TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
- సంద్య
ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది ఒక సారి టెంకాయ చెట్టు కింద నిద్ర పోతూ ఉన్నది. అంతలోనే చెట్టుపైనుండి ఒక టెంకాయ తెగి ’దబ్బు’మని క్రింద పడింది. పడితే, కుందేలు ఉలిక్కిపడి లేచింది. చుట్టూ చూడగా ఏమీ కనబడలేదు. "ఏందోలే’ అని అట్లాగే మళ్లీ పడుకున్నది. కొంచెం సేపు అయ్యిందో లేదో మళ్లీ ’దబ్బు’ మని శబ్దం వచ్చింది. కుందేలు కళ్లు తెరిచి చుట్టూ వెతికింది. పైన ఆకాశం నీలంగా కనబడుతున్నది. ’అమ్మో ఆకాశం విరిగి మీద పడుతున్నది’ అనుకున్నది కుందేలు. మరుక్షణంలో అది పరుగుతీయటం మొదలు పెట్టింది.
అంతలో దానికి ఓ జింక ఎదురయ్యింది. ’ఆగాగు! ఎందుకు పరుగెత్తుతున్నావు, కుందేలూ’ అని అడిగింది అది. ’అయ్యో, ఆకాశం విరిగిపడుతోంది, నువ్వూ పరుగెత్తు’ అని ఉరుకెత్తింది కుందేలు. జింక దాని వెనకనే పరుగు పెట్టింది.
అలా ఉరుకుతున్న కుందేలు, జింకలకు పులి ఎదురైంది. పులి అడిగింది ’జింకా, కుందేలూ ఎందుకు పరుగెడుతున్నారు?’ అని. ’అయ్యో, ఆకాశం విరిగిమీద పడుతోంది, నువ్వూ పరుగెత్తు’ అన్నై జింకా, కుందేలూ. పులి కూడా వాటితో పాటు కలిసి పరిగెత్తటం మొదలు పెట్టింది.
అంతలో వాటికి ఓ ఏనుగు ఎదురయ్యింది. "ఏమర్రా, ఆగండి ఆగండి. ఎందుకు పరుగెత్తుతున్నారు?’ అంటే అవి ’ఆకాశం విరిగిపడుతోంది నువ్వూ పరుగెత్తు పరుగెత్తు త్వరగా’ అని అవన్నీ ఉరుకెత్తాయి అటూ ఇటూ చూడకుండా. ఇక ఏనుగుకూ వాటి వెనక పరుగెత్తక తప్పలేదు.
ఇలా ఇవన్నీ పరుగెత్తుతుంటే వాటికి ఓ సింహం ఎదురైంది. వాటిని ’ఎందుకు పరుగెత్తుతున్నారు? ఏమైంది?’ అని అడిగింది. ఏనుగు చెప్పింది రొప్పుతూ- ’ఆకాశం విరిగిపడుతున్నది. అందుకే పరుగెత్తుతున్నాం’ అని. కానీ సింహానికి ఇది విచిత్రంగా తోచింది. ’ఆకాశం విరిగిపడితే నువ్వు చూశావా?’ అని అది ఏనుగును అడిగింది. ’నేను చూడలేదు. నాకు పులి చెప్పింది’ అని అంది ఏనుగు.
’ఏం పులీ, ఆకాశం విరిగిపడ్డప్పుడు నువ్వు చూశావా?’ అని సింహం పులిని నిలబెట్టి అడిగింది. ’లేదు, నాకు జింక చెప్పింది’ అన్నది పులి. అప్పుడు సింహం జింకను నిలదీసింది: ’ఆకాశం విరిగిపడితే నువ్వు చూశావా?’ అని. ’లేదు, నాకు కుందేలు చెప్పింది’ అంది జింక. ’సరే’ అని సింహం కుందేలును అడిగింది. ’నేను టెంకాయ మానుకింద నిద్రపోతున్నప్పుడు దబ్బుమని శబ్దం వినిపించింది. ఆకాశం విరిగిపడింది’ అంది కుందేలు. ’ఆ టెంకాయ చెట్టు కిందకు వెళ్లి చూద్దాం అంది సింహం. అన్నీ కలిసి టెంకాయ చెట్టుకిందికి వెళ్లి చూశాయి. అక్కడ నేలమీద ఒక పెద్ద టెంకాయ కనిపించింది. అంతలో దబ్బుమని మళ్ళీ ఒక టెంకాయ పడింది. వెంటనే కుందేలు ’అదిగో, ఆకాశం విరిగిపడుతోంది, పరుగెత్తండి!’ అంది.
సింహం అప్పుడు వెళ్ళి క్రిందపడిన టెంకాయను చూపిస్తూ ’ఇదేనా, నీ ఆకాశపు ముక్క?’ అని అడిగింది. కుందేలుకు సంగతి అర్థమై సిగ్గుపడింది. మిగిలిన జంతువులన్నీ నవ్వాయి.