ప్రముఖ దర్శక,నిర్మాత ఇ.వి.వి.సత్యనారాయణకు నివాళి
on Jan 23, 2011

తెలుగు సినీ పరిశ్రమలో హాస్యచిత్రాలకు దర్శకత్వం వహించాలంటే హాస్యబ్రహ్మ జంధ్యాల తర్వాత అంత పేరున్న దర్శకుడు ఇ.వి.వి.సత్యన్నారాయణ.ఆయన గత కొంత కాలంగా గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నారు.ఈ నెల 19 వ తేదీన ఆయన హైదరాబాద్ ఫిలిం నగర్ లోని అపోలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.ఇవివి అసలు పేరు ఈదర వీర వెంకట సత్యన్నారాయణ. ఆయన జన్మస్థలం కోరుమామిడి. ఆయన 1956 జూన్ 10 వ తేదీన వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన జనవరి 21 రాత్రి పది గంటలకు మృతి చెందారు.
చనిపోయే నాటికి ఆయన వయసు 55 సంవత్సరాలు. ఆయన దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం"కత్తి కాంతారావు". ఆయన జంధ్యాల వద్ద 40 చిత్రాల వరకూ సహాయ దర్శకులుగా పనిచేసి,"చెవిలోపువ్వు" చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవటంతో, డి.రామానాయుడు నిర్మించిన "ప్రేమఖైదీ" చిత్రం ఘనవిజయం సాధించటంతో ఇ.వి.వి.కి దర్శకుడిగా మంచి బ్రేక్ లభించింది. ఆయన 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఆయన తెలుగు సినీ పరిశ్రమలోని అందరు పెద్ద హీరోల చిత్రాలకూ దర్శకత్వం వహించారు.
మెగాస్టార్ తో "అల్లుడా మజాకా", నాగార్జునతో "హలోబ్రదర్", వెంకటేష్ తో"ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు", నటభూషణ్ శోభన్ బాబుతో "ఏమండీ ఆవిడొచ్చింది", రాజేంద్రప్రసాద్ తో "ఆ ఒక్కటీ అడక్కు", "అప్పుల అప్పారావు", సీనియర్ నరేష్ తో "జంబలకిడిపంబ", శ్రీకాంత్ తో కన్యాదానం", "ఆమె"వంటి చిత్రాలకు ఇ.వి.వి. దర్శకత్వం వహించారు. ఆయన హిందీలో దర్శకత్వం వహించిన ఒకే ఒక్క చిత్రం"సూర్యవంశ్"చిత్రంలో ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా నటించారు.
"చాలా బాగుంది" చిత్రం ద్వారా ఆయన నిర్మాతగా కూడా మారారు. "తొట్టిగ్యాంగ్, అమ్మో ఒకటో తారీఖు, కితకితలు"వంటి అనేక చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన చిన్న కుమారుడు అల్లరి నరేష్ కామెడీ యువ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. ఆయనకు భార్య సరస్వతి, ఆర్యన్ రాజేష్, నరేష్ ఇద్దరు సంతానం. ఆయన అంత్య క్రియలు జనవరి 22 సాయంత్రం హైదరాబాద్ లోని మణికొండలో జరుగుతాయి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలుగు వన్ ఆ భగవంతుని ప్రార్థిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



