Facebook Twitter
రాజు మంగలి

రాజు మంగలి

 

అనగననగా ఒక రాజు ఉండేవాడు. ఆరాజుకు గడ్డం పెరిగిపోయింది. గడ్డం తీయించుకోవాలనుకున్నాడు. సేవకులను పిలిచి మంగలిని పిలుచుకొని రమ్మని చెప్పినాడు. సేవకులు మంగలిని పిలుచుకు రావడానికి పోయి చాలా సేపటికి కూడా రాలేదు. రాజు కూర్చున్న చోటే నిద్రపోయినాడు. మంగలి నిద్రపోతున్న రాజును లేపితే ఏమంటాడో, ఏమి శిక్ష విధిస్తాడో అని భయపడి రాజుకు మెలుకువ రాకుండా గడ్డం తీసేసినాడు. గడ్డం తీయడానికి కావలసిన నీళ్లను వెండి గిన్నెలో ఇచ్చినారు సేవకులు.
గడ్డం తీసేటపుడు ఆ మంగలికి ఒక దుర్బుద్ధి పుట్టింది. అది ఏమంటే, వెండి గిన్నె తీసుకు పోదామని . గడ్డం తీసేలోపు పూర్తిగా నిర్ణయించుకొని, వెండి గిన్నెను సంచిలో పెట్టుకొని మంగలి వెళ్ళి పోయినాడు. ఇంటికి పోయిన తరువాత మంగలికి భయం వేసింది. ’వెండి గిన్నెను నేనే తీసుకున్నానని రాజుకు తెలిసి ఉంటుందేమో , ఉరి శిక్ష వేస్తాడేమో’ అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు.

మంగలికి ఈ ఆలోచనలతో ఊర్లో ఉండాలనిపించలేదు. అడవిలోకి పోయినాడు. పగలంతా అడవిలో ఉండి , రోజూ రాత్రికి ఊళ్ళోకి వచ్చేస్తున్నాడు . అడవిలోఉన్నాగాని అతని మనస్సు మాత్రం భయం భయంగా ఉంది. ఎవరన్నా కనిపిస్తే "ఊళ్ళో ఎవరన్నా ఏమన్నా అనుకుంటున్నారా?"అని అడుగుతాడు. అలా భయపడుతూనే ఒక తంగేడు చెట్టుకింద గుంత తీసి వెండి గిన్నెను ఆ గుంతలో పూడ్చిపెట్టినాడు. మళ్ళీ ఎవరన్నా కనపడితే "ఏమన్నా, వెండిగిన్నె -గిండి గిన్నెఅనుకుంటూ వుండిరా ఊర్లో ! తంగిడి చెట్టు గింగడి చెట్టు అనుకుంటాండారా ఊర్లో?" అంటూ భయంగా అడిగేవాడు.

అయితే నిద్రపోతున్న రాజుకు మెలుకువ వచ్చేసి చూస్తే, గడ్డం లేదు! బాగా నున్నగా ఉంది! "అరే నాకు మెలుకువ రాకుండా గడ్డం తీసేసినాడంటే ఆ మంగలికి ఎంతో నైపుణ్యం ఉంది. ఖచ్చితంగా అతనికి బహుమానం ఇవ్వాల"ని రాజు నిర్ణయించుకున్నాడు. సేవకులతో మంగలిని పిలుచుకురమ్మని చెప్పి పంపాడు.

సేవకులు ఊరంతా వెతికినా ఎక్కడా మంగలి కనిపించలేదు. ఆ విషయాన్ని రాజుకు చెబితే, "మీరు మంగలిని ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని రావాల్సిందే" అని చెప్పినాడు. సేవకులు ఊరంతా మరోసారి వెతికి అడవిలోకి పోయారు. అడవిలో సేవకులు పోతుంటే మంగలికి గుండె దడదడ అంటోంది. పట్టుకొని పోతారని, ఏమి చేస్తారోనని భయం వేసింది . చివరికి వారి చేతుల్లో చిక్కక తప్పలేదు మంగలికి. ఎన్నిరోజులు దాగగలడు? రాజు పిలుస్తున్నాడని సేవకులు మంగలిని పిలుచుకుపోయినారు. రాజు దగ్గరకు పోతావుంటే మంగలికి చాలా భయం వేస్తా వుంది. కాని మంగలి అనుకున్నట్లు రాజుకు వెండి గిన్నెమీద ఆలోచనలేదు. రాజుకు ఎన్నో వెండి గిన్నెలు ఉంటాయి. కాని మంగలికి అనుమానం పోలేదు. రాజు మంగలితో "నాకు మెలుకువ రాకుండా గడ్డం తీశావు. నీలో చాలా నైపుణ్యం ఉంది. ఇదిగో ఈ బంగారు హారం బహుమానంగా ఇస్తున్నాను తీసుకో" అని బంగారు హారం బహుమానంగా ఇచ్చినాడు.

రాజు ప్రవర్తనకు మంగలికి నోటమాట రాలేదు.

కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

 

రచన: హనుమంతు