Facebook Twitter
ఓనకే ఓబవ్వ

ఓనకే ఓబవ్వ

- G.పుష్ప

ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న చిత్రదుర్గలో పుట్టింది ఓబవ్వ. 18వ శతాబ్దికి చెందిన ఓబవ్వ గురించి తెలీనివాళ్ళు ఆ ప్రాంతంలో లేరంటే అతిశయోక్తి కాదు. మహిళల స్థైర్యానికీ, ధైర్య సాహసాలకూ పెట్టిన పేరైన ఓబవ్వను కర్ణాటక వాసులు ఈనాటికీ గర్వంగా తలచు-కుంటుంటారు.

ఆరోజుల్లో చిత్రదుర్గను 'మదకరి నాయకుడు' అనే రాజు పరిపాలించేవాడు. చిత్రదుర్గను శత్రువుల బారి నుండి కాపాడు-కోవటంలోనే ఆయన సమయం అంతా వెచ్చించాల్సి వచ్చేది. మైసూరుకు చెందిన హైదరాలీ చిత్రదుర్గనును వశం చేసుకోవాలని అనేక సార్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఏమాత్రం సందు దొరికినా హైదరాలీ సైన్యం రాజ్యాన్ని అతలా కుతలం‌చేస్తుంది.

అందుకని మదకరి నాయకుడు కోట రక్షణకోసం అనేక అంచెల కావలి ఏర్పరచాడు. ఓబవ్వ భర్త కోట బురుజుకు కావలి. కోట దరిదాపుల్లోకి ఎవరైనా శత్రువులు వస్తే, శంఖం ఊది సైనికులను పిలవటం అతని పని. అతను అలా శంఖం ఊదగానే ఇలా సైనికులు వచ్చి యుద్ధం చేసి శత్రువులను ఓడించేసేవాళ్ళు. అలా ఆమె భర్త పని ప్రమాదంతో కూడుకున్నది కాకపోయినా, బాధ్యతతో కూడుకున్న పని అన్నమాట. ఒకనాడు మధ్యాహ్నం ఓబవ్వ భర్త భోజనానికి ఇంటికి వచ్చాడు. భర్తకు భోజనం వడ్డించి, ఓబవ్వ నీళ్లకోసం చూసింది. చూడగా కడవలో నీళ్లు లేవు. బిందె తీసుకొని నీళ్లకు బయలుదేరిన ఓబవ్వ చెరువు దగ్గరికి చేరుకునేసరికి, ఘోరమైన ప్రమాదం ఒకటి ఆమె కంట పడింది.

కోట వెనుకవైపున గోడకు నేలబారున ఒక చిన్న రంధ్రం పడి ఉన్నది. ఆ రంధ్రంగుండా హైదరాలీ సైనికుడు ఒకడు కోటలోపలికి దూరుతున్నాడు. వాడి వెనుక ఇంకా చాలా మంది సైనికులే ఉండి ఉండాలి!

ఓబవ్వ బిందెను అక్కడే పడేసి భర్తను హెచ్చరించేందుకని ఇంటికి పరుగెత్తింది. భర్త ఇంట్లో నిదానంగా భోజనం చేస్తున్నాడు. అన్నం తింటున్న భర్తను తొందర పెట్టటం ఇష్టం కాలేదు ఓబవ్వకు. మరి ఏం చేయాలి? అతనికి ఏమీ చెప్పకుండానే పోయి, మూలగా ఉంచిన 'ఓనకే '(రోకలి బండ)ను చేత పుచ్చుకొని, కోట వెనుకవైపుకు పరుగుతీసింది ఓబవ్వ.

ఆ సమయానికే శత్రు సైనికుడు ఒకడు సన్నటి ఆ రంధ్రం లోంచి లోపలికి దూరుతున్నాడు. పరుగున అక్కడికి చేరుకున్న ఓబవ్వ, తన చేతిలో ఉన్న రోకలిబండతో వాడి నెత్తిన ఒక్కటిచ్చింది. వాడు దిమ్మెరపోగానే వాడిని లాగి లోపల పడేసింది. ఈ సంగతి తెలీని శత్రు సైనికులు ఒక్కరొక్కరే లోనికి దూరటం, ప్రక్కనే రుద్రమూర్తిలా నిలబడ్డ ఓబవ్వ వాళ్లను కొట్టి ఈడ్చి పడెయ్యటం జరుగుతూ పోయింది.

ఓబవ్వ భర్త భోజనం ముగించుకొని, లేచి వచ్చి చూస్తే ఓబవ్వ కనబడలేదు. అతను ఓబవ్వను వెతుక్కుంటూ చూసేసరికి, కోట వెనుక గోడకు రంధ్రం పడి ఉన్నది! గోడ వారగా నిలబడ్డ ఓబవ్వ రోకలిబండతో శత్రు సైనికుడొకణ్ణి చితక బాదు తున్నది. ఆమె వెనుక వందలాది మంది శత్రుసైనికులు కుప్పగా పడి ఉన్నారు!

అలికిడికి వెనక్కి తిరిగిన ఓబవ్వ భర్తను హెచ్చరించి, శంఖం ఊదమన్నది. అతను శంఖం ఊదగానే సైనికులు సచేతనమై పరుగున వచ్చారు. "వెళ్ళండి !మన రాజ్యాన్ని నాశనం చేసేందుకు వచ్చిన దుష్టులు ఇంకా ఎక్కడున్నారో వెతికి మట్టుపెట్టండి" అని అరిచింది ఓబవ్వ.

సైనికులు కోట రక్షణలో మునిగారు. అయితే అప్పటికే తప్పించుకున్న శత్రు సైనికుడొకడు వెనుకనుండి వచ్చి, ఓబవ్వను కత్తితో పొడిచాడు. వెంటనే వెనక్కి తిరిగిన ఓబవ్వ రుద్రకాళిలా అతన్ని కూడా సంహరించింది. కానీ ఆమెకు గాయం బలంగా తగిలింది. దాన్నుండి ఓబవ్వ ఇక కోలుకోలేకపోయింది. రాజ్య సంరక్షణలో ఆమె అసువులు బాసింది.

ఓబవ్వ ఆనాటినుండి ఓనకే ఓబవ్వ (రోకలిబండ ఓబవ్వ) అయింది. కన్నడ మహిళల స్థిర చిత్తానికీ, దేశభక్తికీ, ధైర్య సాహసాలకూ ప్రతీకగా నిలిచింది.

చిత్రదుర్గలోని క్రీడాప్రాంగణానికి "ఓనకే ఓబవ్వ క్రీడా ప్రాంగణం" అని పేరు.

 

కొత్తపల్లి.ఇన్ వాటి సౌజన్యం తో