ఆవకాయ... దేశభక్తి. దేహభుక్తి
ఆవకాయకి దేశభక్తికి సంబంధం ఏంటనుకుంటున్నారా..ఓ బామ్మ తన మనవడికి చెప్పిన ఈ కథ వింటే ఆ సంబంధం ఏంటో తెలుస్తుంది. అంతేనా ఆవకాయకి..మన జెండాలో ఉన్న రంగులకి సంబంధం కూడా వివరించింది ఈ బామ్మ.
ఒరేయ్ అబ్బిగా... నేను గమనించలేదు కానీ జెండా కనిపెట్టిన వాడు ఖచ్చితంగా మన తెలుగు వాడే అవుతాడు అంది. బామ్మోయ్... నీకెలా తెలిసే జెండా కనిపెట్టింది నిజంగా మన తెలుగు వాళ్లే అన్నాడు అమాయకంగా పరమేశం . తెలుగువాడు కాకపోతే మరి ఎవరు కనిపెడతారు అంట, ఆవకాయ తినేవాడికి మాత్రమే దేశభక్తి మెండుగా ఉంటుంది. దేహభక్తి ఉన్న వాడు జాడీలో ఆవకాయ పెడతాడు. దేశభక్తి వున్నవాడు జెండాని కనిపెడతాడు.
ఆవకాయ తిన్న వాడికే జెండా తయారు చేయడం వస్తుంది. వాళ్ళకి అదో లెక్కకాదు అంది. ఆవకాయకి జెండాకి ఏమిటే ముడి అన్నాడు . ఓరి వెర్రి నాగన్న. జెండాలో రంగులు చెప్పరా ఒక్కసారి అనగానే వాడు పైన కాషాయం, మధ్యలో తెలుపు ,కింద ఆకుపచ్చ అన్నాడు . చూసావా మన వాళ్ళకి ఎంత ముందు చూపు ఉందో అంది బామ్మ . ఇందులో ముందుచూపు ,వెనక చూపు ఏమిటి జెండా కోసం పింగళి వెంకయ్య గారు చాలా కష్టపడ్డారు .మధ్యలో నీలం రంగు చక్రం కూడా పెట్టారు అన్నాడు. అదీ విషయం .అలా చెప్పు .పింగళి వెంకయ్య గారు ఆవకాయ పెట్టడంలో లేదా తినడంలో దిట్ట అయి వుంటారు. లేదా వారి వంశస్తులు ఆవకాయ కనిపెట్టి వుంటారు. అందుకే ఆయన మనసులో ఈ రంగులు కదలాడాయి అన్నమాట. ఇలా చూడు ఇవి ఆవకాయ దినుసులు. కనబడుతున్నాయా అంది. శుబ్బరంగా కనపడుతున్నాయి. ఇవి మామిడికాయలు,అది ఉప్పు, ఇదిగో కారం. ఇప్పుడు చెప్పవే బామ్మ అన్నాడు పరమేశం . ఈ మామిడికాయని చూడు ఆకుపచ్చ రంగులో నిగనిగలాడుతూ ఎంత బాగుందో, ఉప్పు తెల్లగా సున్నం వేసినట్టు లేదు .ఇక మిగిలింది బళ్ళారి కారం .కారం కాస్త కాషాయానికి దగ్గరలో ఉంటుందిలే .కాషాయం రంగులో కారం.. తెల్ల రంగులో ఉప్పు ఆకుపచ్చని రంగులో నవనవలాడే మామిడికాయలు మన జెండా కాదంటావా అంది బామ్మ, జెండా తానే కనిపెట్టునట్టుగా. మరి మధ్యలో చక్రమే అన్నాడు పరమేశం.
ఇదిగో ఇవన్నీ పోసి ఇలా గిరగిరా తిప్పడమే . అప్పుడు ఆవకాయ సిద్ధం. అదే చక్రం తిప్పడం . ఇక ఆవాలు అంటావా మన దేశ జనాభా జెండా మన దేశం యొక్క ప్రతీక. ఆకాశంలో ఎగురుతుంటే ఒళ్ళు పులకరిస్తుంది అనుకో. అలాగే మన ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటింటా ఆవకాయ్ జాడీలో ఊరుతూ ఉంటుంది. చూసావా జాడీకి జెండాకి కూడా అక్షరాలు ఎలా కలిసిపోయాయో అని బామ్మ అంటుంటే నోరూరించుకుంటూ వెళ్లిపోయాడు పరమేశం. ఇలాంటి ఆలోచనలే వస్తాయి నిజంగానే పింగళి వెంకయ్య గారు ఆవకాయ పెట్టారా అందుకే ఆయనకి ఈ రంగులు గుర్తొచ్చాయా అనుకుంటూ నిద్ద ట్లోకి జారుకున్నాడు. మొత్తానికి ఆవకాయకి..భారతీయజెండాకి సంబంధం ఉందని బామ్మ తేల్చిచెప్పేసింది. బామ్మ చెప్పిన ప్రకారం చూస్తే ఒకరకంగా ఉందనే అనిపిస్తోంది.
