Facebook Twitter
సమస్త మానవాళికి ఆదర్శనీయుడు..హనుమంతుడు

 

సకల సద్గుణ సంపన్నుడైన శ్రీ ఆంజనేయ స్వామీ  సమస్త మానవాళికి ఆదర్శనీయుడు. 
హనుమంతుని గురించి ఎంత చెప్పినా తక్కువే..మూర్తీభవించిన సమగ్ర సమపూర్ణ స్వరూపమే శ్రీరామ దూత అయిన శ్రీ హనుమ రూపం.. మహీతలంపై ఎంత గిరులు, సరులు ఉంటాయో అంత వరకూ లోకాల్లో రామాయణ గాథ ప్రచారంలో ఉంటూనే ఉంటుంది.

హనుమంతుని  కీర్తించే ముందు రామ నామాన్ని జపించడం ముఖ్యం.  సేవ, త్యాగం, శక్తి, భక్తి, సమయస్పూర్తి అన్నీ కలిస్తే  హనుమంతుడు.   రామ భక్తుల గుండెల్లో కొలువై సుందర కాండకు బలమైన హనుమ పల్లె పల్లెకూ కూడళ్ళలో నిలిచి ధైర్యాన్ని ఇచ్చే పెద్ద దిక్కు. హనుమ గురించి రామాయణం అంతా చెప్పేది ఒకటే.. రాక్షసులకే కాదు భూత ..ప్రేత పిశాచాలు   కూడా ఆంజనేయుని నామం వింటే పరుగెత్తి పోతాయి. అటువంటి అంజనీసుతుడు సూర్యుని విద్యార్థి. సూర్యునితో పాటు సకల విద్యలూ నేర్చుకున్నాడు. సుగ్రీవునికోసం వెళ్లి రామాదుల దర్శనం చేసుకొన్నాడీ వాయునందనుడు. ఆ కేసరి తనయుని వాగ్దాటిని చూచి రాముడు అపశబ్దమే పలుకని ఇతడు నవవ్యాకరణ పండితుడని మెచ్చుకున్నాడు. అంతేనా పట్టుదలతో అనుకున్న పనిని చేయడంలో హనుమకు సాటి ఎవరు. ఇదిగో సుగ్రీవునితో స్నేహం కలుపు నీకు మేలు జరుగుతుందని రామునికి తెలిపింది హనుమే. చూచిన తోడనే సుశబ్దశోభితుడుగా కనబడ్డ సుందరుడు అంజనీసుతుడు ఆంజనేయుడు. కంటిని సీతమ్మను అని దుఃఖార్తిలో మునిగిపోయిన రామునికే సంతోషం కలుగజేసినవాడు. సీత జాడను తెలిపి  రామునికి దుఃఖాన్ని పోగొట్టడమే కాదు. సీతకు ధైర్యాన్ని ఇచ్చాడు. కాస్త ఓపిక పట్టుతల్లీ రాముడు నిన్ను యుధ్ధంలో గెలిచే అయోధ్యకు తీసుకువెళతాడని అభయాన్ని ఇచ్చాడు.  రాఘవుడున్నాడమ్మా నీ మనోభిరాముడు నీకోసమే ఎదురుచూస్తున్నాడమ్మా అంటూ శోకసముద్రంలో కొట్టుకొని పోయే సీతమ్మకు ఆసరాని ఇచ్చిన వాడు  హనుమంతుడే.


ఎర్రపూలు, జిల్లేడు పుష్పాలు, తమలపాకులు అంటే అత్యంత ప్రీతి గలవాడు హనుమ. మంగళవారం నాడు వడమాలలిచ్చిన వారికి కోరిన కోరికలు తీర్చేవానిగా  ప్రసిద్ధుడు. పండు అనుకొన్నానంటూ సూర్యమండలానికి యెగిరి  సర్వదేవతల అనుగ్రహాన్ని వాత్సల్యాన్ని అందిపుచ్చుకున్నవాడు. తన బలం తనకు తెలియని అమాయకుడు. సురస సింహికల పోరాటంలో పోరాటపటిమనే కాదు బుద్ధికుశలత అవసరమని నిరూపించినవాడు. తన శక్తిని తెలియజేయగానే భీకర ఆకారుడై వందయోజనాల దూరం అవలీలగా లంఘించినవాడు. రాముని  శరణు పొందు బాగుపడతావు  అని రావణునికి ధైర్యంగా స్థైర్యంగా చెప్పినవాడు. శక్తి ఆయుధానికి మూర్ఛిల్లిన లక్ష్మణుని కోసం స్థావర్ణ్యికరిణి, సంజీవ కరణి, సంధాయనీకరణి లాంటి ఔషధులతో నిండి ఉన్న ఔషధీ పర్వతాన్నే తీసుకొచ్చినవాడు.శ్రీరామ జయరామ జయ జయ రామ.. అని రామ నామాన్ని జపిస్తూ, భజన చేస్తేచాలు ఒడలంతా పులకరించిపోగా నవోత్సాహంతో రామభక్తుల ఎదుట కనిపించే రామసేవాతత్పరుడు. అఖండ బ్రహ్మచర్య వ్రత పాలకుడు. వీరత్వ, శూరత్వ, బుద్ధిమత్వ, దక్షత్వాది సద్గుణాలకు అతడు నిధియైనవాడు.

ఇన్ని శుభలక్షణ సమన్వితుడు ఆంజనేయుడే కదా. ఈ రుద్రాంశసంభూతుడు, రామనామ జపనిరతుడు అయిన కేసరి నందనుడు వైశాఖ బహుళ దశిమినాడు అంజనీసుతుడుగా జన్మనొందాడు. జన్మించిన నాటి నుంచి అతులితబలశాలిగా ఎదిగాడు. ఆ హనుమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హనుమజ్జయంతి సందర్భంగా రాముని మనసంతా నింపుకుని హనుమకు వందనం చేయడమే మనకు రక్ష. శరీరం, మనసు రెండూ పవిత్రంగా ఉన్నప్పుడే వాయు పుత్రుడైన హనుమంతుని ఆరాధన ఫలాన్ని ఇస్తుంది. హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు ధరించవద్దు. ఇది ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. హనుమ పూజలో ఎరుపు రంగు చాలా పవిత్రమైనదిగా చెబుతారు.జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్.