగువన్ భావిస్తుంది. అటువంటి ప్రాణ స్నేహితుల్లో ప్రాణం బాపు అయితే ఆత్మ ముళ్ళపూడి వారు. ఫిబ్రవరి 23 వ తేదీన చెన్నైలోని వారి స్వగృహంలో ముళ్ళపూడి వారు దివి కవిసమ్మేళన ఆహ్వానానికి స్పందించి, తన ప్రాణాన్ని ఇక్కడ భువిలోనే వదిలేసి ఒంటరిగా స్వర్గానికి వెళ్ళటం జరిగింది.ముళ్ళపూడి వారు ఆయనకేం మహానుభావుడు ఎంచక్కా 80 వసంతాలు కవితా సేద్యం చేసి,పై లోకాల్లోనూ సాహిత్య సేద్యం చేయటానికి, ఆ సేద్యంలోని కొత్త మెళుకువలు వారికి తెలియ చెప్పటానికి, మనల్ని దుఃఖసాగరంలో ముంచి సంతోషంగా తరలిపోయారు.కానీ తెలుగు సినీ పరిశ్రమకు ఆయన లేని లోటు ఎవరూ తీరుస్తారు...? మరో బుడుగు వచ్చి తన "శీ గాన పసూనాంబ"తో ముచ్చట్లను చెప్పేలా ఎవరు వ్రాస్తారు. మరో "జనతా ఎక్స్ ప్రెస్"లో సామాన్యుడి సాధక బాధకాలను సునిశిత హాస్యంతో మనకు ఇంకెవరు చెపుతారు. ఆయన "కోతికొమ్మచ్చి"ని వేరెవరు వ్రాయగలరు....? అది ఒక్క ముళ్ళపూడి వారికే సాధ్యం కదా...! ఆయన ఘన నిర్యాణం మనకన్నా ఆయన ప్రాణం బాపు గారికి మరింత తీరని లోటు. తెలుగువన్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతిని ప్రార్థిస్తూంది.
Feb 23, 2011 9:38PM
మార్చి 4న చిరు నివాసంలో అల్లువారి పెళ్ళిసందడి
యువహీరో అల్లు అర్జున్ వివాహం స్నేహారేడ్డితో మార్చి ఆరో తారీఖున జరగనుంది, ఈ పెళ్ళికి టాలీవుడ్, బాలీవుడ్, కొలీవుడ్ సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మార్చి 4వ తారీఖున అల్లు అర్జున్ ను పెళ్ళికొడుకును చేయనున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కుటుంబం అందరూ అల్లు అర్జున్ ను “వరుడు”గా తీర్చిదిద్దడంలో బిజీగా ఉన్నారు. ఈ ఫంక్షన్ కి టాలీఫుడ్ సినీ తారలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పెళ్ళి మాత్రం మార్చి 6వ తారీఖు రాత్రి 10.33 నిముషాలకు హైదరాబాద్ లోని హైటెక్స్ జరగనుంది. ఇప్పటికే అల్లు అర్జున్ శుభలేఖలు బంధుమిత్రులు అందకున్నారు. ఇక ఈ వివాహానికి బాలీవుడ్ నుంచి అమీర్‌ఖాన్ కూడా రానున్నారు. అమీర్‌తో అల్లు అరవింద్ గజని చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఈ గజినితో అరవింద్ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. అందుకే అల్లు అర్జున్ వివాహానికి అమీర్‌ఖాన్ ఎంతో ఇష్టంగా రానున్నాడని సమాచారం. ఒకపక్క అల్లుఅర్జున్ వివాహానికి సమయం ఆసన్నమవ్వడంతో పాటు మరోపక్క అల్లు అర్జున్ నటించిన చిత్రం బద్రినాథ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రమోషన్ అల్లు అర్జున్ వివాహం తరువాత మొదలవుతుందని సమాచారం. వరుడిగా “వరుడు’’ చిత్రంలో నటించిన అల్లు అర్జున్ నిజీవితంలో వరుడిగా మారుతుంటే చూడాలని, వరుడు చిత్రంలో ఐదు రోజుల పెళ్ళి వేడుకలు నిజజీవితంలో కూడా జరుగుతాయా అని చాలా మంది అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Feb 23, 2011 12:59PM.jpg)
నట సార్వభౌముడు యస్.వి.రంగారావు
ఇది సామాన్యమైన బిరుదు కాదు. దీన్ని పొందాలంటే నటనలో ఆద్యంతాలు తెలియాలి, నటనలో ఎంతో అనుభవం, ఆ అనుభవాన్ని సద్వినియోగం చేయగల సత్తా ఆ నటుడికి ఉండాలి. అయినా నటన అనేది పుట్టుకతో రావాలి. ఒక్క నటననేంటి ఏ కళ అయినా పుట్టుకతోనే రావాలి. లేకపోతే ఎవరైనా కళాకారుడిగా రాణించటం కష్టమే కాదు దాదాపు అసాధ్యం. అలాంటి వ్యక్తులు ఒకవేళ కళాకారులవ్వాలని ప్రయత్నించినా వారు ఎంత మాత్రం సఫలీకృతులు కాలేరు. ఉదాహరణకు తాళ జ్ఞానం లేని వ్యక్తికీ ఎంత పెద్ద కళాకారుడితో మృదంగం నేర్పించినా, ఎన్ని సంవత్సరాలు నేర్పించినా అతనికా విద్య ఒంటబట్టదు. స్వర, రాగ జ్ఞానంలేని వారికి ఎన్ని నాళ్ళు సంగీతం నేర్పించినా అది వారికి పట్టదు. ఇది అందరికీ తెలిసిందే. అందుకే కళ భగవద్దత్తమని పెద్దలు చెపుతుంటారు ... ఆ నటరాజు అనుగ్రహం లేకపోతే ఏ కళలోనైనా రాణించటం కష్టం. అలాంటి కళల్లో నటన చాలా గొప్పది. దీనిలో ఎదుటి మనిషిని ఆకట్టుకునే గొప్పదనం ఉంది ... నటిస్తున్న నటుడి అన్ని భావాలనూ ప్రేక్సకుడు అనుభవిస్తాడు ... అలా అనుభవించేలా చెయ్యగలిగితే ఆ నటుడు నటనలో పరిణితి సాధించినట్లే. అలాంటి మహా నటులు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బహు కొద్దిమందే ఉన్నారు. దేశ, విదేశాల్లో తమ కీర్తి పతాకాన్ని ఎగురవేసిన ఘనుల్లో అగ్రగణ్యుల సరసన నటనా సార్వభౌమ శ్రీ యస్.వి. రంగారావు. చిత్ర రంగానికి హీరోగా వచ్చినా విలన్ గా, కేరెక్టర్ ఆర్టిస్టుగా ఆయన చేసిన నటన హిమాలయాలకంటే ఎత్తయింది. మహాసముద్రం కంటే గంభీరమైంది. వెన్నకన్నా, పూవుకన్నా, లేచిపురుకన్నా సున్నితమైంది, కరవాలం కన్నా పదునైంది, కోడెత్రాచుకన్నా చురుకైనది. ఆయన నటన గురించీ, ఆయనలోని కళాకారుడి గురించీ ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి, ఆ పాత్ర మాత్రమే కనపడేలా నటించటం ఆయన సొత్తు. నటుడు నీరులా ఉండాలి. ఎందుకంటే నీరు ఎలాగైతే ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారాన్ని ఎలా పొందుతుందో నటుడు కూడా అలాగే ఏ పాత్ర పోషిస్తే ఆ పాత్రలో మమేకమై తానుగా కాక ఆ పాత్రగా కనిపించాలి. అప్పుడే ఆ కళాకారుడి నటనకు పరిపూర్ణత, ఆ కళకు రససిద్దీ కలుగుతాయి. ఇది ఓ నటుడిగా, శ్రీ యస్.వి.రంగారావుగారి అభిప్రాయం. ఒక మనిషి యొక్క స్థాయి అతని ఆలోచనల్లో, అభిప్రాయాల్లో ప్రతిఫలిస్తుందనటానికి ఆయనే నిలువెత్తు తార్కాణం. ఆయనకు నటనపరంగా ఇలాంటి ఉన్నతమైన అభిప్రాయాలున్నాయ కాబట్టే ఆయన నటన ప్రేక్షకులను సమ్మోహపరిచేది ... S.V. Ranga Rao acted movies పాతాళ భైరవి నేపాళ మాంత్రికుడు మాయా బజార్ ఘటోత్కచుడు భక్త ప్రహ్లాద హిరణ్య కశిపుడు గుండమ్మ కథ బాధ్యతా తెలిసిన పెద్దమనిషి పాపకోసం గ్రుడ్డివాడు పండంటి కాపురం పెద్దన్న పాండవ వనవాసం సుయోధన చక్రవర్తి భూ కైలాస్ మైరావణ దీపావళి నరకాసురుడు సంపూర్ణ రామాయణం రావన్ బ్రహ్మ యశోద కృష్ణ కంసుడు దసరా బుల్లోడు గయ్యాళి భార్యకు భయపడే భర్త సతీ సక్కుబాయి అమాయక భర్త సారంగధర సారంగాధరుడి తండ్రి బాల భారతం భీష్ముడు బాల నాగమ్మ మాయల ఫకీరు మిస్సమ్మ మతిమరుపు మనిషి అందరూ దొంగలే దొంగ, అమ్మాయిల పిచ్చోడు దేవుడు చేసిన మనుషులు కొడుకుని పోగొట్టుకున్న తండ్రి బంగారు బాబు పేద తండ్రి ఇలా ఒకటా ...? రెండా ...? ఎన్ని పాత్రల గురించి చెప్పగలం ...? ఆయన నటించిన ప్రతి పాత్రకూ ఓ గుర్తింపు లభించేది ... దానికి కారణం ఆయన వాటిని మలచిన తీరే. “పాతాళ భైరవి’’ చిత్రంలో ఆయన పోషించిన నేపాళ మాంత్రికుడు పాత్రను విశ్లేషిస్తే ఎన్నో విషయాలు మనం గమనించవచ్చు. ఆ పాత్ర ఆహార్యం, భాష, మేనరిజమ్స్, ఇలా అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మామూలుగా రంగారావుగారు మంచి కండపుష్టి ఉన్న ఆరడుగుల ఆజానుబాహుడు. కానీ ఈ చిత్రంలో ఆయన ముఖంలో ఒకరరమైన మార్పుని తెచ్చారు. దానివల్ల ఆయన కొంచెం దవళ్ళు లోపలికి పోయినట్టుగా, ముఖం పీక్కుపోయినట్టుగా కనిపించే విధంగా మేకప్ చేశారు. గెడ్డం కూడా కొంచెం వెరైటీగా పెట్టారు. జుట్టు పొడవుగా మెడ మీద పడే విధంగా సహజంగా కనిపించే విగ్ పెట్టారు. ఇక కాస్ట్యూమ్స్ కొస్తే ఓ నల్లటి పొడవాటి లూజ్ గౌన్. ఇలాంటి ఆహార్యంతో ఆయన నిజమైన నేపాళ మాంత్రికుడిగా కనిపించారు. ఆయన తెలుగు ఎంత స్పష్టంగా ఉంటుందంటే ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే, ఎంత వేగంగా చెప్పినా సరే దాన్లోని ప్రతి అక్షరం క్రిస్టల్ క్లియర్ అంత స్పష్టంగా వినపడేది. వాచకం విషయంలో ఆయన చాలా మందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన డైలాగ్ చెప్పే విధానం చాలా ప్రత్యేకంగా ఉండేది ... డైలాగుల్లో హెచ్చు తగ్గులు, విరుపులు వాటితో పాటు చక్కని భావప్రకటన అంటే ఆ పాత్ర స్వభావం ఆ డైలాగ్ చెప్పే విధానంలో కనపడేది. దానికి తోడు ఆయనది ధవళ గాత్రం. చాలా గంభీరంగా ఉంటుంది. ఆ పాత్రకు ఓ ప్రత్యేకమైన యాస వాడారు ... “సాహసం సాయరా డింభకా’’. “జనం సెప్పేది మనం సాయవలెనా మనం సేసేది జనం సూడవలెనా ...?’’, “జాయ్ పాతాళ భైరవీ’’ వంటి డైలాగులను గమనిస్తే ఆ యాసను ఆయన్ను ఆయన ఎలా వాడారో మనకర్థమౌతుంది. ఆ యాస ఎంత ప్రత్యేకమైనదంటే ఆ తర్వాత తెలుగు చలన చిత్రాల్లోని ప్రతి మాంత్రికుడు అదే యాసను వాడారు. అలా డైలాగుల్లో తన శైలిని ఆ పాత్రలో చూపించారు. ఇక నటన విషయానికొస్తే ముఖంలో కాఠిన్యం, నాయవంచనం దుర్మార్గం, వెల్లివిరిసే క్రోధం లాంటి భావాలు చాలా చక్కగా వ్యక్తపరిచారు. తోట రాముడు అగ్నిగుండంలో దూకటానికి తటపటాయిస్తుంటే అతన్ని రెచ్చగొట్టి అందులోకి దూకించినప్పుడు. ఆ లోపలి తానూ తాడు సాయంతో దిగగానే అక్కడి పొగాకు తట్టుకోలేక చేయి అడ్డుపెట్టేటప్పుడు హావభావాలు అనితర సాధ్యం. ఇలా చెప్పుకుంటూ పొతే ఒక్క “పాతాళ భైరవి’’ చిత్రం గురించే ఎంతైనా చెప్పవచ్చు. ఇక “భక్తప్రహ్లాద’’ చిత్రంలో ఆయన నటన పరాకాష్టకు చేరింది. తన కొడుకే తన శత్రువుని పూజించటం నచ్చక, ఆ కొడుకుని వదులుకోలేక, కొడుకుని చంపినా, ఆ పిల్లవాడు చావకపోవటం అర్టంకాక ఆ హిరణ్యకశిపుడు పడే మానసిక సంఘర్షణ చాలా అద్భుతంగా చూపించారు రంగారావు గారు. ఆ చిత్రం మొదట్లో దేవతలా మీది వైరంతో యుద్ధానికి బయలుదేరబోతూ, శుక్రాచార్యుడు చెప్పిన మాట ప్రకారం తపస్సుకెళ్ళినప్పుడూ, తిరిగివచ్చిన తర్వాత దేవతలను గెల్చి వారిని గెలిచేతప్పుడు చూపిన నటన చలనచిత్ర చరిత్రలో నభూతో నభవిష్యతి. చివరి సీన్లో నరసింహస్వామి ప్రత్యక్షం కాగానే ఆయన చెప్పే డైలాగులూ, చూపిన నటన గురించి ఎంతని చెప్పగలం, ఏమని చెప్పగలం. ఇలాంటి పాత్ర పోషణలో ఆయనది అందెవేసిన చెయ్యి. ఆయన బాడీ లాంగ్వేజీ కూడా చాలా విభిన్నంగా ఉంటుంది. నడకలో, మాటలో, ముఖంలో ఓ విధమైన నిర్లక్ష్యం, అహంకారం, ఓ రకమైన ధీమా మనల్ని ఆ పాత్ర ఇలాగే ఉంటుంది అనిపించేలా సమ్మోహనపరిచేవి. “పాండవ వనవాసం’’ చిత్రంలో దుర్యోధనుడుగా ఆయన నటన నాకు స్ఫూర్తిగా నిలిచిందని మహా నటుడు కీర్తి శేషులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు అన్నారంటే ఆ పాత్రలో రంగారావు గారు ఎంత బాగా నటించారో చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో జూదం సీన్లో పాండవులు తమ సర్వస్వం కోల్పోగా రారాజు ద్రౌపదికి తన ఊరువును చరుస్తూ సైగ చేసే సీన్లో యన్.టీ.ఆర్. తో డీ అంటే డీ అని నటించారు రంగారావు గారు. “ఛీ ... బానిస ... బానిసలకింత అహంభావమా ...?’’ ఈ ఒక్క డైలాగ్ తో రామారావు గారిని ఆ సీన్లో ఆయన డామినేట్ చేశారు .... ఈ విషయం ఆ చిత్రం చూసిన వారెవరికైనా గుర్తుండే వుంటుంది. ఆ సిను ఇద్దరు మహానటులతో 11 టేక్ లు, అదీ పౌరాణికాల మీద మంచి పట్టున్న దర్శకులు కీర్తి శేషులు శ్రీ కమలాకర కామేశ్వర రావుగారు తీశారంటే మనం అర్థంచేసుకోవచ్చు. ఆ సీన్ పవర్ ఏంటో ... ఇద్దరూ కూడా సింగిల్ టేక్ ఆర్టిస్టులే మరి. రంగారావు గారి నటనకు మరో ఎస్సెట్ మాధవపెద్ది వారి గాత్రం. ఆయన రంగారావు గారికి పాడటానికే పుట్టారా అన్నంత సహజంగా రంగారావు గారికి సరిపోయేది ... రంగారావుగారి నటనకు మాధవపెద్ది పద్యం తోడైతే ఇక చెప్పేదేముంది. బంగారానికి తావి అబ్బినట్లే .... అదో అమోఘమైన కాంబినేషన్. పౌరాణిక చిత్రాల్లో రంగారావు గారి నటనకూ, జానపద చిత్రాల్లో, సాంఘిక, చారిత్రాత్మక చిత్రాల్లోని ఆయన నటనకూ తేడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అసలు ఒక పాత్రకూ మరో పాత్రకూ ఏ మాత్రం పోలిక లేకుండా ఏ పాత్రకాపాత్రే ప్రత్యేకంగా కనపడేలా నటించటం ఆయన ప్రత్యేకత. “జగత్ కిలాడీలు’’ చిత్రంలో ఆయన చెప్పిన డైలాగులు ఆ రోజుల్లో జనం నోళ్ళలో పలికాయంటే ఆయన ఆ డైలాగుల్ని చెప్పిన స్టైల్ అలాంటిది. “పులి అడవిలో ఉన్నా బోనులో ఉన్నా పులి పులేరా ఘూట్లే’’, “డోంగ్రే’’ ఇలాంటి డైలాగులు జనబాహుళ్యంలో చాలా రోజులు ప్రచారంలో ఉన్నాయి. ఆ పదాల ప్రయోగం ఓ విచిత్రం ఐతే వాటిని రంగారావు గారు చెప్పిన శైలి ఇంకా ప్రత్యేకంగా ఉండటం వల్లే వాటికంత ప్రజాదరణ లభించింది. ఒక్క డైలాగ్ మాడ్యులేషన్ మాత్రమె కాదు, ఆ మాటలకు తగ్గ బాడీ లాంగ్వేజ్, హావభావా ప్రకటన ఇవన్నీ కూడా ఆ పాత్రలను ప్రభావితం చేశాయనటంలో సందేహం లేదు. “పండంటి కాపురం’’ చిత్రంలో ఆయన తమ్ముళ్ళ కోసం తపన పడే ఓ అన్నగా ఆయన చేసిన నటన ప్రక్షకుల్లో చెరగని ముద్రవేసిందంటే అతిశయోక్తి కాదు. ఆ చిత్రంలో ముఖ్యంగా తమ్ముడి కొడుకు చనిపోయినప్పుడు ఆ పిల్లవాడిని మట్టిచేస్తూ ఆయన చెప్పిన డైలాగులు చూసిన ప్రతి ప్రేక్షకుడినీ కంటినీరు పెట్టించాయి. “మిస్సమ్మ’’ చిత్రంలోని ఆయన పాత్ర మతిమరుపు పెద్దమనిషి. ఉత్తరీయం భుజం మీదే ఉన్నా దానికోసం వెతికే పాత్ర. ఆయనకు జోడీగా ఋష్యేంద్రమణి నటించారు. వీరి మధ్య నడిచే హాస్యం ఎంత హృద్యంగా ఉంటుందో ఆ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. అసలు ఆ చిత్రంలో నటించిన వారంతా మహానటులూ, మహానటీమణులు ... సాంఘిక చిత్రాల్లో అదొక మైలురాయిగా నిలిచిపోతుంది. ఏ.యన్.ఆర్. , యన్.టి.ఆర్.. యస్.వి.ఆర్., సావిత్రి, జమున, రేలంగి, అల్లురామలింగయ్య, రమణారెడ్డి, ఇలా ఆ చిత్రంలో హేమాహేమీలంతా పోటీపడి హాస్యాన్ని పండించారు. ఆ చిత్ర దర్శకులు కీర్తిశేషులు శ్రీ అక్కినేని, లక్ష్మీ వర ప్రసాదు (యల్.వి.ప్రసాద్) గారిని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవటం మా కనీస ధర్మం. ఇక మరో చక్కని చిత్రం “గుండమ్మ కథ’’. దీన్లో రంగారావుగారి నటన చాలా హుందాగా సాగుతుంది. యన్.టి.ఆర్., ఏ.యన్.ఆర్. ఇద్దరూ ఆయనకు కొడుకులుగా ఈ చిత్రంలో నటించారు. “దసరా బుల్లోడు’’ ఈ చిత్రం ఆ రోజుల్లో ఓ సంచలనమే సృష్టించింది. దీన్లో రంగారావుగారు తన గయ్యాళి భార్య నోటికి భయపడే భర్త పాత్రను పోషించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర పడే మానసిక సంఘర్షణ మనల్ని ఆకట్టుకుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే “మాయాబజార్’’ చిత్రంలోని ఘటోత్కచుని పాత్ర ఒక ఎత్తు. ఆ పాత్ర పోషణ ఎవరికైనా కత్తిమీద సామే కావచ్చు. కానీ రంగారావు గారి లాంటి మహా నటునికి ఇది నల్లేరు మీద నడకే. పింగళి నాగేంద్రం గారిలాంటి మహాకవి రాసిన డైలాగుల్ని అంతకంటే అద్భుతంగా చెప్పి మెప్పించిన ఘనత మాత్రం యస్.వి.ఆర్. కె చెందుతుంది. ఆ పాత్ర ఓ రాక్షసుడి పాత్ర. దానిని పాజిటివ్ గా మలచి ఇంచుమించు ఆ చిత్రానికి ఆ పాత్రే హీరో అనిపించేలా ఆ పాత్రలో నటించారాయన. ఆ చిత్రంలోని “వివాహ భోజనంబు వింతైన వంటకంబు’’ పాట లేకుండా ఆ రోజుల్లో దాదాపు ఏ పెళ్ళీ జరిగేది కాదంటే అతిశయోక్తి కాదు. ఆ పాట సీన్లో ఆప్టికల్ వర్క్ తోనే అద్భుతాలు చేశారు. ఆయన శరీరం పెంచి పీటమీద కూర్చోగానే లడ్దూలన్నీ వాటంతట అవే ఆయన నోట్లోకి వెళ్ళటం, ఒక్క లడ్డూలేమిటి అన్ని ఆహార పదార్ధాలూ అలానే ఆయన నోట్లోకి వెళ్ళటం, ఇవన్నీ ఏ గ్రాఫిక్స్ లేకపోయినా, సాంకేతికంగా ఇప్పుడున్నంత అభివృద్ధి లేకపోయినా ఏంటో సహజంగా వాటిని చిత్రీకరించిన తీరు శతధా ప్రశంసనీయం. ఆ చిత్రంలోనే కృష్ణుణ్ణి కలవటానికి వచ్చిన ఘటోత్కచుడు కొంచెం అహంకరించి, కృష్ణుని చేతిలో భంగాపడే సీన్లో కూడా ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక్కడ ఆయనతో పాటు పోటా పోటీగా నటించిన ఒక మహానటీమణి గురించి కూడా మనం గుర్తుచేసుకోవాలి. ఎందుకంటే ఘటోత్కచుడు అప్పుడప్పుడూ శశిరేఖగానూ, శశిరేఖ ఘటోత్కచునిగానూ కనపడతారు. ఈ సన్నివేశాల్లో మహానటి సావిత్రి, యస్.వి.ఆర్.ల మధ్య నటన పరంగా ఉన్న అవగాహన ఎంత గొప్పగా ఉంటుందో మనం ఆ పాత్రలను చూసి ఆనందించాలే తప్ప వాటి గురించి వివరించటం అంత సులభం కాదు. చివరి సీన్లో కౌరవులనందర్నీ ఏడిపించేటప్పుడు ఆయన నటన చాలా గొప్పగా ఉంటుంది. క్రియేటివ్ డైరెక్టర్ దిగ్రేట్ “బాపు’’ గారి దర్శకత్వంలో వచ్చిన అద్భుత పౌరాణిక చిత్రం “సంపూర్ణ రామాయణం’’ లో రంగారావు గారు తన నట విశ్వరూపాన్ని చూపారు. ఇందులో రామ, రావణ యుద్ధ సమయంలో తన వారంతా ఒక్కొక్కరుగా మరణిస్తుంటే రావణుడు పడే మానసిక వేదన, మానసిక సంఘర్షణ అమోఘం. ఒక రావణాసురునిలో నుండి పదిమంది రావణాసురులు ఒకరి తర్వాత మరొకరు బయటికి రావటం, ఆ వచ్చిన వారిలో సగంమంది మంచి చెప్పటం, సగంమంది రావణుడిలోని చెడుని, దుర్మార్గాన్ని రెచ్చగొట్టటం, వర్ణించేందుకు ఏ భాషకూ మాటలు చాలవు. ఆ శీను ఓ పదినిమిషాలసేపు ఉంటుంది .... ఒక్క రంగారావుగారు పదిమందిగా కనపడినా, మొత్తం స్క్రీన్ అంతా ఆయనే నిండి ఉన్నా ఎంత మాత్రం బోరు కొట్టకుండా, పైపెచ్చు ఎంతో ఆసక్తికరంగా ఉంటుందా శీను. ఆ సీన్లో ఆయన నటనకు ప్రేక్షకులు జేజేలు పలికారు. ఆయన నట జీవితంలో మరో కలికితురాయి “నర్తన శాల’’ చిత్రంలోని కీచకుని పాత్ర. ఆ చిత్రంలో ఆయన కనిపించే పావుగంట సేపూ నిప్పులు చెరిగారు. ఈ చిత్రంలోని ఆయన నటనకు గాను జెకార్తా ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డుతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న తోలి తెలుగునటులు శ్రీ యస్.వి.రంగారావు. ఈ చిత్రంలోని తన బృహన్నల పాత్రకోసం శ్రీ రామారావు గారు భరతనాట్యం నేర్చుకుని మరీ నటించారు. ఇక్కడో విషయం మనం గుర్తు చేసుకోవాలి. అప్పుడు శ్రీ రామారావు గారికి హీరోగా మంచి ఇమేజ్ ఉంది. ఆయన శ్రేయోభిలాషులంతా బృహన్నల పాత్ర వేయొద్దని హితువు చెప్పినా, తను నమ్మిన దాని కోసం ఆయన పంతంపట్టి మరీ ఆ పాత్రను పోషించి మెప్పించిన తీరు తెలుగు చలన చిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఒకరిని మించి మరొకరు నటించి జనంలో తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మహానటులు వారంతా. అందుకే వారు ధన్యజీవులు .... అసలు రంగారావు గారు సీన్లో ఉండగా మరో పాత్ర కనపడదు. దానికి ఆయన నటన, పర్సనాలిటీ, డైలాగ్ డెలివరీ, హావ, భావ ప్రకటన అవతలి నటుని నటనకు తన రియాక్షన్ ఇలా అనేకానేక విషయాలు కారణాలుగా కనిపిస్తాయి. పాత్ర పోషణ కోసం ఆనాటి నటులు తపన పడేవారు. అందుకు ఎంతగానో కృషి చేసేవారు. అందుకే వారి కీర్తి తెలుగు చలనచిత్ర చరిత్రలో అజరామరంగా నిలిచిపోతుంది. ఆయన నటించిన “తాత మనవడు’’ చిత్రం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కినా దర్శకరత్న శ్రీ దాసరి నారాయణ రావు గారి తొలిచిత్రం కావటం విశేషం. ఈ చిత్రంలో ఆయన తాతగా, మనసున్న మంచి మనిషి కీర్తి శేషులు శ్రీ రాజబాబు గారు మావడుగా నటించారు. “అనుబంధం ఆత్మీయత అంటా ఒక బూటకం’’ పాటలో రంగారావుగారి నటన హృదయాలను కదిలిస్తుంది. ప్రేక్షకుల్ని కంట తడి పెట్టిస్తుంది. రంగారావు గారు పోషించిన మరో అత్యద్భుతమైన పాత్ర “కంసుడు’’. “యశోద కృష్ణ’’ చిత్రంలో ఆయన కంసుడిగా చేసిన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో బాల కృష్ణుడిగా నేటి నటీమణి శ్రీదేవి చాలా చక్కగా నటించింది. ఈ చిత్రం ఆయన నటించిన చివరి పౌరాణిక చిత్రం. చలన చిత్ర చరిత్రలో తెలుగు వారి కీర్తిని పదికాలాల పాటు కాపాడిన నవరస నటనా సార్వభౌమ శ్రీ యస్.వి.రంగారావు ధన్య జీవి. అంతటి మహా నటుడికి నట వారసులు లేకపోవటానికి కారణం ఆయనకు అందరూ ఆడపిల్లలు కావటమే. మళ్ళీ ఆయనే పుట్టి తన పాత్రలను మళ్ళీ మరొకోణంలో చూపించాలే తప్ప మరొకరు ఆ స్థానాన్ని భర్తీ చేయటం అసంభవం. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ .... D.M.K.
Jan 31, 2011 3:21PM
ప్రముఖ దర్శక,నిర్మాత ఇ.వి.వి.సత్యనారాయణకు నివాళి
/* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin;} తెలుగు సినీ పరిశ్రమలో హాస్యచిత్రాలకు దర్శకత్వం వహించాలంటే హాస్యబ్రహ్మ జంధ్యాల తర్వాత అంత పేరున్న దర్శకుడు ఇ.వి.వి.సత్యన్నారాయణ.ఆయన గత కొంత కాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నారు.ఈ నెల 19 వ తేదీన ఆయన హైదరాబాద్ ఫిలిం నగర్ లోని అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.ఇవివి అసలు పేరు ఈదర వీర వెంకట సత్యన్నారాయణ. ఆయన జన్మస్థలం కోరుమామిడి. ఆయన 1956 జూన్ 10 వ తేదీన వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన జనవరి 21 రాత్రి పది గంటలకు మృతి చెందారు. చనిపోయే నాటికి ఆయన వయసు 55 సంవత్సరాలు. ఆయన దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం"కత్తి కాంతారావు". ఆయన జంధ్యాల వద్ద 40 చిత్రాల వరకూ సహాయ దర్శకులుగా పనిచేసి,"చెవిలోపువ్వు" చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవటంతో, డి.రామానాయుడు నిర్మించిన "ప్రేమఖైదీ" చిత్రం ఘనవిజయం సాధించటంతో ఇ.వి.వి.కి దర్శకుడిగా మంచి బ్రేక్ లభించింది. ఆయన 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఆయన తెలుగు సినీ పరిశ్రమలోని అందరు పెద్ద హీరోల చిత్రాలకూ దర్శకత్వం వహించారు. మెగాస్టార్ తో "అల్లుడా మజాకా", నాగార్జునతో "హలోబ్రదర్", వెంకటేష్ తో"ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు", నటభూషణ్ శోభన్ బాబుతో "ఏమండీ ఆవిడొచ్చింది", రాజేంద్రప్రసాద్ తో "ఆ ఒక్కటీ అడక్కు", "అప్పుల అప్పారావు", సీనియర్ నరేష్ తో "జంబలకిడిపంబ", శ్రీకాంత్ తో కన్యాదానం", "ఆమె"వంటి చిత్రాలకు ఇ.వి.వి. దర్శకత్వం వహించారు. ఆయన హిందీలో దర్శకత్వం వహించిన ఒకే ఒక్క చిత్రం"సూర్యవంశ్"చిత్రంలో ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా నటించారు. "చాలా బాగుంది" చిత్రం ద్వారా ఆయన నిర్మాతగా కూడా మారారు. "తొట్టిగ్యాంగ్, అమ్మో ఒకటో తారీఖు, కితకితలు"వంటి అనేక చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన చిన్న కుమారుడు అల్లరి నరేష్ కామెడీ యువ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఆయనకు భార్య సరస్వతి, ఆర్యన్ రాజేష్, నరేష్ ఇద్దరు సంతానం. ఆయన అంత్య క్రియలు జనవరి 22 సాయంత్రం హైదరాబాద్ లోని మణికొండలో జరుగుతాయి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలుగు వన్ ఆ భగవంతుని ప్రార్థిస్తోంది.
Jan 23, 2011 3:58PM
INTERESTING NEWS
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com




.webp)
.webp)


