TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
వలచి వచ్చిన వనిత
-వసుంధర
పార్ట్ - 4
అయితే నాకుచేతకాదు. మీరే చెప్పాలి!" అన్నాను.
"అర్ధమైందిలెండి __ మీకునాతో మాట్లాడం ఇష్టంలేదు"__అందామె కాస్త కోపంగా.
"అలాగని ఎందుకను కుంటున్నారు? మీరుమాటాడుతుంటే అలావింటూ ఉండిపోవాలనిపించడం జరగవచ్చుకదా!" అన్నాను.
చప్పట్లు కావాలంటే రెండు చేతులూ కలవాలి. సంభాషణ నడవాలంటే కనీసం ఇద్దరు మాట్లాడాలి."
"మాట్లాడ్డానికి నాకేమీ అభ్యంతరంలేదు. కానీ ఒక్కమనవి. మీకూనాకూ ఇంతవరకూ ఏవిధమైన పరిచయమూ లేదు. అందులోనూ మీరు ఆడ, నేనుమగ. విచిత్ర పరిస్ధితుల్లో మనమిక్కడ కలుసుకున్నాం. ఇవన్నీ కాస్తసంకోచానికి సరైన కారణాలు కావంటారా?" అన్నాను.
ఆమె భావగర్భితంగా నావైపుచూచింది__" ఒప్పుకున్నాను కానీ నేను కాస్త ధోరణి మనిషిని. కొత్త, పాత అని లేకుండా ఎవరితోనైనా నేను గంటలతరబడి మాట్లాడేయగలను. అలా మాట్లాడాలనే నాకుంటుందికూడా. కానీ అస్తమానం అవకాశం కలిపిరాదు. మంచి ఉత్సాహంతో కబుర్లు చెప్పుకునే సమయంలో__అబ్బ ఈపెద్దవాళ్ళున్నారు చూశారూ___ పానకంలో పుడకల్లా అడ్డుపడతారు".....................
నేనామెను మధ్యలో ఆపి"__"ఇంతకూ మీఅన్నయ్యకూడామీరంటున్న పెద్దల్లో ఒకడా?" అనడిగాను.
"అనే అనుకోండి__" అందామెనవ్వి.
ఆమెస్నానం చేస్తానంది. ఆ సమయంలో నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తానని చెప్పి బయట పడ్డాను.
పార్వతి ప్రవర్తన కాస్త చిత్రంగానే ఉందినాకు. మనిషి చాలా అందంగాఉంది. కంఠం తియ్యనిది. డాషింగ్ నేచర్ ఉంది. శ్రీధరబాబు తన చెల్లెలు ప్రసక్తి ఇతరులు తీసుకువస్తే సహించలేకపోవడానికీ- పార్వతి స్వభావానికీ ఏదైనా సంబంధముందా అన్న అనుమానం నాకు లీలగాతోచింది.
దోసెలూ,ఇడ్లీ పార్సెల్ కట్టించుకుని నేను గదికి వెళ్ళి తలుపు తట్టేసరికి తల ఆరబోసుకుని ఉన్న పార్వతి తలుపు తీసింది. ఆ రూపంలో ఆమె చాలా చాలా అందంగా ఉండడం వల్ల నేను ఒక్కక్షణంపాటు అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాను.
"తలుపులు తీశానుమరి. అయినా మీరు లోపలకు రావడంలేదు__" అందామె.
ఆమె మాటల్లో నాకు రెండర్ధాలు ధ్వనించాయి. తన హృదయపు తలుపులు తెరిస్తే నేను సంకోచిస్తూన్నట్లుగా ఆమె అన్నట్లు నాకు అనిపించింది. నేను గదిలో అడుగు పెట్టి మళ్ళీ తలుపులు వేసి ముందడుగు వెస్తూ కూడా ఆమె అలా కళ్ళప్పగించి చూస్తున్నాను.
ఆమె మంచం మీద కూర్చుంది. నేను కుర్చీలో కూర్చున్నాను. అప్పుడు నాకు పార్వతి గురించి టిఫెన్ తెచ్చిన విషయం స్పురణకు వచ్చి లేచి వెళ్ళి "మీకోసం టిఫెన్ తీసుకవచ్చాను__" అంటూ ఆమెకు పొట్లాలు అందించాను.
ఆ అందించడంలో ఇద్దరి చేతులూ కొద్దిగా తగిలాయి. అస్పర్శలోని మధురాను భూతిని వర్ణించలేను కానీ ఒకసారి ఆమెను దగ్గరగా లాక్కోవాలనిపించింది. నామెదడులోని ఆలోచన ఇంకా ఒకరూపానికి వచ్చేలోగానే__ సుదర్శనం గుండెలమీద కూర్చుని అతగాడి గొంతు నులుముతున్న శ్రీధర బాబు రూపం భయంకరంగా స్పష్టంగా ఊహలో కనిపించింది. చటుక్కున వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను. పార్వతిని శ్రీధరబాబు చెల్లెలిగా గుర్తించడం జరగడంతో నేను పూర్తిగా వార్మల్ కువచ్చాను.
"ఇంత కొద్దిగా తెచ్చారు. ఇది ఇద్దరికేం సరిపోతుంది?" అందిపార్వతి.
"నేను తినే వచ్చాను_" అన్నాను.
"నాఅతిధులు హొటల్ లో తినడం నేను సహించలేను. నాతోపాటు ఇంట్లో తిని తీరవలసిందే__" అంటూ ఆమే టిఫెన్ ని రెండు సమభాగాలు చేసింది. ఆక్షణంలో ఆమే ఆప్యాయతకు ఒక యువకుడిలా కాక చంటిపిల్ల వాడిలా లొంగిపోయాను. ఇద్దరం టిఫెన్ తిన్నాం.
ఆమె టైము చూసుకుని__" నిజానికి ఇది భోజనం టైము అంది.
"ఏడుగంటలకు భోంచేయడం నాకు అలవాటులేదు___" అన్నాను.
"అవుననుకోండి. కానీ ఏడుగంటల ప్రాంతంలో టిఫెన్ తీసుకుంతే రాత్రికీ భోజనం చేస్తారా__ మరిపస్తేనా?" అనడిగింధామె.
"భోజనం తొమ్మిది గంటలకి!"
"అయితే అప్పుడు మళ్ళీ వెళ్ళి భోజనం తీసుకోస్తారా-" అని నాజవాబుకు ఆగకుండానే__ నా అతిథిని అంత రాత్రి వేళ ఒంటరిగా బయటకు పంపడం నాకిష్టముండదు కాబట్టి హొటలుకు నేనూ మీతో వస్తాను_" అంది.
"అతిధిని హొటల్ లో భోంచేయనిస్తారా మరి___" అన్నాను ఆమెను దెబ్బతీయగలిగినందుకు నంబరపడుతూ.
"భలేవారే __ఆడది ప్రక్కన ఉన్న చోట ఇల్లుకాక హొటలెలా అవుతుందండీ!" అని ఆమె నవ్వేసింది.
ఎనిమిది గంటల ప్రాంతంలో ఇద్దరం గదిలోంచి బయటకువచ్చి కాసేపు వీధులలో విహరించాం. తోమ్మిది గంటల ప్రాంతంలో ఒక హొటల్ లో భోజనం చేశాం. అన్నిచోట్ల డబ్బు నేను ఇచ్చాను. భోజనమై బయటకు వచ్చేక ఆమెతో___మరి నేను సెలవు తీసుకుంటాను. పునర్దర్శనం మళ్ళీ రేపు ఉదయం చేసుకుంటాను___" అన్నాను.
"ఒకర్తినీ ఒంటరిగా అంతఇంట్లో నేనుండలేను. అంతగా మీకా ఇంట్లో పడుకోవడం ఇష్టంలేక పోతే నేనూ మీతోనే వచ్చేస్తాను__" అందామె.
అది అమాయకత్వమా లేక జానతనమా అన్నది నాకు తెలియలేదు. నామనసులోని అభిప్రాయాన్ని ఇంకాస్త స్పష్టంగా చెప్పక తప్పదనుకుని__" శ్రీధరబాబు నాకు స్నేహితుడు. అతని మనసుకు కష్టం కలిగించే పని ఏదీ నేను చేయలేను_" అన్నాను.
"రాత్రి పూట తన చెల్లెల్ని ఏకాకిగా కొంపలో వదిలేసి పోయిన స్నేహితుడిని అన్నయ్య క్షమించగలడని నేననుకొను__"
శ్రీధరబాబు సంగతి బాగా ఎరిగున్న నేను వెంటనే ఏమీ మాట్లాడలేదు, తిరిగి మళ్ళీ ఆమే అన్నది__" నన్నెంతసేపు మీరు మీ స్నేహితుడి చెల్లెలుగానే భావిస్తున్నారు తప్పితే ఒంటరిగా ఉండడానికి భయపడుతున్న ఒక ఆడదానిగా గుర్తించడంలేదు. ఇదేపరిస్ధితిలో మీచెల్లెలూ ఉంటే మీకింత సంకోచమూ ఉండేదా?"
"అవును. నిజమే! 'ఆమే నాలోని లోపాన్ని చక్కగా ఎత్తిచూపించింది. పార్వతిని శ్రీధరబాబు చెల్లెలుగా మాత్రమే నేను గుర్తిస్తున్నాను తప్పితే నాచెలెలిగా భావించలేక పోతున్నాను__ "అప్పుడే పరిచయమైన వయసులో ఉన్న అందమైన యువతిని చెల్లెలుగా భావించడంలో కష్టం ఫీలవుతున్న నేను అదినాలోపమేనని అంగీకరిస్తున్నాను. కానీ ఏతప్పు చేయకుండా ఉండడంకోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం లోపమని నేననుకొను."
"సరే__ఒక ప్రశ్న అడుగుతాను మీఉద్దేశ్యం నాకర్ధమయింది. పగలు నాతో ఏకాంతంగా కొన్ని గంటలు గడపడానికి భయపడని మీరు రాత్రి అలా చేయడానికి జంకుతున్నారు. కారణం తెలుసుకోవచ్చా?
నేను మాట్లాడలేదు. ఆమే ప్రవర్తన నిష్కళంకం కావచ్చు. నేను చాలా బుద్ది మంతుడిలా ప్రవర్తించవచ్చు. కానీ శ్రీధరబాబు లాంటి వాడికి ఆమే చెల్లెలుకావడం కారణంగా నేను ఏవిధమైన రిస్కూ తీసుకోదల్చలేదు.
ఆమె మళ్ళీ అంది__"సరే __మీ మౌనమే సమాధానమనుకుంటాను. నేను రాత్రిళ్ళు ఒంటరిగా గడపలేను. అందుకని చిన్న రిక్వెస్టు. మనం సెంకండ్ షో సినిమాకి వెడదాం. వదిలే సరికి ఒంటిగంట దాటుతుంది. అప్పుడు నన్ను ఇంటిదగ్గర దిగబెట్టి మీరు మీయిష్టంవచ్చిన చోటుకి వెడుదురుగాని. చాలా భాగం రాత్రి గడిచిపోతుంది కాబట్టి__మిగతా భాగం రాత్రి ఎలాగో అలా ఒంటరిగా గడపడానికి నాబాధ నేను పడతాను."
ఒక అరగంట సేపు పార్వతి సినిమా బుది గానే చూసింది. ఆతర్వాతనుంచి కొది కొద్దిగా చిలిపిచేష్టలు ప్రారంభమయ్యాయి. ఉండుండి నావైపు వాలిపోతూండేది. నిద్రవస్తోందని సంజాయిషి ఇచ్చుకున్నప్పటికి ఆమె ముఖంలో ఎక్కడా నిద్రచాయలు నాకు కనపడలేదు ఒకోసారి తన కాలితో నాకాలు నొక్కుతూండేది. చాలాపర్యాయాలు నాచేతిని నొక్కింది.