Facebook Twitter
నిశ్చల చిత్రం

నిశ్చల చిత్రం

- భవానీ దేవి


ముసురుపట్టింది ఆకాశానికే కాదు
నా మనసుకు కూడా !
చెట్లు ఆకులన్నీ రాల్చిన లండన్ శిశిరంలో
ఆలోచనలు కూడా రాలిపోతున్నాయి
రోడ్డంతా రంగులు మారుతున్నా ఆకుల్నద్దుకుని
ప్రకృతి ప్రసాదించిన వికృతిలావుంది.
ఇక్కడ ఋతువులే కాదు
మనుష్యులు కూడా పరిగెత్తే నిశ్చల చిత్రాలే!
ఈ నడుస్తున్న సమూహాలలో
నా ఒంటరితనం చిక్కుకుని మూలుగుతోంది
పలకరింపుల్లో కృత్రిమత
ఎప్పుడో ఒక ఎమర్జెన్సీ సైరన్
ప్రాణం ఖరీదును గుర్తు చేస్తూ జారిపోతుంది....
చీకటి పాడుతున్నచల్లని పాటను వింటూ
సుదూరపు వేగుచుక్క వెలుగులో
చలికాచుకోవాలని అత్యాశ!
అనుభూతులు స్పందనలు రాల్చుకుని
దీనిని దూరంగా విసిరేయలేను...
హృదయం గోడకు తగిలించనూ లేను...