TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
పల్లె కాకి
- మంజునాథ్
పల్లె కాకికి బోరుకొట్టింది. పట్నం మీదికి మనసు మళ్ళింది. అక్కడ దొరికే మాంసపు ముక్కలూ, స్వీట్ల దుకాణాల బయట పడేసే స్వీటుముక్కలూ, మార్కెట్లలో దొరికే కూరగాయల ముక్కలూ మొదలైన వాటిని గూర్చి ఎప్పుడో విన్న మాటలన్నీ దానికిప్పుడు గుర్తుకు వచ్చి, పట్నమంటే విపరీతమైన మోజుపుట్టింది.
ఆ ఆలోచనరాగానే దానికి పల్లెటూరిమీద ఏవగింపు కలిగింది. ఈ పల్లెలో ఏముందని, ఇక్కడుండాలి? ఇక్కడేమీ లేదు. సుఖమైన జీవితం గడపాలంటే ‘పట్నమే నయం ’ అని తనకు తానే చెప్పుకుని పట్నంవైపుకు ఎగిరింది. పల్లె పొలిమేరలోకి వెళ్ళగానే, దున్నుతున్న రేగడి మడిలో పురుగులను ఏరుకొని తింటున్న కాకుల గుంపు ఒకటి కనిపించింది. ఎలాగూ వెళుతున్నాను కదా, ఓసారి మావాళ్ళని మాట్లాడించి వెళదామనుకొని మడిలో వాలింది. మిగిలిన కాకులన్నీ అది రావటం చూసి కావు కావుమని పిలిచాయి.
అప్పుడు ఈ కాకి అన్నది: "నేను ఇక్కడికి ఊరికే తినడానికి రాలేదు. ఎప్పుడూ ఒకటే తిండి గోల తప్ప, ఇక్కడ ఇంకోటి ఉండదు. అందుకే నేను పట్నం వెళుతున్నాను" అని. అదివిన్న కాకులు దానివైపు అదోలాగ చూశాయి. అప్పుడు ఆ గుంపులోని ముసలి కాకి ఒకటి 'బంగారంలాంటి చోటునొదలి పట్నం వెళ్ళడమేమిటి? నీ అవివేకం కాకపోతే?' అన్నది.
అప్పుడు ఈ కాకి 'ఒసేయ్! ముసలిదానా, నీకేమి తెలుసని నన్ను అవివేకి అంటున్నావే? ఇక్కడేముందని ఉండాలే? ఎప్పుడూ ఈ నేలలోని పురుగులను ఏరుకు తినడం, లేకపోతే ఆ చెట్లపైన వాలి, ఆ పల్లె జనం ఎప్పుడు నాలుగు ముసర మెతుకులు చల్లుతారా అని కాచుకుకూర్చోవడం తప్ప?' అన్నది కోపగించుకుంటూ.
ఆ మాటలకు బదులిస్తున్నట్లు ముసలి కాకి , 'నీకేదో పట్నం మోజు పట్టినట్టుంది. ఇలాంటి ఆలోచనలు మనుషులకే వస్తాయి. 'చేసుకున్నమ్మకు చేసుకున్నంత ' అని, అనుభవిస్తావులే' అన్నది.
ఆ మాటలకు కాకమ్మకు చిర్రెత్తుకొచ్చింది. 'ఏమిటీ! నా మాటలూ, ఆలోచనలూ మనుషుల్లాంటివిగా ఉన్నాయా? 'గాడిదకేమి తెలుసు గంధపు చెక్కల వాసన' అని, నీలాంటి ముసలిదానికేం తెలుస్తుంది, పట్న వాసం గురించి? అయినా నీలాంటి అవివేకికి చెప్పిన నాది బుద్ధి తక్కువ. వస్తానమ్మా తల్లీ!' అని చిర్రుబుర్రులాడుతూ ఎగిరిపోయింది. సాయంత్రానికి పట్నం చేరుకుంది. ఆ రాత్రికది అక్కడే ఎక్కడో పడుకున్నది.
తెల్లవారింది. దగ్గరలోని రైల్వేస్టేషనుకు ఎగిరింది కాకి. అక్కడదానికి బోలెడన్ని కాకులు కనిపించాయి. కానీ అవి పల్లె కాకుల్లా దీన్ని పిలవటం లేదు. దేనికవి వాటి పనులు చేసుకుంటున్నాయి. కాకులే కాదు, బోలెడన్ని పందికొక్కులూ కనిపించాయి. దానికి పట్టరాని సంతోషం కలిగింది. చచ్చి పడిఉన్న పంది కొక్కుల్ని కడుపునిండా తిని, ఇతర ప్రాంతాలను చూద్దామని పట్నంపైకి ఎగిరింది. చాలా తిరిగింది. రైల్వే స్టేషన్లూ, బస్టాండులూ, మార్కెట్లూ, వీధులూ, సందులూ, గొందులూ అన్నీ తిరిగింది. అది వెళ్లిన ప్రతీ చోటా దానికి ఆహారం బాగా లభించేటట్టుంది. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు బాగానే ఉన్నాయి. వీధులలోని మురికి కాలువలలో ఎలుకలు చాలానే ఉన్నాయి. అబ్బో ఎంత పెద్ద పట్నమో! ఎంతదూరం ఎగిరినా పట్నమే. ఇక్కడ నివసించడానికేం కొదవలేదు' అనుకున్నది కాకి.
ఆ సరికి కొత్త మోజులో కాకి చాలానే తిరిగింది. అయినా అప్పటికి సమయం ఇంకా ఏడు గంటలే. ఇక మొదలయింది వాహనాల హోరు! ఎక్కడ చూసినా జనాలే జనాలు. వాహనాల చప్పుళ్ళు, పొగవాసనలు. ఎక్కడైనా వాలదామంటే జనాలు అడ్డం వస్తున్నారు. ఎక్కడా కాకి వాలేంత చోటుకూడా దొరకటం లేదు. ఆశగా అది చెట్టుకోసం చూసింది. చెట్టుపైన వాలడానికి చాలా దూరమే వెళ్ళాల్సి వచ్చింది. సాయంత్రమయింది, రాత్రయింది. జనాలే జనాలు. అక్కడ కాసేపూ, ఇక్కడ కాసేపూ వాలి దొరికినవేవో తిన్నది. చాలా అలసిపోయి వొళ్లుమరచి నిద్రపోయింది. కానీ కాసేపటికే అది మేలుకోవాల్సి వచ్చింది. అక్కడ కోడిపుంజులు కూసి మనుషులను లేపడానికి బదులు, మనుషులే కోళ్ళను లేపేటట్టున్నారు. ఎప్పుడు నిద్రపోయారో, ఎప్పుడు లేచేశారో, తెలీటం లేదు. నిద్రపోదామన్నా కాకికి నిద్రరానివ్వటం లేదు అక్కడి శబ్దాలు! తట్టుకోలేక, కాసేపటికి అదీ లేచి రోజువారీ పనిలోకి దూకింది. రోజంతా ఏం చేస్తున్నదో తెలీలేదు, కానీ సమయం మాత్రం గడిచిపోతున్నది!
ఇలా కొంత కాలం గడచింది. కాకికి ఇప్పుడు నిజమైన పట్నం కనిపిస్తోంది. అక్కడ దొరికే ఎలుకలంటే వెగటు పుట్టింది. అవన్నీ ఇప్పుడు కంపుగొడుతున్నట్లు తోస్తున్నాయి. చెత్తబుట్టలు, మురికి గుంటలు వికారం అనిపించ సాగాయి. సరిగ్గా అప్పుడే దానికి జ్వరం వచ్చింది. పల్లెలో అయితే వేపకాయల గుజ్జుతినగానే జ్వరం నయమయేది. అక్కడ దానికి వేపచెట్టు దొరకటమే గగనమయింది. ఆ దుమ్ము, పొగల మధ్య మందు మొక్క ఒక్కటీ కనబడలేదు. 'ఇక ఒక సారి పల్లెకు వెళితే బాగుండును' అనిపించింది కాకికి. మెల్లిగా పల్లెకు ఎగిరిపోయింది. రెండు రోజుల్లో జ్వరం నయమైంది. ఆపైన ఇక కాకికి పట్నం వెళ్ళాలనే ఆలోచనే రాలేదు.