TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ఒక యువకుడికి తన సాధారణ జీవితం మీద విరక్తి కలిగింది. ఎక్కడో ఊరి బయట ఉన్న మఠానికి వెళ్ళి, అక్కడ ఉన్న జైన్ గురువును కలిశాడు. నాకు ఈ జీవితం విసుగెత్తిపోయింది. ఈ ప్రాపంచిక కష్టాల నుంచి బయట పడాలనుకుంటున్నాను. కానీ నేను కఠినమైన సాధనలేవీ చెయ్యలేను. ఏ పనీ ఏకాగ్రతతో చేయలేను. ఒక చోట కుదురుగా ఉండలేను. శాస్త్రాలు చదవడం, ధ్యానం చేయడం లాంటివి నాకు ఏమాత్రం సాధ్యం కావు. ఈ లౌకికమైన బంధాల నుంచి బయట పడడానికి.. నాలాంటి సామాన్యులు ఆచరించగలిగే పద్ధతులేవైనా ఉన్నాయా అని అడిగాడు. నువ్వు ఇష్టంగా ఏ పని చేస్తూ ఉంటావు అని ప్రశ్నించాడు గురువు. మేము ధనవంతులం. నేను ఎన్నడూ ఏ పనీ చెయ్యలేదు. ఎప్పుడూ చదరంగం ఆడుతూ గడిపేవాణ్ణి, అంతే అన్నాడు ఆ యువకుడు. అలాగా ఆ ఆటే ఆడవచ్చు అంటూ నౌకరును పిలిచి ఆ గదిలో ఉన్న సాధువును ఒక చదరంగం బల్లనీ, పావుల్నీ తీసుకురమ్మని చెప్పు అని చెప్పాడు గురువు. కొద్ది సేపటికి ఆటకు అవసరమైన వస్తువులన్నటినీ తీసుకొని సాధువు అక్కడికి వచ్చాడు. అతనికి ఆ యువకుణ్ణి గురువు పరిచయం చేసి ఇతనితో నువ్వు చదరంగం ఆడు అన్నాడు. గురువర్యా! నేను ఎప్పుడో ఒకటి రెండుసార్లు ఆడాను. ఆ ఆట గురించి నాకు బాగా తెలీదు అన్నాడు సాధువు.
అలాగా అంటూ తళతళా మెరుస్తున్న కత్తిని గురువు బైటికి తీసి ఈ కత్తి ఎంత పదునుగా ఉందో చూశావా ఆటలో ఓడితే ఈ కత్తితో నీ తల నరికేస్తాను. ఆ యువకుడు ఓడిపోతే అతని తల నరికేస్తాను. ఇక ఆట మొదలుపెట్టండి అని ఆజ్ఞాపించాడు గురువు. వారిద్దరూ ఇక ఏం మాట్లాడలేక ఆట ఆరంభించారు.
ఆ యువకుడికి వణుకు పుట్టింది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. తన పరిసరాల్ని మరచిపోయాడు. అది అతనికి చావు బతుకుల సమస్య కావడంతో ఏకాగ్రచిత్తంతో ఆడడం ప్రారంభించాడు. అతను ఆ ఆటలో మంచి నేర్పరి. తన గెలుపును నిర్దేశించే ఎత్తులన్నీ ఆలోచించి వేస్తూ తన ప్రత్యర్థి అయిన సాధువును గమనించాడు. ఆ సాధువులో ఎలాంటి ఆందోళనా, అలజడీ లేవు. తను ఓడిపోతున్నానని తెలిసినా, ఓడితే తన తలను గురువు నరుకుతాడనే విషయం గుర్తున్నా ఆ సాధువు ఏమాత్రం బెదరకుండా, ప్రశాంతంగా ఆట కొనసాగిస్తున్నాడు. ఇక కొద్దిసేపట్లో తన గెలుపు ఖాయమనే స్థితిలో ఉన్న ఆ యువకుడు తన ఎదురుగా ఉన్న ప్రత్యర్థి ముఖంలోకి చూశాడు. ఆయన సర్వ సుఖాలనూ త్యజించి, పట్టుదలతో కష్టనష్టాలను ఎదుర్కొని, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని సాగిస్తున్నాడు. జ్ఞానాన్ని ఆర్జిస్తూ, దాన్ని ఇతరులకు పంచుతూ, పరోపకారిగా బతుకుతున్నాడు. అలాంటి వాడు ఆటలో ఓడితే మరణిస్తాడు. దానివల్ల లోకానికి తీవ్రమైన నష్టం కలుగుతుంది. ఇక నా జీవితం ఎవరికీ ఉపయోగపడనిది. నేను ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. నాలాంటి వాడు ఆటలో గెలిచి బతికినా ప్రయోజనం ఏమిటి అనుకున్నాడు ఆ యువకుడు. ఉద్దేశపూర్వకంగా ఆటలో తప్పులు చేశాడు. దీన్నంతటినీ జాగ్రత్తగా గమనిస్తున్న గురువు హటాత్తుగా ముందుకు వచ్చి.. చదరంగం బల్లను ఎత్తి విసిరేశాడు. మరికొద్ది నిమిషాల్లో విజేత ఎవరో తేలిపోయే సమయంలో గురువు ఆటను చెడగొట్టి, ఇద్దరూ విజేతలేనని ప్రకటించాడు. ఆ ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
జరిగినదాన్ని నిశితంగా గమనిస్తే గురువు ఆజ్ఞను సాధువు ధిక్కరించకుండా, సంపూర్ణ శరణాగతితో, ఫలితాన్ని పట్టించుకోకుండా పోటీలో పాల్గొన్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడి మీద అర్జునుడు భారం మోపి, ఫలితాన్ని ఆయనకే వదిలేసి యుద్ధం చేసినట్టు శిష్యుడు వ్యవహరించాడు. కొత్తగా వచ్చిన యువకుడు ఏకాగ్ర చిత్తంతో ఆడాడు. విజయం వైపు అడుగులు వేశాడు. చివరి దశలో ప్రత్యర్థి మీద కరుణ కలిగింది. ఆ సాధువు బతకడం కోసం ఉద్దేశపూర్వకంగా ఓడిపోవాలనీ, తను మరణించాలనీ అనుకున్నాడు. అతనిలో ఆ సమయంలో ఏకాగ్రత (ధ్యానం), కరుణ అనే ముఖ్యమైన రెండు గుణాలు వృద్ధి చెందాయి. వేల ఉపదేశాలు చేయలేని పనిని గురువు కల్పించిన ఆ పరిస్థితులు చేయగలిగాయి. ఆ తరువాత అతనికి జీవితంలో విరక్తి, విసుగు మాయమయ్యాయి.ఏ మనిషిలో అయినా అపారమయిన మేధోసంపద ఉంటుంది. దాని సద్వినియోగ పరుచుకుంటే ప్రతి జన్మ ధన్యం అవుతుంది.