Facebook Twitter
తెల్లమబ్బు

తెల్లమబ్బు

- భవానీ దేవి

 



    గుంటూరు బస్ స్టాండ్ లో చీరాల వెళ్ళే బస్సు కదలటానికి సిద్ధంగా ఉంది.

    బస్సు ఎక్కి కిటికీ దగ్గర సీటు ఖాళీగా ఉండటం చూసి వెళ్ళి కూర్చుంది సుజాత.

    బస్సంతా ఒక్కసారి కలియచూసింది. మరీ రష్ గా లేదు... ఫర్వాలేదు... కండక్టర్ వచ్చి ఎక్కాడు. ఒక్కొక్క సీటు దగ్గరికి వెళ్ళి టికెట్ ఇవ్వటం ప్రారంభించాడు. టిక్కెట్లు ఇవ్వడం పూర్తవుతూనే 'రైట్' కొట్టాడు కండక్టరు. బస్సు కదుల్తోంది. 'హమ్మయ్య' అనుకుంది సుజాత. హడావుడిగా ఒకతను పరుగెత్తుకుంటూ వచ్చి బస్ ఎక్కేశాడు.

    అతను టికెట్ తీసుకోని సీటు వెదుక్కోవటంలో నిమగ్నమైనాడు.

    అతడ్ని చూస్తూనే సుజాత కళ్ళు వెడల్పయినాయి. పదేపదే అతనికేసి చూస్తుంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని సంకోచంతో మధ్య మధ్య ఆగిపోతున్నది.

    అతను ఒకసారి తనకేసి చూస్తే బావుండు. చూడకపోతేనే మంచిది. సరిగ్గా అర్ధంకాని ద్వైదీభావం.. ఆమెలో...

    సీటుకోసం వెదుకుతున్న అతని చూపులు ఆమెను చూడగానే సూర్యరశ్మి సోకినా కమలాలయినాయి . కళ్ళల్లో మెరుపులు నింపుకుంటూ "బావున్నారా?" అడిగాడు దగ్గరకొచ్చి. నవ్వుతూ తలూపింది సుజాత.

    'ఎక్కడుంటున్నారు' ఆమె మెడలోని నల్లపూసల దండమీద అతని చూపులు ఆగిపోయాయి.

    'చీరాల దగ్గరే' సుజాత మొహం ముకుళించుకుపోవటం అతని దృష్టిని దాటిపోలేదు. 'మీ వారేం చేస్తుంటారు' మళ్ళీ అడిగాడు.  

    సుజాతకి అతని వరసేం నచ్చలేదు. అయినా తనను తాను సంబాళించుకుంటూ చెప్పింది.

    "స్కూల్ టీచర్".

    బస్ ఏదో స్టేజీలో ఆగింది.

    సుజాతకి పక్కగా ఉన్న సీటు ఖాళీ అయింది. వెంటనే కూర్చున్నాడు రిలీఫ్ గా.

    అతని సీటుకూ ఆమె సీటుకూ మధ్యగా నడిచే దారి ఉంది. అయినా సుజాతకు ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది.

    ఒకటి రెండుసార్లు ఓరగంట చూసింది. ఆమె ధ్యాసే లేనట్లుగా ప్రక్కనున్న పల్లెటూరు ఆసామితో రాజకీయచర్చకు దిగాడతను.

    మధ్యలో ఒకసారి హఠాత్తుగా ఇటు తిరిగి చూశాడామెకేసి.

    "పిల్లలెంతమంది" అడిగింది కుతూహలంగా.

    "ఇద్దరు" చెప్పాడు గర్వంగా. మళ్ళీ సుజాతని అడిగాడు నవ్వుతూ.

    "మీకు...?"

    "లేరు.." అంది తలదించుకొని అపరాధిలా...

    సానుభూతిగా అతను చూసిన చూపులు సూదుల్లా గుచ్చుకుంటున్నట్లనిపించింది. మళ్ళీ సంభాషణ కొనసాగలేదు.

    అతను ప్రక్కసీటతనితో మళ్ళీ కబుర్లలో పడ్డాడు.

    అతడ్ని అలా ఆనందంగా సంతోషంగా చూస్తుంటే ఆమె మనసులో చెప్పలేని అసంతృప్తీ. వెలితిగా ఉంది. ఎందుకో అతనిమీద కోపం వస్తున్నది. నాలుగేళ్ల కిందటి ప్రేమలాలస ఆమె హృదయాన్ని అగ్నిలా మండిస్తోంది. అతను కనిపించటంవల్ల మానని గాయం మరింత రేగుతోంది. ఆనాటి దృశ్యాలే దుమ్ము తుడిచిన అద్దంలా మరింత స్పష్టంగా కన్పిస్తున్నాయి.

    సుజాతది చీరాల దగ్గర ఒక పల్లె. తండ్రి కరణం కావటాన నలుగురికీ ఆ కుటుంబం అంటే మర్యాదా మన్నన ఉన్నాయి. నలుగురు అన్నల తర్వాత ఆడపిల్లయిన ఆమెని తండ్రి ఎంతో గారాబం చేశాడు. ఎలాగో పదోతరగతి గట్టెక్కించిన సుజాతకి ఇంక చదవాలన్న కోరికేలేదు.

    "ఎంత చదువుకున్నా ఏం లాభం! ఓ అయ్య చేతిలో పెట్టాల్సిందేగా" అనే తల్లి మాటలు బాగా జీర్ణం చేసుకుంది సుజాత.

    ఆ "ఓ అయ్య కోసం" సుజాత కన్నెమనసు ఊహల రెక్కలు విప్పుకుని తరచుగా కలలలోకంలోకి ప్రయాణం చేస్తుండేది. ఆ అమ్మాయి చూసిన సినిమాల్లో హీరోలాంటి భర్తకోసం ఈస్ట్ మన్ కలలు కంటుండడమే వ్యాపకంగా మారింది. వెన్నలాంటి కన్నెమనసును కరిగించే నిప్పులా అశోక్ పరిచయం అయ్యాడు.

    అశోక్ ఆ వూరివాడే అయినా చదువుకోసం చిన్నప్పటినుంచీ మేనమామ ఇంట్లో పెరగటం వల్ల ఊళ్ళో ఎవ్వరికీ అతనితో పరిచయం కాలేదు. ఇంజనీరింగ్ చదువు పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉంటూ ఓసారి తన అన్నగారిని చూడాలని పల్లెకు వచ్చిన అశోక్ మంచినీళ్ళ బావిదగ్గర సుజాత అందాన్ని చూసి అప్రయత్నంగా మనసు పారేసుకున్నాడు.

    రోజూ బావిదగ్గర ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నట్లు నటిస్తూ గమనించేది సుజాతనే! అతను తననే చూస్తున్నాడనీ తన గురించే మాట్లాడుతున్నాడనీ అర్ధమవుతున్నకొద్దీ ఆమె అడుగులు తడబడుతున్నాయి. గుండె లయ పెరుగుతోంది. కళ్ళెత్తి చూడాలంటే బిడియం తెరలు దించుతోంది.

    ఆరోజు బావి దగ్గర ఖాళీలేక కాసేపు పక్కగా నిలబడి ఎదురుచూస్తోంది సుజాత. ఉన్న నాలుగు గిలకలమీదా నీళ్ళు తోడుకుంటున్నారు. సుజాత ఇవతలే నిలబడి ఉందిగానీ... ఆమె వెనుక వచ్చిన వాళ్ళు కూడా చొరవగా తాడు అందుకొని నీళ్ళు నింపుకెళ్తున్నారు. పరధ్యానంగా ఉన్న సుజాత అలాగే నిలబడటం చూసి అశోక్ నవ్వుకున్నాడు.

    "మీరిలా ఎంతసేపు నిలబడ్డా మా ఆదిలక్ష్మత్తయ్య తాడు అందించదు... రండి... నేను తోడిస్తాను."

    అశోక్ మాటలకు ఉలిక్కిపడి కొద్దిగా సిగ్గుపడింది. అశోక్ సుజాత బిందెను నీళ్ళతో నింపటం చూసి ఆడవాళ్ళంతా చోద్యంగా బుగ్గలు నొక్కుకున్నారు. కనీసం "థ్యాంక్స్" కూడా చెప్పకుండా విశాలనేత్రాలతో ఓసారి చూసి వెళ్ళిపోయే ఆమెని ఆరాధనగా చూశాడతను.

    ఆ కళ్ళు అతని కలల లోగిళ్ళయినాయి.

    క్రమంగా సుజాత ఆలోచనల్లో కూడా అశోక్ చోటు చేసుకుంటున్నాడు. అతని మాట, చొరవ, ప్రేమ, అనురాగం ఆమెని వివశురాల్ని చేస్తోంది.

    సుజాత మంచినీళ్ళకోసం వెళ్ళినప్పుడల్లా ఆలస్యంగా తిరిగిరావటం తల్లికి అనుమానం కలిగించింది. సదాచార కుటుంబం కాబట్టి నీళ్ళు స్వయంగానే తెచ్చుకోకతప్పదు. తాను అనారోగ్యవంతురాలు కాబట్టి కూతుర్ని పంపకా తప్పటం లేదు.

    "నీ పెద్ద జడ వల్ల పువ్వుకే అందం" మందారపువ్వు అందించాడు.

    "నీ విశాలనేత్రాల్లో నీ నీడ చూసుకోనీ" కళ్ళల్లోకి సూటిగా చూశాడు.

    "నీ అరచేతి రేఖలు నా అరచేతి రేఖలకు జతపడినాయో లేదో చూడనీ" పాణిగ్రహణం చేశాడు.

    బావిదగ్గర పూలతోట ప్రేమోద్యానం అయింది. కలల కౌగిలిలో కాలం బందీ అయింది.

    పల్లెల్లో ఇలాంటివి ఎన్నాళ్ళు దాగుతాయి! కరణంగారు అగ్గిమీద గుగ్గిలమై పోయాడు.

    "ఇంటి పరువు తీస్తావా..." అని జుట్టుపట్టి, లాక్కెళ్ళి గదిలో పడేసి దాదాపు బందీని చేశాడు.

    తాను చూసిన సినిమాల్లో హీరోయిన్ లా అశోక్ తో లేచిపోయి పెళ్ళి చేసుకోవాలని ఆశపడ్డ సుజాత అతడు వూరిని విడిచిపోయాడని విని నిరాశతో నీరుగారిపోయింది.

    పది రోజుల్లోనే పక్కవూళ్ళో బడిపంతులు బసవయ్యకు రెండో భార్యగా ఆ ఇంట్లో అడుగుపెట్టిన సుజాత ప్రాణంలేని బొమ్మలా యాంత్రికంగా మారిపోయింది. ఆమె దృష్టిలో అశోక్ మోసగాడుగా పిరికివాడిగా మిగిలిపోయాడు.

    తొలిప్రేమలోని మాధుర్యాన్ని రుచి చూపించిన అశోక్ మళ్ళీ జీవితంలో కన్పిస్తాడని సుజాహ ఊహించలేదు. బసవయ్యగారి భార్యగా బాధ్యతలు ,బాధలు తప్ప అనుభూతులు, ఆనందాలు లేని జీవితంలో అనుకోకుండా అశోక్ కనపడడం ఆమె మనసును అల్లకల్లోలం చేసింది.

    చీరాల్లో బస్ ఆగిన కుదుపుకు ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తేరుకుంది సుజాత.

    బస్ దిగి నిలుచుంది. అతనూ దిగాక ఆమె దగ్గరికి వచ్చాడు.

    "ఏం పనిమీద వచ్చారు" కొంగు భుజాల చుట్టూ కప్పుకొని సంచీ చేత్తో పట్టుకుంది. ముందుకు అడుగేయబోతూ ఆగిపోయి అడిగింది.

    "ఆఫీసు పనిమీద... ఇక్కడికి దగ్గర్లో పల్లెల్లో..." ఊరిపేరు చెప్పాడు.

    "అరె.. అది మా వూరే.." ఆనందం, బాధ ఆమె స్వరంలో మెలికలు తిరిగాయి.

    "అలాగా.. ఆటోలో వెళదాం" ఆటోకేసి నడిచాడు.. ఆమె అతన్ని అనుసరించింది.

    ఇద్దరూ ఊళ్ళోకి అడుగుపెట్టారు.

    భర్త ఏమనుకుంటాడో! అశోక్ తన కాపురం కూలుస్తాడా... ఇన్నేళ్ళ తర్వాత ఈ కలయిక దేనికి దారితీస్తుందో...

    ఆలోచనల్లోనే ఇల్లు వచ్చేసింది.

    బసవయ్యగారు ఇంటి అరుగుమీదే కూర్చొని చుట్ట కలుస్తున్నాడు. అతడ్ని తన భర్తగా అశోక్ కి పరిచయం చేయాలంటే సిగ్గుగా ఉంది. కానీ తప్పదు...

    పరిచయాలయినాక... 'కూర్చోండి.. కాఫీ తెస్తాను' ఇంట్లోకి వెళ్ళింది సుజాత.

    వాళ్ళిద్దరూ ఏవేవో సంగతులు మాట్లాడుకుంటున్నారు. చదువు, ఉద్యోగం, పిల్లలు... లోపల్నుంచే ఆసక్తిగా వింటోంది.

    "నాకు చిన్నప్పుడే మా మామయ్య కూతురితో పెళ్ళయిందండీ! ఇంజనీరింగ్ చదివించిందీ ఆయనే! ఉద్యోగం వచ్చి సెటిలయ్యాక ఫామిలీ పెట్టాను హైద్రాబాదులో" ఆ మాటలు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి.

    ఎంతమోసం... తననో పావుగా వాడుకున్నాడు. అతని వల్లనే తొందరపడి నాన్న ఈ రెండో సంబంధం చేశాడు. కళ్ళల్లో నీళ్ళు కాఫీ గ్లాసులో పడుతుంటే తలతిప్పుకుంది. మౌనంగా కాఫీ గ్లాసు బల్లమీద పెట్టి లోపలికి వచ్చేసింది.

    "మీరు పని అయినాక భోజనానికి మా యింటికే రండి" అమాయకపు బసవయ్య ఆహ్వానం అది.!

    "వద్దండీ! శ్రమ ఎందుకు... నేను ఒక గంటలోనే వెళ్ళిపోతాను. సుజాతగార్కి థ్యాంక్స్ చెప్పండి.."

    "మంచిదండీ! ఇటువైపొస్తే మా యింటికి తప్పక రండి. వాళ్ళ ఊరివాళ్ళు కనిపిస్తే సుజాతకెంతో ఆనందం."

    అశోక్ వెళ్తేగానీ బైటికి రాలేదు సుజాత.

    "అతగాడేమనుకుంటాడు.. కనీసం భోజనం చేసిపొమ్మని చెప్పొచ్చుగదా! మర్యాదకైనా అనవు" బసవయ్య మందలింపుగా అన్నాడు.

    "మరేం ఫర్వాలేదు... అలాంటి వాళ్ళకిదే మర్యాద.. మీరు లోపలికి రండి.. గాలి చల్లగా ఉంది.." భర్త చేయి పట్టి లోపలికి తీసుకెళ్ళింది సుజాత.

    పెళ్ళయ్యాక తొలిసారిగా ప్రేమగా మాట్లాడిన భార్య స్పర్శకు బసవయ్య వళ్ళు పులకరించింది.

    తాను వచ్చిన పనిని పూర్తి చేసుకున్న తృప్తితో వెనక్కి తిరిగి వెళుతున్న అశోక్ బలహీనహృదయంలో తట్టుకోలేనంత సంతోషం! టప్ మని ఓ చుక్కరాలింది. తలెత్తి చూశాడు.. ఆకాశం నిండా... ఆకాశమంతటి నల్లమబ్బు... విధి వేరుచేసినా సుజాతను మర్చిపోలేని దురదృష్టవంతుడు. ఉద్యోగం ఇంటర్వ్యూకి పిలుపు వచ్చి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఆమె పరాయిదై పోయింది. ఆమెను మరువలేక అవివాహితుడుగా మిగిలిపోయినా.. సుజాత తల్లిద్వారా ఆమె దాంపత్యజీవితం సరిగా లేదని విని.. ఆమె సుఖం కోరి.. అసంతృప్తితో రగిలే ఆమె మనసు మారటానికే ఆమె మేలుగోరి అలా విషయాన్ని మార్చి చెప్పాడని సుజాతకి ఎవరూ చెప్పే అవకాశం లేదన్న నమ్మకంతో సాగిపోతున్నాడతను.

    వానజల్లు మొదలయింది. వాన కురిపించి జగత్తుకు మేలుచేసి, తేలికపడిన మనసుతో తేలిపోతుందా తెల్లమబ్బు అతనిలాగే!