Facebook Twitter
మన రావూరి

మన రావూరి ఇక మనకి లేరు

     వీరు 1927 జూలై 5వ తేదీన కృష్ణా జిల్లా లోని నందిగామ తాలూకా కంచికచర్ల సమీపంలోని మొగులూరు (నాటి హైదరాబాదు సంస్థానంలోని) గ్రామంలో రావూరి కోటయ్య మరియు మల్లికాంబ దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం 8వ తరగతి వరకే సాగింది. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు. తొలి నాళ్ళలో రావూరి భరద్వాజపై చలం ప్రభావం ఎక్కువగా ఉండేది. యుక్త వయసులోనే తెనాలి చేరి అక్కడ ఒక ప్రెస్సులో పనిచేయటం ప్రారంభించాడు. కొన్నాళ్ళ తర్వాత ఒక పత్రికకు ఉపసంపాదకుడైనాడు. ఆత్మాభిమానం కించపరచే ఒక సందర్భంలో తాళలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్‌మన్‌గా పనిచేశాడు. అక్కడ కూడా యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉన్నాడు. రావూరి భరద్వాజ గారి వివాహం 1948 మే 28 తేదీన శ్రీమతి కాంతం గారితో జరిగింది. వీరికి ఐదుగురు సంతానం. రవీంద్రనాథ్, గోపీచంద్, బాలాజీ, కోటీశ్వరరావు మరియు పద్మావతి. ఇతని భార్య1986 ఆగష్టు 1వ తేదీన పరమపదించింది. ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి మరియు రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస మరియు ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు మరియు ఐదు రేడియో కథానికలు రచించాడు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు. చివరకు 1987లో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశాడు. రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశారు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా రాశారు. మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రికలో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం. సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన.
రావూరి భరద్వాజ గారికి లభించిన డాక్టరేట్లు, పురస్కారాలు :
రావూరి భరద్వాజకు 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం గౌర్రవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి.
 
  1980 - కళాప్రపూర్ణ - ఆంధ్ర విశ్వవిద్యాలయం.
    1983 - కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.
    1985 - సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం ఇనుక తెర వెనక కు లభించింది.
    1987 - రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు
    1987 - తెలుగు కళాసమితి కె.వి.రావు, జ్యోతిరావు అవార్డు
    2007 - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు
    2008 - లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం (వినూత్న సాహితీ ప్రక్రియ కల్పించినందుకు, డిసెంబర్ 4 వ తేదీన ప్రకటించారు)
    2011 - కేంద్ర సాహిత్య అకాడమీ, వంగూరి ఫౌండేషన్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారాలు.
    2012 - జ్ఞానపీఠ అవార్డు తెలుగు సినిమా ప్రపంచంలోని వెలుగుల వెనుక చీకటిని ఆవిష్కరిస్తూ రచించిన పాకుడురాళ్ళు నవలకు ఈ గౌరవం దక్కింది.
2012వ సంవత్సరానికి గాను రావూరి భరద్వాజ దేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తెలుగు సాహిత్యకారుల్లో రావూరి భరద్వాజ మూడోవారు. విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణ రెడ్డి ఇది వరకు ఈ అవార్డును పొందారు. తీన్‌మూర్తి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో సరోద్ వాయిద్య కళాకారుడు ఉస్తాద్ అమ్జాద్ అలీ ఖాన్ చేతుల మీదుగా రావూరి భరద్వాజకు ఇటీవలే జ్ఞానపీఠ్ అవార్డును స్వీకరించారు. కొంత కాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న రావూరి భరద్వాజగారు హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచి తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన అంత్యక్రియలు శనివారం మెహదీపట్నంలో జరుగుతాయ్.