TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
ఆంటీ... ఆంటీ
- శారదఅశోకవర్ధన్
అశ్విన్ చెప్పిన వార్త విని శుభాంగి కుప్పలా కూలిపోయింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
"ఎప్పటికీ ఇవే గొడవలా? ఇది మూడోసారి మన పెళ్ళయ్యాక." విసుక్కుంది.
అశ్విన్ నవ్వుతూ శుభాంగి రెండు భుజాలూ పట్టుకుని "అదేమిటోయ్, అలా దిగులు పడిపోతూ దిగాలుపడి కూర్చున్నావ్? నువ్వే నా మొగుడివై, నేనే నీ పెళ్ళాన్నయితే, ఇటువంటి వార్త తెచ్చిన మొగుణ్ణి గట్టిగా బాహువుల్లో బంధించేసి, పెదాలతో నోటికి తాళం వేసేదాన్ని. కానీ కేసు రివర్సయిందే. పోనీ, ఆ పని నేను చెయ్యనా?" అంటూ సోఫాలో కూర్చున్న శుభాంగిని లేపి నుంచోపెట్టి నడుం చుట్టూ చేతులు వేసి చుట్టేశాడు.
"ఏయ్ అశ్విన్! నువ్వు మరీ చిన్నపిల్లాడివై పోతున్నావ్ రోజు రోజుకీ. వదులు" అంటూ అతని చేతులు విడిపించుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంది.
"అమ్మగారు కోపంలో కాఫీ కూడా ఇవ్వరన్నమాట!" శుభాంగి ముక్కు లాగుతూ అన్నాడు అశ్విన్.
శుభాంగి గబుక్కున లేచి వెళ్ళింది వంటింట్లోకి. రెండు కప్పుల్లో కాఫీతో ప్రత్యక్షమయింది రెండు నిమిషాల్లో. కాఫీ సిప్ చేస్తూ, "వండర్ ఫుల్" అన్నాడు కాఫీని మెచ్చుకుంటూ.
"అది సరే, ఏ ఊరు?" అడిగింది శుభాంగి.
"మద్రాసు."
"ఊ.... మళ్ళీ ఇంటివేట ప్రారంభం. అదీ, పిల్లలకి స్కూల్లో సీట్ల గురించి యుద్ధం చెయ్యాలి" అంది విసుక్కుంటూ.
"మైడియర్ శుభా! ఒక్కొక్క ఊరూ చూసే అవకాశం ఎంతమందికుంటుంది చెప్పు? పాపం, ప్రభుత్వం కొంతమంది ఉద్యోగస్తులకి ఈ ట్రాన్స్ ఫర్లు పెట్టి, ఇలా ఊళ్ళు చూసే అవకాశాలు కలిగిస్తూ ఉంటే సంతోషించాల్సిందిపోయి బాధపడిపోతే ఎట్లా?" కాఫీ కప్పు కింద పెడుతూ అన్నాడు అశ్విన్.
అశ్విన్ ఒక బ్యాంకు ఆఫీసర్. హోదా పెరుగుతూన్నకొద్దీ రెండేళ్ళకో, మూడేళ్ళకో ఈ బదిలీలు తప్పవు ఈ ఉద్యోగాల్లో.
"ఎప్పటికి వెళ్ళాలి?" అడిగింది శుభాంగి.
"ఒక వారం రోజుల్లో."
"మరి పిల్లల స్కూలో?"
"మూడూ, నాలుగు తరగతులేగా! అప్పుడే మా ఫ్రెండుకి ఫోన్ చేసి చెప్పేశాను. మద్రాసులో సీట్ల ఏర్పాట్లు, ఇంటి ఏర్పాటూ జరిగిపోతున్నాయి. రాత్రికి మా స్టాఫంతా డిన్నరుకి పిల్చారు. హోటల్ సిద్ధార్దకి, పిల్లలతో సహా రమ్మన్నారు. చక్కగా ముస్తాబవ్వు." శుభాంగి గడ్డం పట్టుకుని తలపైకెత్తి కళ్ళలోకి చిలిపిగా చూస్తూ అన్నాడు అశ్విన్.
ఆ చూపుల్లోని మత్తూ, మమతా, చిలిపితనం శుభాంగిని పిచ్చిదాన్ని చేస్తాయి. అతని ఉంగరాల జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి తల నిమురుతూ ఆనందిస్తుంది. వక్షస్థలం మీద గుబురుగా పెరిగిన జుట్టుతో ఆడుకుంటుంది. ప్రస్తుతం ఏమీచేయలేక రెండు చేతులతోటీ అతని జుట్టు పీకింది ప్రేమగా.
వారం రోజులూ పార్టీలతోటీ, పంక్షన్లతోటీ, వచ్చేపోయే స్నేహితులూ, బంధువులతోటీ గడిచిపోయాయి. సామాన్లన్నీ సర్దుకోవడం అంతా పూర్తయింది. మద్రాసు టి. నగర్ లో ఇల్లు చూసి పెట్టినట్టు, పిల్లలకి అక్కడే స్కూల్లో సీట్లు కూడా ఏర్పాటు చేసినట్టూ మద్రాసు నుంచి వైద్యనాధన్ ఫోన్ చేసి చెప్పాడు.
ఇంత తొందరగా ఇల్లు దొరకడం, పిల్లలకి సీట్లు దొరకడం అన్నీ సవ్యంగా జరిగిపోయినందుకు సంతోషంతో తేలిపోయారు శుభాంగీ, అశ్విన్.
శుభాంగి గొడవల్లా ఒక్కటే - కొత్తచోటు కెళ్ళాక, కొన్నాళ్ళ వరకూ కొత్తకొత్తగా ఉండి తోచకపోవడం; కాస్త ఇరుగూ పొరుగుతో స్నేహం ఏర్పడిందీ అనుకునేసరికి మళ్ళీ ట్రాన్స్ ఫర్ అయి, పరిస్థితి మొదటికి రావడం; పైగా ఎమ్.ఏ. వరకూ చదువుకున్నందుకు ఏదైనా ఉద్యోగం చేస్తే కాస్త కాలక్షేపంగా ఉంటుంది కదా అనుకుంటే, ఇంట్లో ఎవరూ పెద్దవాళ్ళు లేకపోవడం వల్ల, పిల్లలని వదిలిపెట్టి ఉద్యోగాలకు వెళ్ళడం ఇష్టం లేక, ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది - అనుకుంటూ ఉండగానే మద్రాసుకి వెళ్ళే రోజు రానే వచ్చింది.
* * *
కొత్త వాతావరణం, కొత్త మనుషులూ, కొత్త భాష చిరాగ్గా అనిపించింది శుభాంగికి. అశ్విన్ కి ఆ బాధ లేదు. బ్యాంకు కెళ్ళగానే బోలెడంతమంది తెలిసిన వాళ్ళూ, కొలీగ్స్, చేతినిండా పనీ ఉండడం వల్ల బోరు కొట్టడం అనేది తెలీదు. అసలు ఆ ప్రశ్నే అతనికి రాదు. అపర్ణా, ఆదిత్యలకి కూడా పెద్ద సమస్యలుండవు, కొంచెం కొత్త వాతావరణం అనే బాధ తప్ప. తొందరలోనే అందరితో కలిసిపోతారు. ఎటొచ్చి సమస్యల్లా శుభాంగిదే.
టీ. నగర్ లో వైద్యరామా స్ట్రీట్ లో. సుందరంగారింట్లో ఒక అవుట్ హౌస్ లో అద్దెకి దొరికింది, శుభాంగి వాళ్ళకి. ఆ వీధిలో ఇరుగు పొరుగూ ఇద్దరూ తెలుగువాళ్ళే. రాఘవేందర్ రావూ, మురళీమోహన్. రాఘవేందర్ రావుగారు ఇంగ్లీషు లెక్చరర్. మురళీమోహన్ ఏ.జి. ఆఫీసులో అక్కౌంట్స్ ఆఫీసరు. వారి భార్యామణులు రేవతీ, నివేదితా. రేవతికి నలుగురు పిల్లలు - ఇద్దరు కొడుకులూ, ఇద్దరు కూతుళ్ళూ, నివేదితకి ముగ్గురు కూతుళ్ళూ, ఇద్దరు కొడుకులూ. ఇంటివాళ్ళు సుందరంగారూ, అతని భార్య సీతారాణి; వాళ్ళకి ఇద్దరు కొడుకులు.
ఇంట్లో దిగిన రెండు మూడు రోజులకే ఓ రోజు సీతారాణి కూరలు కొంటూ బయట కనపడేసరికి, శుభాంగి ఆమెని చూసి స్నేహపూర్వకంగా నవ్వి, ఆమెతో స్నేహం కలుపుకోవాలని చెప్పి, తన కప్పుడు కూరలు అవసరం లేకపోయినా, కూరల బుట్టా, డబ్బూ పట్టుకొచ్చి, "టమాటాలు ఎట్లా ఇస్తున్నాడూ?" అని అడిగింది.
"నాలుగు రూపాయలు." తల తిప్పుకుని, కూరలవాడికి డబ్బిచ్చేసి వెళ్ళిపోయింది ఆమె. శుభాంగి మనసు చివుక్కుమంది. ఆలోచిస్తూ నుంచున్న శుభాంగిని "ఎన్నవేణుం?" అంటూ అడిగాడు కూరలవాడు. చేసేది లేక "టమాటో అరకిలో ఇవ్వు" అని టమాటాలు తీసుకుని లోపలి కొచ్చేసింది శుభాంగి. అప్పటినుంచీ ఆమె ఇక సీతారాణితో మాట్లాడే ప్రయత్నం చెయ్యలేదు. సీతారాణి కూడా మళ్ళీ ఆమెని పలకరించలేదు.
ఓ వారం రోజులు పోయాక, ఒకనాడు అపర్ణకి, ఆదిత్యకి యూనిఫారం బట్టలూ, పుస్తకాలు కొనడానికి బజారుకి బయలుదేరుతూన్న శుభాంగి ఆటో కోసం వీధి గడప దగ్గర నుంచుంది. వాళ్ళింటి ఎడమవైపున ఉండే పక్కింటి రేవతి శుభాంగిని చూసి నవ్వీ నవ్వనట్టు నవ్వింది. శుభాంగి తిరిగి చిరునవ్వు నవ్వింది.
"మీవారేం పనిచేస్తారు?" మొట్టమొదటి ప్రశ్న రేవతి అడిగింది.
"బ్యాంకులో మేనేజర్"
"ఏ బ్యాంకులో?"
"సిండికేట్ బ్యాంకు."
"ఎక్కడి కెళుతున్నారు?"
"పిల్లలకి యూనిఫారమ్ బట్టలూ, పుస్తకాలూ కొనడానికి." ఈలోగా ఆటో దొరకడంతో - "ఎప్పుడైనా రండి ఇంటికి" అంది శుభాంగి.
"ఆ... నాకెక్కడ తీరుతుంది? పగలల్లా ఆఫీసు పని. చదువుకుంటే ఊరికే కూర్చోక ఉద్యోగం చెయ్యాలనిపిస్తుంది. ఉద్యోగం చేస్తే ఎక్కడికీ వెళ్ళడానికుండదు, లేకపోతే హాయిగా మీలాగా.... మీకు తెలీదు ఆ గొడవ, అసలు చదువుకోకుండా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది ఒక్కొక్కసారి."
శుభాంగికి షాక్ కొట్టింది. ఎమ్.ఏ. ఫస్టు క్లాసులో ప్యాసయింది. పెళ్ళికి పూర్వం ఒక పత్రిక ఆఫీసులో సబ్ -ఎడిటర్ గా పనిచేసేది. పిల్లలు పుట్టాకే పిల్లల సంరక్షణ స్వయంగా తనే చేసుకోవాలని, ఇంటినీ, పిల్లల్నీ ఆయాల మీద వదిలిపెట్టడం ఇష్టంలేక తనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. ఇప్పటికీ తన పేరు మీద వివిధ పత్రికల్లో వ్యాసాలూ వస్తూ ఉంటాయి. ఎంత తేలిగ్గా అనేసింది మాటలు అనుకుంటూ "మీరేం చదివారూ? ఏం ఉద్యోగం చేస్తున్నారూ?" అని అడిగింది.
"బి.ఏ చదివాను. రెవిన్యూ బోర్డు ఆఫీసులో టైపిస్టుగా పనిచేస్తున్నాను" అంది.
అంతలో ఆటోవాడి తొందర. ఆటో కదలడంతో సంభాషణ ముగిసింది.
ఆ తరువాత కొన్నాళ్ళకి తను రాసిన ఆర్టికల్ ఒకదాన్ని అక్కడి వారపత్రిక ఆఫీసులో ఇచ్చొద్దామని బయలుదేరుతున్న శుభాంగికి బస్సు స్టాపులో తమ ఇంటికి కుడివైపున ఉండే నివేదిత కనిపించింది. శుభాంగిని చూసి స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వింది. "మీరీ ఊరు కొత్తగా వచ్చారా?" అడిగింది నివేదిత.
"అవునండీ!" అంది ముక్తసరిగా శుభాంగి.
రెండు మూడుసార్లు మిమ్మల్ని చూసి పలకరిద్దామనుకున్నాను. మళ్ళీ ఏమనుకుంటారో అని ఊరుకున్నాను" అంది నివేదిత.
"అదేమిటండీ! అనుకోవడాని కేముంది? మాట్లాడుకుంటేనే కదా ఒకరికొకరు తెలిసేది?"
"మీ రెందాకా వెళుతున్నారు?" అడిగింది నివేదిత.
"న్యూస్ పేపర్ ఆఫీసుకి - మాంబళంలోనే!"
"ఆటోలో వెళదాం రండి. నేనూ అటే వెళ్ళాలి ఇంచుమించు. మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు" అంది నివేదిత.
ఆటో మాట్లాడుకున్నారు ఇద్దరూ.
"న్యూస్ పేపర్ ఆఫీసులో ఏం పని?"
"నా ఆర్టికల్ ఇచ్చి రావాలి."
"మీరు రాస్తారా?"
"అవును."
"ఏ పేరుతో రాస్తారూ?"
"శుభాంగి!"
"ఓ-శుభాంగి అంటే మీరేనా? బాగా రాస్తారు. మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది." ఇలా సాగింది వాళ్ళ సంభాషణ. పత్రిక ఆఫీసు రాగానే శుభాంగి ఆటోను ఆపించింది. ఆటోకి డబ్బిస్తూ ఉంటే నివేదిత ఇవ్వనివ్వలేదు. థాంక్స్ చెప్పి "ఎప్పుడైనా ఇంటికి రండి" అని చెప్పి దిగిపోయింది శుభాంగి.
ఒక రోజు సాయంత్రం నివేదిత పిల్ల లొచ్చారు. "ఆంటీ! అమ్మ ఇవి మీకు ఇచ్చి రమ్మంది. మా ఇంట్లో పూశాయి" అంటూ కనకాంబరాలు అందించింది నివేదిత కూతురు నీలిమ. ఆ అమ్మాయికి అప్పుడే ఇంట్లో తయారుచేసిన మైసూరుపాకు ముక్కలు కొన్ని పొట్లాం కట్టి "అమ్మ కివ్వు" అని ఇచ్చింది శుభాంగి. కాస్సేపు నీలిమ అపర్ణ, అపూర్వలతో ఆదుకుని, వీడియో చూసి మైసూరుపాకు తీసుకుని ఇంటికెళ్ళింది. అప్పటినుంచీ రోజూ నీలిమా, వాళ్ళ చెల్లెలు నిరుపమా అందరూ 'ఆంటీ....ఆంటీ' అంటూ వచ్చి కబుర్లు చెప్పడం, ఒకరి రెండుసార్లు నివేదిత కూడా వచ్చి వెళ్ళడంతో, శుభాంగి కూడా అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేది నివేదిత ఇంటికి. ఇద్దరూ కలిసి ఒకటి రెండు సినిమాలు కూడా చూశారు నివేదిత బలవంతం మీద.
శుభాంగి కిప్పుడు కాస్త కాలక్షేపంగా ఉంది. అయితే, ఒక చిక్కొచ్చి పడింది. నివేదిత పిల్లల్ని చూసి రేవతీ, ఆవిడ పిల్లలు అందరూ రావడం మొదలెట్టారు. రేవతి కూడా నివేదిత ద్వారా శుభాంగి ఎమ్.ఏ. ఫస్టు క్లాసనీ, ఆర్టికల్స్ రాస్తుందనీ విని, స్నేహం మొదలెట్టింది. వీరిద్దరినీ చూసి సీతారాణి రావడం మొదలెట్టింది. నివేదితతో శుభాంగి సినిమా కెళ్ళిందని తెలిసి రేవతీ, సీతారాణీ కూడా శుభాంగిని సినిమాకి ఆహ్వానించారు. ఒకరితో వెళ్ళి ఒకరితో వెళ్ళకపోతే ఏం గొడవ లొస్తాయోనని, చచ్చినట్టు వెళ్ళుతోంది శుభాంగి. ఇప్పుడు ఆ మూడు కుటుంబాల వారికీ శుభాంగి ఆంటీయే! పిల్లా పెద్దా అందరూ 'ఆంటీ' అనే పిలుస్తారు. ఇప్పుడు ఆంటీకి వి.ఐ.పి. ట్రీట్ మెంటు పొద్దున్న ఒకరొస్తే, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరూ. వీరి పోటీ స్నేహాలతో సతమతమైపోతుంది.
ఒక రోజు అందరూ ఒక పేరంటంలో కలుసుకున్నారు. "ఆంటీ అచ్చు వాణిశ్రీలా ఉంటుంది కదూ?" అంది నివేదిత.
"ఏమో! నాకు వాణిశ్రీ కన్నా ఆంటీయే బావుంటుందనిపిస్తుంది" అంది రేవతి.
"నాకు హిందీ ఆర్టిస్టు షబానా అజ్మీలా అనిపిస్తుంది ఆంటీ" అంది సీతారాణి.
వీళ్ళ మాటలకి నవ్వాలో ఏడవాలో అర్ధం కాక తలొంచుకుంది శుభాంగి. ఈ మూడు కుటుంబాలవారూ ఏదో తెచ్చి పెట్టుకున్న ప్రత్యేకతతో ప్రేమ ఒలకబోస్తూ ఉంటే చిరాగ్గా అనిపించింది. కానీ ఏం చేస్తుంది? వీళ్ళ వల్ల ఈ మధ్య అశ్విన్ తో కూడా సరిగ్గా మాట్లాడడానికీ, అశ్విన్ తో కలిసి సినిమాకి వెళ్ళడానికి కూడా లేకుండా పోయింది.
ఒక రోజున నివేదిత అడిగిన ప్రశ్నకి నివ్వెరపోయింది శుభాంగి. "మీకు నేనిష్టమా, రేవతీ, సీతారాణీ ఇష్టమా?" అని. భార్య భర్తనో, భర్త భార్యనో ఇలా అడిగితే చెప్పలేను కానీ వీళ్ళు ఇలా అడగడం ఏమిటో అర్ధం కాక పిచ్చిదానిలా చూసింది శుభాంగి.
అంతలో మళ్ళీ నివేదితే అంది: "అసలు నేను మీతో స్నేహం చెయ్యడం చూసి వాళ్ళూ మొదలెట్టారు. లేకపోతే మీ రీ వూరొచ్చి ఇన్నాళ్ళయింది కదా, ఒక్కసారైనా వాళ్ళెవరైనా పలకరించారా? రేవతి మిమ్మల్ని చూసి మీరేమీ చదువుకోలేదనుకుంది. తనే పెద్ద ఉద్యోగం చేస్తూన్నానన్న గర్వం. మీరు ఎమ్.ఏ. చదివేరనీ, ఆర్టికల్స్ రాస్తారని తెలిశాక మీతో స్నేహం మొదలెట్టింది. సీతారాణి మాత్రం? మీ మొహం చూసేదా? వీళ్ళందరికీ నాతో పోటీ? వీళ్ళు ఏడ్చుకునేలా మనం సినిమాలకీ, షాపింగులకీ వెళ్ళాలి - ఏమంటారు?"
శుభాంగికి ఏ మనాలో తెలీక నవ్వి ఊరుకుంది. వీళ్ళ పోటీలతో మధ్య తను నలిగిపోతోంది. ఆదివారం వస్తే రేవతి సినిమాకి రమ్మంటుంది. "వెళ్ళు, రాను అంటే బావుండదు" అనేవాడు అశ్విన్. మిగతా రోజుల్లో, ఒకసారి నివేదితా, మరోసారి సీతారాణి. శుభాంగికి మతిపోతోంది.
ఆ రోజు రాత్రి అశ్విన్ ని అడిగింది - "ఏమండీ! మనకి మళ్ళీ ట్రాన్స్ ఫర్ ఎప్పుడవుతుంది?" అని. ఈ ప్రశ్నకి అశ్విన్ ఆశ్చర్యబోయాడు.
"ట్రాన్స్ ఫర్ అంటే కంట తడిపెట్టే నువ్వు....నువ్వేనా అడుగుతున్నది?" అంటూ.
శుభాంగి కళ్ళలో నీళ్ళు నిండాయి. "అశ్విన్! కనీసం మనం ఈ ఇల్లైనా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి" అంది బాధగా.
"ఏమీ? ఇరుగు పొరుగూ అంటూ గోల పెట్టే నువ్వు ఇలా అంటున్నావేంటి? సినిమాలూ, షాపింగులూ - బాగానే ఉంది కదా?" శుభాంగి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు, చెంపలమీదుగా జారుతున్న కన్నీళ్ళు తుడుస్తూ అశ్విన్.
"ఇరుగూ పొరుగూ అంటే ఒకరి నొకరు సాయపడుతూ ఉండాలి కానీ ఇబ్బంది కలిగించేవారిలా ఉండకూడదు, అశ్విన్! వీళ్ళ పోటీల వల్ల, కృత్రిమ ప్రేమతో నన్ను కట్టిపడేస్తున్నారు. ఈ గోలలో నాకు మనశ్శాంతితో రాసుకోవాలన్నా, పని చేసుకోవాలన్నా కుదరడంలేదు పైగా, నేను మీతో కన్నా వాళ్ళతోనే ఎక్కువ కాలం గడుపుతున్నట్లుగా ఫీలవుతున్నాను. అశ్విన్! ప్లీజ్, ఇల్లు మార్చేద్దాం" అంటూ అతని గుండెలమీద తలపెట్టి, పసిపాపలా ఏడ్చింది.
వారం తిరక్కుండా ఇల్లు మారిపోయారు.
"ఆంటీ, మీ అడ్ర సివ్వండి వస్తాను" అంది నివేదిత.
"అవును. డైరీలో రాసుకుంటాను చెప్పండి ఆంటీ!" అంది రేవతి.
"నేనూ వస్తాను ఆంటీ! నాకూ చెప్పండి" అంది సీతారాణి.
అశ్విన్ పక పకా నవ్వుతున్నాడు. కళ్ళ నీళ్ళ పర్యంత మవుతూన్న శుభాంగిని చూసి.
"ఎందుకలా నవ్వుతున్నారు?" కోపంగా అడిగింది శుభాంగి.
"ఈ ఆంటీని చూస్తూ ఉంటే! నీ కన్నా పెద్దవాళ్ళు నిన్ను అలా పిలుస్తూంటే అదేదో నీ పేరు లాగా, నాకూ ముచ్చటగా, అలాగే పిలవాలనిపించింది" అన్నాడు నవ్వుతూ.
శుభాంగి కోపంగా అతని జుట్టు పీకింది ఉడుక్కుంటూ. గుండెల మీద రెండు చేతులతో గుద్దింది సున్నితంగా కోపాన్ని ప్రదర్శిస్తూ.
"నా కంటికి నువ్వు వాణిశ్రీ షబానా అజ్మీలా కాదు - ఎలిజిబెత్ టేలర్ లా ఉన్నావు ఆంటీ!" అంటూ నవ్వుతూ ఆమెని తన రెండు చేతుల్లోనూ బంధించి, మాట్లాడకుండా పెదవులు బిగించేశాడు మృదువుగా, తన పెదవులతో. ఇరుగునీ పొరుగునీ మరచిపోయి, అతని భుజాలపైన వాలిపోయింది శుభాంగి నెలవంకను తెచ్చి తల్లో ముడుచుకున్నంత ఉత్సాహంతో అతని కౌగిలి ఒదిగిపోయింది. *
(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 7 - 12 - 88)