Facebook Twitter
నర్తకి

            నర్తకి

- శారదా అశోకవర్దన్


    వెలుగుల వాహినిలో కిరణాల కెరటాలపై  విహరిస్తూన్నట్టుగా పోతోంది మద్రాస్ ఎక్స్ ప్రెస్ హైద్రాబాద్ వైపు. కన్ను మూతపడడం లేదు. కునుకుపట్టని మనసు కుదురుగా నిలవలేకపోతోంది మంజరికి. ఆలోచనలు దాదాపు దశాబ్దం వెనక్కి వెళ్ళాయి. కాలేజీ చదువూ వాతావరణంలో హరిణి హృదయ ఫలకంపైన హీరోయిన్ లా నిలిచిపోయింది.

    ఎంత చక్కని రోజులు! కాలేజీ మొత్తంలో మంజరి, హరిణిల పేర్లు తెలియనివాళ్ళు లేరు. సంగీత సాహిత్య పోటీల్లో  మంజరిది ముందడుగయితే నాట్యంలో హరిణిది ప్రథమ పాదం! ఇరువురిదీ ఒకే రకమయిన ఆలోచన, ఒకే రకమైన ప్రవర్తన. కాలం ఐస్ లాగా కరిగిపోయింది. ఎంకాం., రిజల్ట్స్ రావడం, శ్రీరాంతో మంజరి పెళ్ళి జరిగిపోవడం, అంతా ఒకే షెడ్యూలులో పూర్తయిన సినిమాలా నెల రోజుల్లో జరిగిపోయింది. మంజరి శ్రీరాంతోపాటు  అమెరికా వెళ్ళిపోయింది. అయితే, విధి విచిత్రమేమోగానీ అమెరికా  ప్రయాణం ఒక వారం రోజులుందనగా హరిణికి గోకుల్ అనే ఇంజనీయర్ తో పెళ్ళి జరిగింది. హరిణికి కూడా తనతోపాటే  పెళ్ళవడం  మంజరికి  ఎంతో సంతోషాన్ని  కలిగించింది. "మంజరీ! నువ్వెళ్ళిపోతే, నాకు బోర్ కొడుతుందే. పోనీ ఇండియాలో ఎక్కడున్నా అప్పుడప్పుడు కలవడానికయినా కుదిరేది. ఏకంగా విదేశాల్లోనే  జెండా పెట్టేశావ్!" అనేది హరిణి. ప్రతీ విషయం హరిణి మంజరితో చెప్పికాని చేసేది కాదు. పై పెచ్చు ఇంట్లో ఏదైనా ఘర్షణ జరిగినా, ఒడుదుడుకులొచ్చినా  ప్రతి విషయం చర్చించుకుని  ఉపశమనం పొందేంత గొప్ప స్నేహం వారిది.

    హరిణి పెళ్ళి కూతురు. మంజరి అప్పుడే పెళ్ళయిన కొత్త పెళ్ళికూతురు. స్నేహితులందరూ  వీరి మీద ఒకటే జోక్స్. మంజరికి అమెరికాలోనే మోనిక పుట్టింది. మంజరీ వాళ్ళమ్మ రుక్మిణమ్మ పురుడు పొయ్యడానికి అమెరికా వెళ్ళింది.  మంజరికి కాన్పు చాలా కష్టమయింది. శ్రీరాం డాక్టరవడం వల్ల, మళ్ళీ కాన్పు కూడా మంజరికి కష్టమే కావొచ్చునని  గర్భం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే హరిణికి  మాత్రం మోనిక పుట్టినప్పుడే ఒక నెలముందుగా అనిరుద్ పుట్టాడు. మళ్ళీ సంవత్సరంన్నరకే సంయుక్త పుట్టింది. పిల్లలు పుట్టాక మంజరికీ, హరిణికి మధ్య  దూరం బాగానే పెరిగింది. మంజరి రాసిన ఉత్తరాలకి తీరికలేదని ఎప్పుడో గానీ సమాధానం రాయడం లేదు హరిణి. దాంతో మంజరి కూడా తగ్గించేసింది. అమెరికా నుంచి కాల్ చేసినప్పటికీ హరిణి  పొడిపొడిగా మాట్లాడడం మంజరికి బాధ కలిగించింది. అందుకే ఈ మధ్య కాల్స్ చెయ్యడం కూడా మానేసింది.

    ఆ మధ్యన తల్లి రాసిన ఉత్తరం  ద్వారా  హరిణి మళ్ళీ కడుపుతో వున్నట్టు తెలిసింది. ఇన్నాళ్ళ తరవాత - కాదు, ఇన్నేళ్ళ తరవాత హరిణిని ముగ్గురు పిల్లలకి తల్లిగా చూడబోతున్నందుకు హరిణి ఎలా వుందోనన్న  కుతూహలం  మంజరిలో ప్రబలిపోయింది. మోనికకి ఏడేళ్ళు. తనకే  కొంచెం ఒళ్ళొచ్చింది. శరీరంలోని వొంపుసొంపులలో  చాలా మార్పులొచ్చాయి! హరిణి ఎలా వుందో? సన్నగా పుల్లలా  వుండేది. అదీ దాని డాన్సు గొడవా ఇరవైనాలుగు గంటలూ - పెళ్ళయినా డాన్సు చెయ్యడానికి అభ్యంతరం చెప్పని వ్యక్తినే పెళ్ళి చేసుకుంటానని చెప్పుకునేది. అంతేకాదు, అటువంటి ఇంట్రస్టులేని వ్యక్తుల దగ్గరి నుంచి ఒచ్చిన సంబంధాలన్నీ  ఒదులుకుంది.

    గోకుల్ కి డాన్స్ గురించి  ఏమీ తెలీకపోయినా డాన్స్ చెయ్యడానికి అభ్యంతరం చెప్పనన్నాడట. అదే అస్సలు కారణం హరిణి అతణ్ణి చేసుకోవడానికి. అయితే, అది కేవలం పెళ్ళినాటి ప్రమాణాల్లా  మిగిలిపోయాయి. సంవత్సరంలోపే  హరిణికి గర్భం  రావడంతో, కాలిగజ్జెలను అటకెక్కించింది. హరిణికి  మానసికంగా అదొక దెబ్బ!

    చాలా రోజుల తరువాత  ప్రాణ స్నేహితురాలిని కలుసుకోబోతున్నందుకు  మంజరికి  ఎంతో సంతోషంగా ఉంది. చాలాకాలం తరువాత  స్వదేశానికి తిరిగి రావడం, పుట్టింటి ప్రయాణం, ఆ వూళ్లోనే ప్రాణ స్నేహితురాలు స్థిరపడి వుండడం.....మంజరిని ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్! ఏ తెల్లవారు ఝామునో నిద్రలోకి  జోగిపోయింది మంజరి.

    కళ్ళు తెరిచి చూసే సరికి చంద్రుడూ వెన్నెలా అంతా కలలాగా కరిగిపోయి, సూర్యుడూ, వేడీ పేరుకున్న ఆలోచనల్ని కరిగించి బద్దకాన్ని తొలగించాయి. మరో అయిదు నిమిషాల్లో సికింద్రాబాద్ స్టేషనొచ్చేస్తోందని కంపార్ట్ మెంటులో వాళ్లు, సూట్ కేసులు గబగబా సర్దేసి, సామాన్లన్నీ  వరుసగా డోర్ దగ్గర పెట్టేసి నుంచున్నారు. "ఇన్ని గంటలు కూర్చుని  ప్రయాణం చెయ్యగా లేనిది ఒక అయిదు పది నిమిషాలు దిగడానికి పడితే తొందరెందుకో!" తలుచుకుని నవ్వుకుంది మంజరి. నిద్రలో వున్న మోనికని లేపి తను కూడా సామాను సర్దేసింది. పెద్ద కూత కూసుకుంటూ  రైలు స్టేషన్లో ఆగింది. తమ్ముడు నిఖిల్, చెల్లెలు గౌతమీ స్టేషన్ కొచ్చారు. "బావగారేరీ?" అంది కంపార్ట్ మెంటు కలయజూస్తు గౌతమి. "అతనికేదో చిన్న పని తగిలింది. రేపటి ఫ్లైట్లో వొస్తారు." అంది నవ్వుతూ మంజరి. నిఖిల్ సామాన్లు చేరవేస్తున్నాడు. గౌతమి మోనికతో సంభాషణ ప్రారంభించింది. ఇరవై నిముషాల్లో కారు బంజారాహిల్స్ చేరుకుంది.

    భోజనాలు అయిన తరువాత ప్రశాంతంగా మాట్లాడాలని మంజరి హరిణికి ఫోన్ చేసింది. అసలు తనొస్తోందంటే పరుగెత్తుకు రాకపోయినా వెంటనే ఇంటికొస్తుంది అనుకుంది మంజరి. అందుకే రాగానే ఫోన్ చెయ్యకుండా  కాస్సేపాగింది. మధ్యాహ్మమైనా  రాకపోయేసరికి, ఫోన్ చేసింది మంజరి. "అమ్మగారు డాక్టరు దగ్గరికి వెళ్ళారు. ఒక గంటలో వొత్తారు" అని చెప్పింది పని మనిషి ముత్యాలు. "ఎందుకూ? ఎక్కడ?" అని అడిగేలోపునే అది ఫోన్ పెట్టేయడంతో ఇంక ఫోన్ ప్రయత్నం చెయ్యక సాయంత్రం వాళ్ళింటికే వెళ్ళాలనుకుంది.

    గౌతమీ, నిఖిల్, మొనికాతో, హరిణి పిల్లల కోసం తెచ్చిన బొమ్మలూ, హరిణి కోసం తెచ్చిన రెడ్ అండ్ గ్రీన్ షిఫాన్ చీరా, పెర్ ఫ్యూమ్స్, గోకుల్ కోసం తెచ్చిన లైటరూ అన్నీ తీసుకుని బయలుదేరింది మంజరి.

    మంజరి వరండాలోనే ఎదురుపడ్డ  హరిణిని చూసి గతుక్కుమంది. పెద్ద పొట్టా, వడలిపోయిన మొహం, నీరసంగా వున్న కళ్ళతో వయసు మళ్ళినదానిలా  వుంది హరిణి. అనిరుధ్, సంయుక్తలు వాళ్ళలో వాళ్ళు ఏదో ఆడుకుంటున్నారు. "ఏమే! అలా నిల్చుండిపోయావ్, నన్ను గుర్తుపట్టలేదా? అంత మారిపోయానా?  అవున్లే, నువ్వు మారలేదు మరి. పెళ్ళిరోజెలా వున్నావో ఇప్పుడూ  అలాగే వున్నావ్. ఏడేళ్ళ కూతురుందంటే  ఎవరన్నా నమ్ముతారా?" అంది మంజరిని తృప్తిగా చూస్తు హరిణి.

    హరిణి నవ్వులో కూడా అనందం కనిపించలేదు  మంజరికి. అదేదో తన కోసం  తెచ్చిపెట్టుకున్న  నవ్వులా ఉంది.

    "అవునే! నువ్వేమో అమ్మమ్మలా తయారయ్యావ్. నా క్లాస్ మేట్ ని నువ్వు అంటే మా మోనిక కూడా నమ్మదు. అయినా, హాయిగా ఒక మొగపిల్లడూ, ఒక ఆడపిల్లా వున్నారు కదా! ఇంకా ఎందుకే సంతానం? ఇద్దరూ ఎడ్యుకేటెడ్ కదా - ఆ మాత్రం తెలీదు?" అంది నవ్వుతూనే చురక తగిలిస్తూ  మంజరి.

    "హరిణీ! చిన్నప్పటి నుంచీ మన మధ్య ఏ రహస్యాలూ లేవు. మనసు విప్పి ఏవేవో మాట్లాడుకునేవాళ్ళం. పెళ్ళి మాత్ర మనని మార్చేసింది. ఎన్నోసార్లు నీకు అమెరికా  నుంచి కాల్ చేశాను. ప్రతీసారీ నువ్వు పొడిపొడిగా మాట్లాడేదానివి. అందుకే రానురాను ఫోను చెయ్యడం మానేశాను. నా ఫోన్లు నిన్ను ఇబ్బందుల్లో పెడ్తున్నాయేమోననే అనుమానం వొచ్చింది. ఒక్క విషయం చెప్పు. నువ్వు సంతోషంగా వున్నావా? గోకుల్ ఎలాంటివాడు? నిన్ను చూడగానే నాకెందుకో  ఈ సందేహాలన్నీ  వొచ్చాయి" అంది బాధగా అడుగుతూ మంజరి. హరిణి కళ్ళు నిండుకుండలయ్యాయి.

    చెంపల మీదుగా జారుతున్న కన్నీరు తుడుచుకుంటూ  మంజరికేసి చూసింది. ఆ చూపులు సూదుల్లా గుచ్చుకున్నాయి.

    ఆ చూపుల్లో జాలి, నిస్సహాయతా....మంజరి నోట మాట రాలేదు.

    "గోకుల్ ఒక రకమైన దుర్మార్గుడు. చదువుకున్నవాళ్ళంతా  మంచివాళ్ళని  మనం చిన్నప్పుడనుకునేవాళ్ళం. కానీ అది చాలా తప్పు. గోకుల్ ఉత్త డబ్బు మనిషి. పిల్లలు పుట్టక ముందు నాచేత ప్రోగ్రామ్స్ ఇప్పించింది కూడా కేవలం డబ్బు కోసమే. అయితే అలా కూడా వుండనీయకుండా చెయ్యడానికి కారణం అతనిలో ఉన్న అనుమాన పిశాచం. డాన్సు మాస్టరి దగ్గరి నుంచి ఆడియన్స్ లో వున్న మగ అనే ప్రతీవాణ్ణి అనుమానించేవాడు. నాతో ఏదో రంకు కట్టేవాడు. చివరకి ఎవరైనా  వొచ్చి, కంగ్రాట్యులేషన్స్ చెప్పినా అనుమానమే.  ఏదో ఒక వంక మీద నాన్నగారి దగ్గరి నుంచి డబ్బు తెమ్మనేవాడు. ఏం చేస్తాం? పాపం, నాన్న అడిగినంతా ఇచ్చేవారు. అదేబాగుందని నా చేత డాన్స్ ప్రోగ్రామ్స్ మాన్పించడానికి, చక్కని కారణం నేను తల్లిని కావడం. అనిరుధ్ పుట్టినప్పుడు చాలా సంతోషించాడు. వాణ్ణి ఇంజనీయర్ని  చేస్తే ఈ రోజుల్లో కనీసం రెండు మూడు లక్షల కట్నం వొస్తుందట. తనే చాలా చవకగా ఒచ్చేశాడట నాకు!"

    దుఃఖంతో హరిణి గొంతు బొంగురుపోయింది. ఆవేశం గొంతులో అడ్డుపడి మాట పెగలడం లేదు.

    మంజరి కళ్ళు   కూడా వర్షిస్తున్నాయి. "బ్రూట్!" అంది అప్రయత్నంగా. మంజరి కనుసైగల్ని అర్ధం చేసుకుని గౌతమి పిల్లలందరినీ  అవతలి గదిలోకి తీసుకెళ్ళి ఆడిస్తోంది.

    హరిణి మళ్ళీ చెప్పడం మొదలెట్టింది:

    "సంయుక్త పుట్టినప్పుడు అతడు పదకొండో రోజుదాకా దాని మొహం చూడలేదు. ఎందుకంటే, అనిరుధ్ వల్ల ఒచ్చేదంతా సంయక్తవల్ల పోతుందట!" చీర కొంగుతో  కళ్ళు తుడుచుకుంది.

    "మై గాడ్!" ఆశ్చర్యంతో అంది మంజరి.

    "ఇప్పుడు నా గర్భంలో వున్నది కవలలట. ఇద్దరూ మగాళ్ళు కావాలని రోజుకో వందసార్లు అంటూంటారు."

    "స్కాన్ చేశారా?"

    "ఆ...."

    "మగపిల్లలేనా?" కుతూహలంగా అడిగింది మంజరి.

    "సరిగా తెలీలేదట. బహుశ ఆడపిల్లలేమోనంది డాక్టరు."

    "గోకుల్ ఏమన్నాడు?" భయం చోటు చేసుకుంది మంజరి మొహంలో.

    "నా వైపు అసహ్యంగా చూసి, నన్ను ఇంటి దగ్గరైనా  దింపకుండా  ఎటో వెళ్ళిపోయాడు. నాకేదో భయంగా వుందే మంజరీ!" అంటూ పసిపాపలా ఏడ్చింది హరిణి. మంజరికి ఏం చెప్పాలో, ఎలా ఓదార్చాలో హరిణికి అర్ధం కాలేదు.

    "గోకుల్ అసలు మనిషా గొడ్డా? బిడ్డ మీద బిడ్డ- మగ బిడ్డను కని బిజినెస్ చేద్దామనుకుంటున్నాడా? కట్టుకున్న భార్య ఏ స్థితిలో వుందో, ఆమె మనసు గురించీ గానీ, శరీరం గురించిగానీ ఏ బాధ్యతా లేదుగానీ ,డబ్బు మీద మాత్రం మమకారం! అందుకు భార్య టార్ గెట్! ఇడియట్! ఆడపిల్లని అసహ్యించుకునే ఛండాలుడు! అసలు ఆడదే లేకపోతే తనెలా పుట్టేవాడట? అటువంటి త్రాష్టుడితో సంసారం చెయ్యడం వ్యభిచారంకన్న పాపం. విడాకులిచ్చేసి, హాయిగా నాట్య మయూరిగా బ్రతకొచ్చు. నీ బిడ్డల్ని నువ్వు పోషించుకోవచ్చు హరిణీ! ఏమైంది నీలోని ఆత్మస్థయిర్యం ధైర్యం?" టీ కలపడానికి లేస్తూన్న హరిణిని వారించి తనే కలపడం మొదలెట్టింది మంజరి.

    "మంజూ! చిన్నప్పుడు మనం మాట్లాడుకునే మాటలు ఆచరణలో పెట్టడం చాలా కష్టం. నేను విడాకులిస్తే పుట్టింటి వాళ్ళకి అవమానమని తమ్ముళ్లూ, మరదళ్లూ అంటున్నారని అమ్మా నాన్న నాకు నచ్చజెపుతూ  వొచ్చారు. నావల్ల వాళ్ళందరికీ మచ్చ ఒస్తుందట. అవి విన్నాక, నా బతుకుని ఇలాగే ఈడ్చదలుచుకున్నాను. నా భయమల్లా  నాకేమయినా అయితే కాన్పులో, గోకుల్ సంయుక్తని సరిగ్గా చూసుకోడు."

    "ఛ! అవేం మాటలు? నీకేమీ కాదులే! పిచ్చి పిచ్చి ఆలోచనలతో దిగులు పెట్టుకోకు." టీ కప్పుని హరిణికందిస్తూ అంది మంజరి.  

    ఇద్దరు స్నేహితుల్లోనూ  మదినిండా  గోకుల్ ని గురించిన  భయం. హరిణి భవిష్యత్తును గురించి బాధ, సంయుక్తని గురించిన  దిగులు. రకరకాల ఆలోచనలతో టీ తాగడం  పూర్తి చేశారు.

    "గోకుల్  ఒస్తాడేమో, అతణ్ణి కూడా చూసి, కాస్త హితబోధచేసి వెళదామనుకున్నాను. కానీ అతడి జాడలేదు" అంది మంజరి గడియారం చూసుకుని, ఎనిమిది దాటిందని లేస్తూ.

    ఇద్దరు మిత్రులూ విడలేక గడియారాన్నీ, చీకటినీ తిట్టుకుంటూ  విడిపోయారు. ఆ మర్నాడు పిల్లల్ని  తీసుకుని ఇంటికి రమ్మని ఆహ్వానించింది మంజరి. "గోకుల్ కి కూడా ఫోన్ చేసి చెప్తాలే" అంటూ  కారెక్కింది.

    ఉదయం  భానుడి నులివెచ్చని  కిరణాలు కిటికీలోంచి  చొచ్చుకుని శరీరాన్ని  తాకేవరకు  తెల్లారినట్టే తెలీలేదు. మంజరిని చూడగానే తల్లి రుక్మిణమ్మ  అదోలా అయిపోయింది. నిఖిల్ మౌనంగా  వున్నాడు. ఇద్దరూ అలా మౌనంగా  ఎందుకున్నారో  అర్ధంకాలేదు. గడియారం చూస్తే పది గంటలు కావస్తోంది. ఇంతలో నిఖిల్ హడావుడిగా పేపర్ పట్టుకుని వచ్చి__

    "అక్కా! హరిణిని గోకుల్  గొంతుపిసికి  చంపేశాడట- డాక్టరుగారు ఆమె కడుపులో వున్నది ఇద్దరూ ఆడకవలలని అనుమానించడంవల్ల. కానీ ఇప్పుడు  రిపోర్టు చూస్తే ఇద్దరూ మగపిల్లలేనట...." ఇక అతడు చెప్పే మాటలేవీ  చెవికి  సోకడం లేదు మంజరికి. "గొంతుపిసికి  చంపేశాడు...." పేపర్లో తాటికాయంత అక్షరాలతో వార్త.

    "నాకేదో భయంగా వుందే! నాకేదన్నా  అయితే గోకుల్  సంయుక్తని సరిగ్గా  చూడడని నా భయం." హరిణి మాటలు.

    మంజరికి కళ్ళు  తిరుగుతున్నట్టయింది. గోకుల్ నే గొంతుపిసికి  చంపెయ్యాలనిపించింది. పేపర్ తీసి  మళ్ళీ మళ్ళీ చదివింది.

    "మరో నాలుగయిదు రోజుల్లో ప్రసవిస్తుందనగా, డాక్టరు ఆడపిల్లలేమోనని  వెలిబుచ్చిన  అవమానంతో భార్య గొంతుపిసికి  చంపిన కర్కోటకుడైన భర్త ఉదంతం. చంపేసి  ఆత్మహత్యగా పోలీసులను పిలిపించి చెప్పాడట. అయితే ఆమె చావుకి పూర్వం బాగా పెనుగులాడినట్లు  అక్కడి దృశ్యాన్ని బట్టి  ఊహించిన  పోలీసులు, శవాన్ని  పోస్ట్ మార్టమ్ చెయ్యగా తేలింది అది హత్యనీ, కవలలు మగపిల్లలనీను, గోకుల్ ని అరెస్టు చేసి కస్టడీలోకి  తీసుకున్నారనీను."

    కారు బయటికి  తీసి నిఖిల్ నెక్కించుకుని హరిణి ఇంటికి వెళ్ళింది. ప్రశాంతంగా నిద్రపోయేలా ఉంది హరిణి మొహం. శవం మీదపడి  గుండెలవిసిపోయేలా, భూదేవి కంపించిపోయేలా, మహిళలందరూ  మాన్పడిపోయేలా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది మంజరి.

    "ఈ కన్నీటి వీడ్కోలు  కోసమా  తను ఇండియా కొచ్చింది?" నెత్తీనోరూ  కొట్టుకుంది మంజరి.

    "కాదు! నువ్వొచ్చింది మామూలు మహిళల్లా ఏడవడానికి కాదు! మహిషాసుర మర్ధనిలా విజృంభించు! గోకుల్ లాంటి గోముఖ వ్యాఘ్రాలను  మట్టు బెట్టు. సంయుక్తలాంటి  అమాయకులు బలై పోకుండా  కాపాడు! నీలో ఆ శక్తుంది! లే! మహిళాశక్తిని కూడగట్టుకో! అడుగు ముందుకు వెయ్!"

    "ఎక్కడివా మాటలు?" అంటూ విస్తుపోయి  అటూ ఇటూ చూసింది మంజరి.

    ఎదురుగుండా  వున్న ఫోటోలో  త్రిశూలంతో కాలిమువ్వలతో, ఎర్రటి తిలకంతో మహిషాసురమర్ధని ఫోజులో వున్న హరిణి ఫోటోలోంచి  వినబడ్డట్టనిపించింది.     

    మంజరి లేచి నుంచుంది!

    ఫోటోకేసి చూసింది!

    'జయజయహో మధుసూదనకామిని రమ్యకవర్ధని' అంటూ  త్రిశూలంతో సాక్షాత్తూ  జగన్మోహకారి శాంభవిలాగే  అనిపించింది. కర్తవ్యం బోధపడ్డట్టు  చేతులెత్తి నమస్కరించింది. కారు కేసి చూస్తున్న గోకుల్ వైపు కాండ్రించి వుమ్మేసి కారెక్కింది మంజరి.


        *    *    *


    వెండి కొండల మధ్య తారామండలాన్ని  దాటి రివ్వున ఎగిరిపోతూన్నట్టు  వెళుతోంది ఇండియన్ ఏర్ లైన్స్ వారి విమానం.

    ముందు సీట్లోని మోనికా, సంయుక్త మాత్రం ఏవేవో సీరియస్ గా మాట్లాడేసుకుంటున్నారు.

    వెండి వెన్నెల వెలుగు జిలుగుల్లో  మహారాజులా  వెలిగిపోతున్నాడు శశాంకుడు.

    "ఇవాళ పౌర్ణమి కదూ!" గుర్తుకి తెచ్చుకుని చందమామని చూస్తూండిపోయింది మంజరి కిటికీ అద్దాల్లోంచి, వింత వింత ఆలోచనలతో సతమతమయిపోతూ.

    గోకుల్ కి ఉరి శిక్ష పడుతుంది! అప్పటికిగానీ హరిణికీ, హరిణితోపాటు మరణించిన ఇద్దరు చిన్నారి పాపలకి మనశ్శాంతి లభించదు. ఆడవాళ్ళు అబలలు కారు. పెదవి విప్పనంతవరకే, గడపదాటనంతవరకే వాళ్ళు అబలలు! విజృంభించారో ఏ శక్తీ వారిముందు ఆగలేదు! అందుకు నాటి పురాణ గాథలూ, చరిత్రలే అక్కర్లేదు - నేడు నడుస్తూన్న చరిత్ర చాలు సాక్ష్యాలకి.

    "పురుష పుంగవులు  ఇప్పటికైనా  ఆమె శక్తి సామర్ధ్యాలను గుర్తిస్తే చాలు! ఆమెకి కిరీటం పెట్టి కొలవమని చెప్పడం లేదు. కనీసం తమనీ మనుషులుగా వారి ఇష్టాయిష్టాలని గౌరవిస్తే చాలు - ఈ పోరాటం, ఈ వాదం సమసిపోతుంది. భూతలమే స్వర్గతుల్యమనిపిస్తుంది." ఆవేశంగా భర్తతో చెప్పింది మంజరి.

    శ్రీరాం ఆప్యాయంగా భార్య తల నిమురుతూంటే  అందులో ఎన్నో భావాలు స్పురించాయి. విమానం పక్షిలా గాలిలో  ఎగిరిపోతూ ఉంటే, చందమామని చూసి తృప్తిగా నవ్వుకుంది మంజరి.